అమెరికాను వణికిస్తున్న 'బాంబ్ తుపాను'

  • 6 జనవరి 2018
తుఫాను ధాటికి ఇళ్ల ముందు పేరుకుపోయిన మంచును తొలగిస్తున్న ప్రజలు Image copyright Getty Images

ఉత్తర అమెరికాలోని తీర ప్రాంతాలను ‘బాంబ్ సైక్లోన్’ వణికిస్తోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.

ఫ్లోరిడా వరకు మంచు దుప్పటి కప్పేసింది. దీంతో గురు, శుక్రవారాల్లో వేలాది విమాన సర్వీసులను రద్దు చేశారు.

అమెరికా, కెనెడాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ 29 డిగ్రీల సెంటిగ్రేడ్‌కు పడిపోతాయని వాతావరణ శాఖ భావిస్తోంది. దీనికి చలిగాలులు కూడా తోడవటంతో చలి తీవ్రత మైనస్ 67 డిగ్రీల సెంటగ్రేడ్‌ను తలపిస్తుందని తెలిపింది.

తీవ్రమైన గాలుల కారణంగా కెనెడాల్లోని వేలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అమెరికాలోని ఈశాన్య ప్రాంతాల్లో రోడ్లపై ఉన్న మంచు దిబ్బలను తొలగిస్తున్నారు.

ఈ వారాంతంలో అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి పడిపోయే అవకాశముందని, రోజువారీ ఉష్ణోగ్రతలు కూడా రికార్డు స్థాయిల్లో నమోదవుతాయని వాతావరణ శాఖ శుక్రవారం పేర్కొంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక న్యూయార్క్‌లో గడ్డ కట్టిన హడ్సన్ నది
Image copyright ADAM ABOUGALALA
చిత్రం శీర్షిక మైనస్ డిగ్రీల్లో నమోదవుతున్న ఉష్ణోగ్రతల కారణంగా వీధుల్లో నిలిచిపోయిన నీరు గడ్డకట్టింది. దీంతో బయట పార్కు చేసిన కార్లన్నీ కూడా గడ్డకట్టుకుపోయాయి
Image copyright Reuters
చిత్రం శీర్షిక తీవ్రంగా కురుస్తున్న మంచువల్ల వందలాది విమానాల రాకపోకలు రద్దయ్యాయి

బోస్టన్‌లోని ఇళ్ల ముందు.. అడుగు ఎత్తున మంచు పేరుకుపోయింది. బాంబ్ సైక్లోన్‌గా పిలుస్తోన్న ఈ తుపానుకు.. హారికేన్ స్థాయిలోని చలి గాలులు తోడయ్యాయి.

మంచు తుఫాను వల్ల ఉత్తర, దక్షిణ కెరోలినా ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో నలుగురు మరణించారు.

ఇంతవరకూ తుఫాను ధాటికి.. అమెరికాలో 19మంది, కెనెడాలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

ఫిలడెల్ఫియాలో ఏటవాలుగా ఉన్న ఓ రోడ్డుపై అదుపు తప్పిన కారు.. పక్కనే ఉన్న రైల్వే లైను పైకి దూసుకుపోయి, ఎదురుగా వస్తున్న రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించారు.

న్యూజెర్సీలో ఉష్ణోగ్రతలు మైనస్ 7డిగ్రీలుగా నమోదయ్యాయి. ఓ అపార్ట్‌మెంట్‌లో కార్బన్ మోనాక్సైడ్ విషవాయువును పీల్చడం వల్ల 13ఏళ్ల బాలిక మరణించింది. ఈ ఘటనలో మరో 35మంది అస్వస్థతకు లోనయ్యారు.

Image copyright Getty Images

అట్లాంటిక్, సెంట్రల్ కెనెడా ప్రాంతాలు బాంబ్ తుపానుతో అతలాకుతలమయ్యాయి.

మేరిటైమ్ ప్రొవిన్స్ ప్రాంతంలో గంటకు 140కి.మీ. వేగంతో ప్రచండ గాలులు వీచాయి. దీంతో.. లక్షా 25 వేల గృహాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని అధికారులు తెలిపారు.

తుఫాను ధాటికి న్యూయార్క్, ఫిలడెల్ఫియా, బోస్టన్, వర్జీనియా, ఉత్తర-దక్షిణ కెరోలినా ప్రాంతాల్లో వందల సంఖ్యలో స్కూళ్లు, షాపులు మూతపడ్డాయి.

ఉత్తర అమెరికా, తూర్పు అమెరికాల్లో సహజ వాయువు ధరలు ముందెన్నడూ లేనంతగా పెరిగాయి.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)