శీతాకాల ఒలింపిక్స్‌కు హ్యాకింగ్ ముప్పు: మేకఫీ

  • 8 జనవరి 2018
2018 శీతాకాల ఒలింపిక్స్‌ను పొయాంగ్ చంగ్‌లో నిర్వహించనున్నారు. Image copyright Getty Images
చిత్రం శీర్షిక 2018 శీతాకాల ఒలింపిక్స్‌ను పొయాంగ్ చంగ్‌లో నిర్వహించనున్నారు.

శీతాకాల ఒలింపిక్స్‌కు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని హ్యాకర్లు దొంగిలించే అవకాశం ఉందని సైబర్ సెక్యూరిటీ సంస్థ మేకఫీ పేర్కొంది.

శీతల ఒలింపిక్స్‌లో పాలుపంచుకునే సంస్థలకు వచ్చిన ప్రమాదకర మెయిల్స్ వివరాలను మేకఫీ గుర్తించింది. అయితే ఎవరు ఈ పనిచేశారన్నది వెల్లడిలేదు.

రానున్న రోజుల్లో ఇలాంటి సైబర్ దాడులు మరింతగా జరిగే అవకాశం ఉందని పేర్కొంది. హ్యాకర్లు గతంలో ఇదే తరహాలో మెయిల్స్ పంపి పాస్‌వర్డులు, ఆర్థిక సమాచారాన్ని తస్కరించారు.

Image copyright Reuters

సింగపూర్ ఐపీ అడ్రస్‌తో మెయిల్స్

ఒలింపిక్స్ నిర్వహణలో పాలుపంచుకునే చాలా గ్రూప్‌లకు ప్రమాదకర ఈ మెయిల్స్ వచ్చాయని, వాటిలో ముఖ్యంగా ఐస్ హాకీ క్రీడకు సంబంధించినవి ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది.

హ్యాకర్లు ఒలింపిక్స్ నిర్వాహక సంస్థలు లక్ష్యంగా భారీ స్థాయిలో సైబర్ దాడులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వెల్లడించింది.

ఈ మెయిల్స్ కొరియా భాషలో ఉన్నాయని, సింగపూర్ ఐపీ అడ్రస్‌తో అవి వస్తున్నాయని మేకఫీ తెలిపింది.

దక్షిణ కొరియా నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ నుంచి మెయిల్స్ వచ్చినట్లు నెటిజన్లు భావించేలా హ్యాకర్లు ఈ మెయిల్స్‌ పంపుతున్నారని మేకఫీ పేర్కొంది.

మరికొన్ని ఉదంతాలలో హ్యాకర్లు టెక్స్ట్, ఫొటోల కింద మాల్‌వేర్ పంపుతూ సమాచారాన్ని తస్కరిస్తున్నారని తెలిపింది.

భారీ క్రీడోత్సవాలు లక్ష్యంగా సైబర్ దాడులు జరిగే అవకాశం ఉందన్న మేకఫీ హెచ్చరికలు నిజమేనని కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు.

కాగా, రెండేళ్ల తర్వాత మొదటిసారిగా ఉత్తర కొరియా ప్రభుత్వం దక్షిణ కొరియాతో చర్చలు జరిపేందుకు సిద్ధమవుతోంది.

తమ క్రీడాకారులను శీతాకాల ఒలింపిక్స్‌కు పంపించే విషయంపై జనవరి 9న నిర్వహించే చర్చలకు హాజరవుతామని స్పష్టం చేసింది.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)