జర్నలిస్టులకు భద్రత కరవు.. హెచ్చరిస్తున్ననివేదికలు

జర్నలిస్టులకు భద్రత కరవు.. హెచ్చరిస్తున్ననివేదికలు

కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్ నిర్వహించిన దర్యాప్తు ప్రకారం 2017లో రికార్డ్ స్ధాయిలో 262 జర్నలిస్టులు జైలు పాలయ్యారు. వరుసగా రెండో ఏడాది.. ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఎక్కువగా.. టర్కీలో 73 మంది జర్నలిస్టులు అరెస్టయ్యారు. 2016లో ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రయత్నం జరగగా, జర్నలిస్టులు తీవ్రవాద చర్యలకు పాల్పడ్డారంటూ విరుచుకుపడ్డారు టర్కీ అధికారులు.

2017లో ఇరాక్, సిరియాలోని యుద్ధ ప్రభావిత ప్రాంతాలు జర్నలిస్టులకు ప్రాణాంతకంగా ఉంటున్నాయి. రోడ్డు పక్కన బాంబు పేలడంతో మరణించిన కర్డిష్ రిపోర్టర్ షిఫా గార్డీ సహా కనీసం 15 మంది చనిపోయారు.

2017లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 42 మంది జర్నలిస్టులు.. విధి నిర్వహణలో ఉండగా చనిపోయారు.

యుద్ధ ప్రభావిత ప్రాంతాలను పక్కన పెడితే, గత ఏడాది ఆరు హత్యలతో మెక్సికో అత్యంత ప్రమాదకర ప్రాంతంగా నిలిచింది. మే నెలలో.. ఉత్తర మెక్సికోలోని కులియాకాన్‌లో జర్నలిస్ట్ హావియే వాల్డెజ్ కార్డెనాస్‌ను ఆయన కారు నుంచి బయటకు లాగి, తుపాకీతో కాల్చి చంపారు.

యూరోప్‌లో పాత్రికేయులపై హింస చాలా అరుదు. అయితే అక్టోబర్‌లో మాల్టా దేశంలో.. డాఫ్నె కరువానా గలిజియా కారు పేలుడులో మరణించారు. రిమోట్ కంట్రోల్ ద్వారా ఆమె కారులో అమర్చిన బాంబును పేల్చివేశారని దర్యాప్తులో తేలింది. అవినీతిపై రిపోర్ట్ చేసినందుకు గలిజియాను హత్య చేస్తామని బెదిరించారు.

డెన్మార్క్‌లో.. పీటర్ మాడ్సెన్ నిర్మించిన సబ్ మెరీన్‌లోకి ప్రవేశించిన స్వీడిష్ ఫ్రీ లాన్స్ రిపోర్టర్ కిమ్ వాల్ మరణించింది.

రిపోర్టర్లు ఎక్కడున్నారో, వారి భద్రత ఎలా ఉందో చూసే ఎడిటర్ల పర్యవేక్షణ లేని ఫ్రీ లాన్సర్లకు ఎటువంటి ప్రమాదాలు ఎదురవుతాయో.. వాల్ మరణం చాటిందని 'ద కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్' అంటోంది. ప్రపంచవ్యాప్తంగా హత్యలకు గురైన రిపోర్టర్లలో మూడో వంతు ఫ్రీ లాన్సర్లే.

హత్యకు గురైన, జైలు పాలైన విలేకరుల సంఖ్య.. వాస్తవాలను అందించేందుకు కృషి చేసే జర్నలిస్టులు ఎంత ప్రమాదంలో ఉన్నారో చెబుతోంది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)