పాకిస్తాన్‌కు ఆర్ధిక సాయం నిలిపేసిన అమెరికా

  • 5 జనవరి 2018
ట్రంప్ పాకిస్తాన్ నిరసనలు Image copyright Getty Images

ఉగ్రవాద సంస్థలను నియంత్రించడంలో పాకిస్తాన్ విఫలమైందని అమెరికా చెబుతోంది. టెర్రర్ నెట్‌వర్క్‌లపై కఠిన చర్యలు తీసుకోనంత వరకు సాయం నిలిపేస్తామని ప్రకటించింది.

పాకిస్తాన్‌కు ఇస్తున్న సైనిక సాయాన్ని నిలిపేసినట్లు అమెరికా ప్రభుత్వం చెబుతోంది.

పాక్ భూభాగం నుంచి పని చేస్తున్న ఉగ్రవాద సంస్థలను ఆ దేశ ప్రభుత్వం కట్టడి చేయడం లేదని ఆరోపించింది.

హక్కానీ నెట్‌వర్క్, అఫ్గానిస్తాన్‌ తాలిబాన్‌లపై చర్యలు తీసుకునే వరకు నిధులు ఇవ్వబోమని అమెరికా స్పష్టం చేసింది.

బిలియన్ డాలర్ల సహాయం పొందిన పాకిస్తాన్ తమను మోసం చేస్తోందని ఈ వారం ప్రారంభంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.

Image copyright EPA
చిత్రం శీర్షిక పాకిస్తాన్ ప్రధాని షాహిద్ ఖకాన్ అబ్బాసీ

అయితే, ట్రంప్ ఆరోపణలను పాకిస్తాన్ ఖండించింది.

అమెరికా అధికారులు పూర్తి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని పాకిస్తాన్ పేర్కొంది.

దశాబ్దాలుగా పాకిస్తాన్ చేస్తున్న త్యాగాన్ని అమెరికా మర్చిపోయిందని ఆరోపించింది.

భారతదేశం, అఫ్గానిస్తాన్‌ మాత్రం అమెరికా చర్యలను స్వాగతించాయి.

పాకిస్తాన్‌లో వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్న చైనా మాత్రం అమెరికా తీరును తప్పుబట్టింది. పాకిస్తాన్‌కు మద్దతు తెలిపింది.

పాకిస్తాన్‌కు ఇవ్వాల్సిన 225 మిలియన్ డాలర్ల ఆర్ధిక సాయాన్ని అమెరికా ఇప్పటికే నిలిపేసింది.

అయితే, మొత్తం ఎన్నికోట్ల నిధులను నిలిపేశారో చెప్పడానికి అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి హీథర్ నిరాకరించారు.

అఫ్గానిస్తాన్‌ తాలిబాన్, హక్కానీ నెట్‌వర్క్ ఆ ప్రాంతాన్ని అస్థిరపరుస్తోందని, అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుంటోందని తాము భావిస్తున్నామని ఆమె తెలిపారు.

మత స్వేచ్ఛ విషయంలో పాకిస్తాన్‌ తీవ్రమైన ఉల్లంఘనలు చేసినట్లు అమెరికా భావిస్తోంది. అందుకే పాకిస్తాన్‌ను ఒక ప్రత్యేక జాబితాలో చేర్చి నిశితంగా పరిశీలిస్తోంది.

పరిష్కారం కాని సమస్య

బార్బర ప్లెట్ ఉషర్, బీబీసీ విదేశాంగ శాఖ ప్రతినిధి

అఫ్గానిస్తాన్‌ తాలిబాన్‌, దాని అనుబంధ సంస్థలకు పాకిస్తాన్‌ స్వర్గధామంలా మారిందని ఎంతోకాలంగా అమెరికా, ఇతర దేశాలు భావిస్తున్నాయి.

అఫ్గానిస్తాన్‌లో దాడులు చేసేలా తాలిబాన్, హక్కానీ నెట్‌వర్క్‌లను పాకిస్తాన్ ప్రోత్సహిస్తోందని అవి చెబుతున్నాయి.

అయితే, పాకిస్తాన్ మాత్రం ఈ ఆరోపణలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోంది.

