BBC EXCLUSIVE: హాఫిజ్ సయీద్ తనను తాను పాకిస్తాన్‌కు భారంగా భావిస్తున్నారా?

  • 6 జనవరి 2018
హాఫిజ్ సయీద్

నిషేధిత జమాత్-ఉద్-దావా చీఫ్, ముంబయి దాడుల నిందితుడు హాఫిజ్ సయీద్ బీబీసీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన రాజకీయ రంగ ప్రవేశం గురించి మాట్లాడారు.

తీవ్రవాద సంస్థ లష్కర్-ఏ-తోయిబా సంస్థాపకుడైన హాఫిజ్ సయీద్‌ను భారత్ ముంబయి దాడుల మాస్టర్ మైండ్‌గా పరిగణిస్తుంది.

బీబీసీ ప్రతినిధి షుమైలా జాఫ్రీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సయీద్ పాకిస్తాన్‌లో తన ఇమేజి, తనపై ఉన్న ఆరోపణలు, భారత ప్రధాని నరేంద్ర మోదీపై తన అభిప్రాయం మొదలైన అంశాలపై మాట్లాడారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionబీబీసీ ఎక్స్‌క్లూజివ్ : జమాత్-ఉద్-దావా ఛీఫ్ హఫీజ్ సయీద్‌ ఇంటర్వ్యూ

రాజకీయ ప్రవేశం గురించి

తాను రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్టు హాఫిజ్ సయీద్ ఇటీవలే ప్రకటించారు. "ఆయన మిల్లీ ముస్లిం లీగ్ (ఎంఎంఎల్) అనే పేరుతో ఒక పార్టీని ఏర్పాటు చేశారు. అయితే పాకిస్తాన్ ఎన్నికల సంఘం ఆ పార్టీని ఎన్నికలలో పాల్గొనకుండా అడ్డుకుంది.

రాజకీయాల్లోకి ప్రవేశించడానికి కారణమేంటని అడిగినప్పుడు, "ప్రస్తుతం పాకిస్తాన్‌ను ఏకం చేయాల్సిన, పాకిస్తానీ ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ఈ పునాదిపైనే మేం రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నాం" అని హాఫిజ్ అన్నారు.

ఇన్ని వివాదాలలో ఇరుక్కొని ఉన్న తాను పాకిస్తాన్‌ను ఎలా ఏకం చేయగలరని అడగగా, "నేనెవరో ప్రజలకు తెలుసు. నన్ను వారు గుర్తిస్తారు, అర్థం చేసుకుంటారు" అని హాఫిజ్ సయీద్ చెప్పారు.

తాను ముస్లిం లీగ్ వేదికగానే రాజకీయాల్లోకి రాదలచుకున్నారా అని అడగగా, "ఇన్షాఅల్లా.. తప్పక వస్తామండీ" అని అన్నారు.

చిత్రం శీర్షిక హాఫిజ్ సయీద్‌ను ఇంటర్వ్యూ చేస్తున్న బీబీసీ ప్రతినిధి షుమైలా జాఫ్రీ

ప్రధాని నరేంద్ర మోదీపై

హాఫిజ్ సయీద్‌పై చర్యలు తీసుకోవాలని భారత్ చాలా కాలంగా పాకిస్తాన్‌పై ఒత్తిడి తెస్తోంది. పాకిస్తాన్‌లో ఆయనపై భారత్‌కు వ్యతిరేకంగా ప్రసంగాలు చేసినట్టు ఆరోపణలున్నాయి.

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురించి హాఫిజ్ సయీద్‌ను ప్రశ్నించగా, హాఫిజ్ చాలా కటువైన పదజాలంతో ఆరోపణలు చేశారు. "మోదీ గురించి నా అభిప్రాయం ఏంటంటే.. నేను కేవలం వాస్తవాల ఆధారంగా మాట్లాడుతాను. ఊహలపై ఆధారపడి కాదు. నరేంద్ర మోదీ ఢాకాకు వెళ్లారు. పాకిస్తాన్‌ను రెండు ముక్కలుగా చేయడంలో నా పాత్ర ఉందని ఆయన అక్కడ నిలబడి మాట్లాడారు. దీని కోసం తాను రక్తం చిందించానన్నారు."

