వేతన వ్యత్యాసం: బీబీసీ చైనా ఎడిటర్ క్యారీ గ్రేసీ రాజీనామా

  • 8 జనవరి 2018
క్యారీ గ్రేస్

బీబీసీ చైనా ఎడిటర్ క్యారీ గ్రేసీ తన పదవికి రాజీనామా చేశారు. సంస్థలో పురుష ఉద్యోగులతో సమానంగా మహిళకు వేతనాలు ఇవ్వకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

30 ఏళ్ల పాటు బీబీసీలో పని చేసిన గ్రేసీ ఓ బహిరంగ లేఖలో తన అభిప్రాయాలను వెల్లడించారు.

'వేతనాల విషయంలో బీబీసీ అక్రమ, రహస్య పద్ధతి అవలంబిస్తోంది. నిధుల విషయంలో సంక్షోభం తలెత్తినప్పుడు ఈ విషయం బయటపడింది. సంస్థలో ఏటా 1.28 కోట్లు( 1.5 లక్షల పౌండ్లు) కంటే ఎక్కువ వేతనం పొందే వారిలో మూడింట రెండు వంతుల మంది మగవారే' అని పేర్కొన్నారు.

అయితే, సంస్థలో మహిళల వేతనాల విషయంలో ఎలాంటి వివక్ష లేదని బీబీసీ తెలిపింది. బీబీసీ బీజింగ్ బ్యూరో ఎడిటర్ పదవి నుంచి మాత్రమే తాను వైదొలిగానని, ప్రస్తుతం బీబీసీలోనే ఉన్నానని గ్రేసీ చెప్పారు. గతంలో తాను పనిచేసిన టీవీ న్యూస్ రూంలో మళ్లీ విధులు నిర్వహిస్తానని అక్కడ పురుషులతో సమానంగా తనకు వేతనం లభిస్తుందని ఆశిస్తున్నాని చెప్పారు.

'బీబీసీ మీ అందరిది. దీనికి మీరు లైసెన్స్ ఫీజు చెల్లిస్తారు. ఈ సంస్థలో ఏం జరుగుతుందో తెలుసుకునే హక్కు మీకు ఉంది. ఇక్కడ సమన్యాయం జరగకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారు. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వేతనాలు చెల్లించకుండా నిరోధిస్తున్నారు' అని గ్రేసీ తన బ్లాగ్‌లో పేర్కొన్నారు.

ఏటా రూ.1.28 కోట్ల కంటే ఎక్కువ వేతనం పొందుతున్న ఉద్యోగుల వివరాలను బీబీసీ గతేడాది జులైలో వెల్లడించింది.

దాని ప్రకారం బీబీసీ అంతర్జాతీయ ఎడిటర్లగా పనిచేస్తున్న ఇద్దరు పురుషులు అదే హోదాలో పనిచేస్తున్న ఇద్దరు మహిళకంటే 50 శాతం అధికంగా వేతనం పొందుతున్నారని గ్రేసీ వెల్లడించారు.

సమాన వేతనంపై గ్రేసీ రాసిన బహిరంగ లేఖను టెలిగ్రాఫ్ పత్రిక ప్రచురించింది. వేతన వ్యత్యాసంపై గ్రేసీకు బీబీసీ యూరోపియన్ ఎడిటర్ కట్యా అడ్లెర్ మద్దతు తెలుపుతూ సంతకం కూడా చేశారు.

Image copyright @BBCCarrie

'సమాన వేతనం కోసమే'

'ది ఈక్వాలిటీ యాక్ట్ 2010' ప్రకారం లింగబేధం లేకుండా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. అయితే, గతేడాది మహిళ ఎడిటర్ల కంటే పురుష ఎడిటర్లు 50 శాతం అధికంగా వేతనం పొందారు. నన్ను ఎడిటర్‌గా నియమించి తాము లింగ సమానత్వానికి కట్టుబడి ఉన్నట్లు బీబీసీ చెప్పుకొంటుంది. ఇక మా మేనేజర్లు కూడా పురుషులతో పోల్చుకుంటే మహిళల శ్రమ తక్కువేనని తీర్మానించారు' అని గ్రేసీ పేర్కొన్నారు.

లింగబేధం చూడకుండా నలుగురు అంతర్జాతీయ ఎడిటర్లకు సమాన వేతనం చెల్లించాలని తాను బీబీసీని అడిగానని గ్రేసీ తెలిపారు.

అయితే దానికి బదులుగా నాకు వేతనాన్ని భారీగా పెంచుతామని బీబీసీ చెప్పింది. కానీ, అది కూడా సమాన వేతనం కంటే చాలా తక్కువే అని ఆమె వివరించారు.

'బీబీసీ నాకు మంచి జీతాన్నే ఇస్తుంది. కానీ, నా ప్రయత్నమంతా వేతనాల విషయంలో బీబీసీ సమానత్వం పాటించాలనే' అని ఆమె పేర్కొన్నారు.

గ్రేసీ రాజీనామా మాకు పెద్ద తలనొప్పిగా మారిందని బీబీసీ మీడియా ఎడిటర్ అమోల్ రాజన్ అన్నారు.

వేతనాల్లో అసమానత్వంపై చర్యలు తీసుకుంటామని బీబీసీ హామీ ఇచ్చింది. అయినా కూడా గ్రేసీ పొంతన లేని మాటలు మాట్లాడుతున్నారు అని ఆయన చెప్పారు.

చాలా మంది ప్రజలు, బీబీసీలోని జర్నలిస్టులు కూడా గ్రేసీకి మద్దతుగా #IStandWithCarrie, #BBCWomen హష్‌ట్యాగ్‌లతో ట్వీట్లు చేశారు.

'వివక్ష ఏం లేదు'

వేతనాల విషయంలో తాము నిష్పక్షపాతంగా ఉంటామని, కార్పొరేషన్ ఈ విషయంలో చాలా కీలకంగా వ్యవహరిస్తుందని బీబీసీ మహిళా అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.

'ఇటీవల చాలా సంస్థలు స్త్రీ, పురుష ఉద్యోగుల వేతనాలను ప్రకటిస్తోంది. వాటిని పరిశీలిస్తే బీబీసీ ఈ విషయంలో చాలా బాగుంది. అంతేకాకుండా వేతనాల్లో అసమానత్వంపై ఇప్పటికే స్వతంత్ర దర్యాప్తు జరిపించాం. వేతనాల విషయంలో మహిళపై వివక్ష చూపడం లేదని అందులో తేలింది' అని వెల్లడించారు.

గతేడాది బీబీసీలో వేతన వ్యత్యాసం ఎలా ఉందో సంస్థ ఒక రిపోర్టులో తెలిపింది. మహిళలతో పోల్చితే పురుషులకు 10.7 శాతం ఎక్కువ వేతనం చెల్లిస్తున్నట్లు తేలింది.

కాగా, 2020 లోపు వేతనాల్లో అసమానతలను తొలగిస్తామని బీబీసీ డైరెక్టర్ జనరల్ టోనీ హాల్ ఇప్పటికే హామీ ఇచ్చారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు