తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సందడి

  • 8 జనవరి 2018
sankranthi Image copyright NOAH SEELAM

కొత్త ఏడాదిలో తొలి పర్వదినం. అందమైన రంగవల్లులతో ఇప్పటికే తెలుగు నాట సంక్రాంతి హడావుడి మొదలైంది. ముగ్గులతో తెలుగు నేలంతా కళకళలాడుతోంది.

తెలుగు లోగిళ్లలో సంక్రాంతి శోభ కనిపిస్తోంది.

ఊరువాడా గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు వినిపిస్తున్నాయి.

తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా ముత్యాల ముగ్గులు అలరిస్తున్నాయి.

సాంప్రదాయ వంటకాలు నోరూరిస్తున్నాయి.

Image copyright Getty Images

మరోవైపు, విదేశాల్లో కూడా సంక్రాంతి సందడి కనిపిస్తోంది. సింగపూర్‌లో తెలుగు వారు ఎక్కువగా ఉండే ప్రాంతాలు విద్యుత్ వెలుగుల్లో మెరిసిపోతున్నాయి.ఇక, అమెరికా, కాలిఫోర్నియాలోని ఎన్‌ఆర్ఐలు సంక్రాంతి సంబరాలకు సిద్ధమవుతున్నారు. ముత్యాల ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, తెలుగు సంస్కృతికి అద్దంపట్టే పోటీలు నిర్వహిస్తున్నారు.

Image copyright Getty Images

సొంతూరికి దూరంగా పట్నంలో ఉద్యోగాలు చేస్తున్న వారంతా పల్లెకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

కొందరు ఇప్పటికే సొంతూరికి చేరగా..మరికొందరు ప్రయాణ సన్నాహాల్లో ఉన్నారు.

సంక్రాంతి ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ అదనపు బస్సులు నడుపుతోంది.

అయితే, పండగ రద్దీ నేపథ్యంలో ప్రత్యేక బస్సుల్లో చార్జీలను 50శాతం అధికంగా వసూలు చేస్తోంది.

సంక్రాంతి నేపథ్యంలో రైల్వే శాఖ కూడా ప్రత్యేక రైళ్లు నడుపుతోంది.

Image copyright Getty Images

సంక్రాంతి ప్రయాణికుల రద్దీని ప్రైవేటు ట్రావెల్స్‌ సొమ్ము చేసుకుంటున్నాయి.

ప్రైవేటు ట్రావెల్స్‌ ఎవరికి తోచినట్లు వారు చార్జీలు పెంచుకున్నట్లు స్థానిక వార్తా పత్రికలు కథనాలు చెబుతున్నాయి.

ప్రైవేటు ఆపరేటర్లు తత్కాల్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. చార్జీలను మూడు రెట్లు పెంచినట్లు తెలుస్తోంది.

పండుగ పూట ఊరు వెళ్లాలంటే అడిగినంత చెల్లిస్తేనే టికెట్‌ రిజర్వు చేస్తున్నారని ప్రయాణికులు చెబుతున్నారు.

అయితే, నిబంధనలకు విరుద్ధంగా టికెట్‌ ధరలను పెంచేస్తున్నా.. రవాణా శాఖ అధికారులు ప్రైవేటు ట్రావెల్స్‌పై చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.

హైదరాబాద్‌ నుంచి విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, ఒంగోలు, నెల్లూరు, తిరుపతితో పాటు రాయలసీమలోని పలు ప్రాంతాలకు వెళ్లే బస్సులకు డిమాండ్‌ విపరీతంగా ఉంటుంది.

డిమాండ్‌కు అనుగుణంగా ప్రభుత్వం బస్సులను నడపాల్సి ఉన్నా ఆ పని చేయలేదు. మొక్కుబడిగా స్పెషల్‌ బస్సులు వేసి ఊరుకుంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ట్రావెల్స్ చార్జీల బాదుడుతో ఈ పరిస్థితి తప్పకపోవచ్చు

రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు నడుపుతున్నా సరిపోవడం లేదు. దీంతో ప్రయాణికులకు ప్రైవేటు ట్రావెల్స్‌పై ఆధారపడక తప్పని పరిస్థితి నెలకొంది.

ఈ నెల 12, 13, 14 తేదీల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. తిరిగి 16, 17 18 తేదీల్లో జనం నగరానికి తిరిగి వస్తుంటారు.

ఈ తేదీల్లోనే బస్సుల టికెట్ల ధరలను పెంచేసి విక్రయిస్తున్నారు.

ఈ ఆరు రోజుల్లో ఉన్న డిమాండును సొమ్ము చేసుకునేందుకు పగలూ రాత్రీ ప్రైవేటు బస్సులను నడుపుతున్నారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)