"నన్ను, మోదీనీ ఇద్దరినీ బోనులో నిలబెట్టి ఎవరు ఉగ్రవాదో ప్రపంచమే తేల్చాలి" అని హాఫిజ్ అన్నారు.

హాఫిజ్ ఆరోపణలపై స్పందన కోసం మేం భారత విదేశాంగ మంత్రిత్వశాఖను సంప్రదించాం. అయితే ప్రస్తుతానికి వారి నుంచి ఎలాంటి జవాబూ రాలేదు.

చిత్రం శీర్షిక బీబీసీ ఇంటర్వ్యూలో హాఫిజ్

సంస్థపై నిషేధం

లష్కర్-ఏ-తోయిబా తర్వాత ఇటీవలే పాకిస్తాన్ ప్రభుత్వం హాఫిజ్‌కు చెందిన జమాత్-ఉద్-దావాపై కూడా నిషేధం విధించింది.

అంటే పాకిస్తాన్ కూడా ఆయనను అంతర్జాతీయ సముదాయం గుర్తిస్తున్నట్టుగా 'తలపై కోటి డాలర్ల రివార్డు ఉన్న ఉగ్రవాది'గా గుర్తించినట్టేనా?

ఈ ప్రశ్నకు జవాబిస్తూ హాఫిజ్, "భారత్ అమెరికాకు మద్దతుదారుగా మారిపోయింది. వారు మాపై (జమాత్-ఉద్-దావాపై) నిషేధం విధించడం మొదలుపెట్టారు. పాకిస్తాన్ ప్రభుత్వంపై ఒత్తిడి చేయడం ప్రారంభించారు. ఈ రెండు దేశాలతో పోలిస్తే పాకిస్తాన్ ఒక బలహీనమైన దేశం అన్నది వాస్తవం. మా దేశంలో అనేక ఆర్థిక ఇబ్బందులున్నాయి. ఈ కారణంగా తలెత్తుతున్న సమస్యల మూలంగానే పాకిస్తాన్ ప్రభుత్వం ప్రస్తుతం మాపై నిషేధాలు విధిస్తోంది" అని అన్నారు.

Image copyright Getty Images

ఆరోపణలు.. కోర్టులు

తాను ఎప్పుడు కోర్టుకు వెళ్లినా, కోర్టులు తన వాదనను ఆమోదించాయని హాఫిజ్ అన్నారు. తనపై మోపిన ఏ ఆరోపణా రుజువు కాలేదని ఆయన చెప్పారు.

దేశ 'సంపద' (ఎసెట్)గా భావించే వ్యక్తులపై కోర్టులలో ఆరోపణలు రుజువైతాయని ఆశించగూడదంటూ పంజాబ్ (పాకిస్తాన్) న్యాయశాఖ మంత్రి చేసిన ప్రకటనను బీబీసీ ప్రతినిధి హాఫిజ్‌కు గుర్తు చేయగా, "తీర్పులన్నీ మాకు అనుకూలంగానే వస్తున్నాయి. న్యాయశాఖ మంత్రి లేదా రక్షణ మంత్రి ఏదైనా మాట్లాడితే వారి మాటల్లో నిజమెంతో గ్రహించవచ్చు. వీళ్లంతా (నాయకులు) రాజకీయాల్లో ఒకరిపై ఒకరు పోట్లాడుకునే అలవాటున్న వారే" అని ఆయన అన్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక 2017 అక్టోబర్ 19న లాహోర్‌లో కోర్టుకు హాజరై వెళ్తున్న హాఫిజ్ సయీద్

'రక్షణ మంత్రి మీకు భయపడతారా?'

కోర్టులో మీకు అనుకూలంగా వచ్చిన తీర్పులపై పాకిస్తాన్‌లోని బాధ్యతాయుతమైన వ్యక్తులే సంతృప్తి వ్యక్తం చేయనప్పుడు, మీ వాదనలతో ప్రపంచంలో ఎలా ఏకీభవిస్తుంది?