కానీ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన నాటి నుంచి పాకిస్తాన్‌పై ఒత్తిడి మరింత పెంచారు.

9/11 దాడుల తర్వాత పాకిస్తాన్‌ అయిష్టంగానే అమెరికాతో కలిసి ఉగ్రవాదంపై పోరాటం చేస్తోంది.

ప్రతిఫలంగా అగ్రరాజ్యం నుంచి బిలియన్ డాలర్లను ఆర్ధిక సాయంగా పొందుతోంది.

పాకిస్తాన్ చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అమెరికా అప్పడప్పుడు నిధులు తగ్గిస్తూ వస్తోంది. కానీ రెండు దేశాల మధ్య స్నేహబంధం మాత్రం కొనసాగుతోంది.

ఇస్లామిక్ సంస్థలతో పోరాటం వల్ల తాము ఎంతో నష్టపోయామని, ఈ విషయాన్ని ట్రంప్ గుర్తించడం లేదని పాకిస్తాన్ చెబుతోంది.

హక్కానీ నెట్‌వర్క్‌కు పాకిస్తాన్ సాయం!

పాకిస్తాన్‌లోని హక్కానీ నెట్‌వర్క్ అఫ్గానిస్తాన్‌లో తన కార్యకలాపాలను సాగిస్తోంది. ఆ సంస్థ కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగేందుకు పాకిస్తాన్ సహాయం చేస్తోందని చాలా ఏళ్లుగా ఆరోపణలు ఉన్నాయి.

ఈ సంస్థకు అఫ్గానిస్తాన్‌ తాలిబాన్‌తో సంబంధాలు ఉన్నాయి.

ఇది అఫ్గానిస్తాన్‌ ప్రభుత్వానికి ముప్పుగా మారుతోంది.

పాకిస్తాన్ తాలిబాన్ సంస్థలు అఫ్గానిస్తాన్‌ తాలిబాన్‌తో కలిసి పాకిస్తాన్‌లో కూడా దాడులు చేస్తున్నాయి.

అఫ్గానిస్తాన్‌లో దాడులకు హక్కానీ నెట్‌వర్క్, అఫ్గానిస్తాన్‌ తాలిబాన్‌లకు పాకిస్తాన్ ఐఎస్ఐ సహాయం చేస్తోందని, ఈ దాడుల్లో అమెరికా సైనికులు, అధికారులు చనిపోతున్నారన్న వాదన ఎంతోకాలంగా ఉంది.

హక్కానీ నెట్‌వర్క్ సభ్యుడిని కలిసేందుకు అమెరికా అధికారులకు పాకిస్తాన్ అధికారులు గతేడాది అనుమతి ఇవ్వలేదని న్యూయార్క్ టైమ్స్ పత్రిక కథనం ప్రచురించింది.

Image copyright EPA

పాకిస్తాన్ వారికి ఎందుకు మద్దతు ఇస్తోంది?

తమ విదేశాంగ విధానాలు, దేశ ప్రయోజనాల కోసం అఫ్గానిస్తాన్‌ తాలిబాన్లను పాకిస్తాన్ వాడుకుంటోందన్న ఆరోపణలు చాలాకాలంగా ఉన్నాయి.

1979లో సోవియట్ దాడి తర్వాత అఫ్గానిస్తాన్‌లోని మిలిటెంట్లకు పాకిస్తాన్ ఐఎస్ఐ శిక్షణ, ఆర్ధిక సాయం చేసింది.

2001 అఫ్గానిస్తాన్‌ యుద్ధ సమయంలో తమ భూభాగాన్ని వాడుకునేందుకు సంకీర్ణ సేనలకు పాకిస్తాన్ అనుమతి ఇచ్చింది.

కానీ అఫ్గానిస్తాన్‌ మిలిటెంట్లకు సాయం చేయడం, వారికి ఆశ్రయం ఇవ్వడం మాత్రం పాకిస్తాన్‌ ఆపలేదని నిపుణులు చెబుతున్నారు.

అఫ్గానిస్తాన్‌లో భారత ప్రభుత్వ ప్రభావాన్ని తగ్గించడమే పాకిస్థాన్ లక్ష్యమని వారు అభిప్రాయపడుతున్నారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)