పై ప్రశ్నకు జవాబుగా హాఫిజ్, "రెండు రోజుల క్రితమే రక్షణశాఖ మంత్రి నాకు వ్యతిరేకంగా చాలా కటువైన ప్రకటన చేశారు. మళ్లీ ఆయనే దానిపై సంజాయిషీ కూడా ఇచ్చుకున్నారు" అని అన్నారు.

అంటే రక్షణ మంత్రి మీరంటే భయపడుతున్నారా అని బీబీసీ ప్రతినిధి అడగగా, "నాకు తెలియదు" అంటూ హాఫిజ్ నవ్వుతూ జవాబిచ్చారు. ఆ వెంటనే, "కాదు, వారేమీ భయపడరు. అలహమదులిల్లాహ్, నేను గానీ, నా పార్టీ గానీ ఎవరైనా భయపడే చర్యలకు ఎప్పుడూ పాల్పడలేదు. అసలు సమస్య ఏంటంటే, పాకిస్తాన్ ఒక బలహీనమైన దేశం. పాకిస్తాన్ ముందు ఎన్నో ఆర్థిక సమస్యలున్నాయి. ప్రభుత్వం ఆర్థిక సాయం కోసం ఎప్పుడూ (పరాయి దేశాలపై) ఆధారపడాల్సి వస్తోంది" అని ఆయన చెప్పారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక 2016 జనవరి 4న ముంబయిలో హాఫిజ్ సయీద్‌కు వ్యతిరేకంగా జరిగిన ప్రదర్శన

గడచిన కొన్ని సంవత్సరాల్లో హాఫిజ్ సయీద్ కారణంగా పాకిస్తాన్‌ అంతర్జాతీయ స్థాయిలో చాలా ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి వచ్చింది.

పాకిస్తానీ పాలకులు ఆయననో 'భారం'గా భావిస్తున్నారా అన్న ప్రశ్నకు జవాబిస్తూ హాఫిజ్, "అమెరికాలో మాట్లాడుతూ ఖ్వాజా ఆసిఫ్ నన్నో 'భారం'గా అభివర్ణించారు. నేను దీనిపై ఆయనకు లీగల్ నోటీస్ పంపించాను. దానికి స్పందిస్తూ.. తన వ్యాఖ్య సరైనది కాదని ఒప్పుకుంటూ, దానికి క్షమాపణలు చెబుతున్నట్లు బదులిచ్చారు" అని అన్నారు.

అయితే దీనిని పాకిస్తాన్ ద్వంద్వ వైఖరిగా అంగీకరించడానికి హాఫిజ్ నిరాకరించారు. "వాస్తవానికి పాకిస్తాన్ తీవ్రమైన ఒత్తిడిలో ఉంది. వాళ్లకు ఎలాంటి విధానం లేదు. నేను ఆర్మీ అధికారవ్యవస్థ నుంచి పుట్టిన వ్యక్తిననడానికి వారి దగ్గర ఆధారమేముంది" అని హాఫిజ్ ప్రశ్నించారు.

తన కారణంగా పాకిస్తాన్‌కు ఎదురవుతున్న దౌత్యపరమైన ఇబ్బందుల గురించి మాట్లాడుతూ హాఫిజ్, "నా అభిప్రాయం ప్రకారం ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. పాకిస్తాన్ ఇప్పుడు తన కాళ్లపై తాను నిలబడే ప్రయత్నం చేస్తోంది. తమకు అమెరికా నుంచి ఎలాంటి సహాయం అవసరం లేదని పాకిస్తాన్ స్పష్టంగా జవాబిచ్చింది" అని అన్నారు.

"మాకు వ్యతిరేకంగా ఏ చర్య తీసుకున్నా సరే - అది అణచివేత అయినా లేదా మరేదైనా - మేం దానిపై కోర్టుకు వెళ్తాం" అని హాఫిజ్ అన్నారు.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.