అమెరికా భద్రతా సాయాన్ని నిలిపేస్తే పాకిస్తాన్‌పై పడే ప్రభావం ఎంత?

  • 9 జనవరి 2018
నిధుల కోతపై అమెరికా నిర్ణయాన్ని నిరసించిన పాకిస్తానీయులు Image copyright AFP
చిత్రం శీర్షిక నిధుల కోతపై అమెరికా నిర్ణయాన్నినిరసించిన పాకిస్తానీయులు

పాకిస్తాన్ గడ్డపై నుంచి పనిచేసే ఉగ్రవాద సంస్థలపై పాక్ చర్యలు చేపట్టే వరకు ఆ దేశానికి భద్రతాపరమైన సహాయాన్ని దాదాపు మొత్తం నిలిపేస్తామని అమెరికా చెబుతోంది. ఈ చర్య పాకిస్తాన్‌పై ఎంత మేరకు ప్రభావం చూపుతుంది?

కచ్చితంగా ఎంత సహాయాన్ని నిలిపేస్తారనేది అమెరికా ఇంకా ప్రకటించాల్సి ఉంది. నిలిపివేయబోయే సాయం సుమారు 5,713 కోట్ల రూపాయల (90 కోట్ల డాలర్లు) పైనే ఉండొచ్చని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.

పాకిస్తాన్‌కు సైనిక సామగ్రి, శిక్షణ నిమిత్తం 'ఫారన్ మిలిటరీ ఫైనాన్సింగ్(ఎఫ్‌ఎంఎఫ్)' కింద ఇవ్వాల్సిన 25.5 కోట్ల డాలర్లు, మిలిటెంట్ గ్రూప్‌లు లక్ష్యంగా ఆపరేషన్లు చేపట్టేందుకు సంకీర్ణ సహకార నిధి(సీఎస్‌ఎఫ్) కింద అందించాల్సిన 70 కోట్ల డాలర్లు ఇందులో ఉంటాయి.

భద్రతా సాయం కింద రక్షణశాఖ అందించే ఇతర నిధులకు కూడా కోత పెడతామని అమెరికా విదేశీ వ్యవహారాలశాఖ చెప్పింది. దీనిని బట్టి చూస్తే పాక్‌కు నిలిచిపోయే ఆర్థిక సాయం 90 కోట్ల డాలర్ల కంటే చాలా ఎక్కువే ఉంటుందని కూడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Image copyright HOSHANG HASHIMI/AFP/Getty Images
చిత్రం శీర్షిక అఫ్గానిస్థాన్‌లోని హెరాత్ రాష్ట్రంలో గస్తీ నిర్వహిస్తున్న నాటో, అఫ్గాన్ భద్రతా దళాలు

ప్రభావం ఎంత కాలం?

నిధుల కోత స్వల్ప కాలం వరకైనా పాకిస్తాన్ సైన్యంపై ప్రభావం చూపుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

నిధులు నిలిచిపోతే పాక్ సైనిక సామగ్రి ఆధునికీకరణ, సైనిక వనరుల సామర్థ్యాల పెంపు కార్యక్రమాలు నిలిచిపోతాయని రక్షణ నిపుణుడు, 'మిలిటరీ, స్టేట్ అండ్ సొసైటీ ఇన్ పాకిస్తాన్' పుస్తక రచయిత ప్రొఫెసర్ హసన్ అస్కరీ రిజ్వీ చెప్పారు.

అమెరికా నిర్ణయం దీర్ఘకాలంలోనూ పాక్‌ సైన్యంపై ప్రభావం చూపొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికా సాయాన్ని నిలిపివేస్తే ఆ లోటును పూడ్చే స్థాయిలో చైనాగాని, మరో మిత్రదేశంగాని పాక్‌కు నిధులను సమకూర్చలేవని వ్యాఖ్యానించారు.

తాము డబ్బు కోసం ఎన్నడూ పోరాడలేదని, శాంతి కోసమే పోరాడామని పాకిస్తాన్ చెప్పింది. అమెరికా నిధుల కోతపై పాక్ సైన్యం అధికార ప్రతినిధి బీబీసీకి ఈ మేరకు రాతపూర్వకంగా తెలిపారు.

పాక్ సైన్యంపై ఒత్తిడి

పాకిస్తాన్ భూభాగంపై ఉన్నాయంటున్న మిలిటెంట్ స్థావరాలు, నియామక, శిక్షణ శిబిరాలపై అమెరికా డిమాండ్ చేస్తున్నట్లుగా చర్యలు చేపట్టేలా పాక్ సైన్యం మీద ఒత్తిడి పెరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

మిలిటెంట్ల పట్ల పాక్ వైఖరిలో మార్పు స్పష్టంగా కనిపించకపోయినా, కొంత మార్పు అయితే ఖాయమని రిజ్వీ తెలిపారు. కనీస చర్యగా హఖానీ నెట్‌వర్క్ లాంటి గ్రూపులను కొంత కాలం వరకైనా కార్యకలాపాలు తగ్గించుకోవాలని సైన్యం నిర్దేశిస్తుందని చెప్పారు.

ఉగ్రవాదంపై అమెరికా పోరుకు సంబంధించి చూస్తే పాకిస్తాన్ భౌగోళికంగా కీలకమైన ప్రాంతంలో ఉంది. అఫ్గానిస్థాన్‌లో పాక్ పోషించే పాత్ర కూడా కీలకమైనదే. అఫ్గాన్‌లోని మిలిటెంట్ గ్రూపులను నియంత్రించగల స్థితిలో పాక్ ఉంది. ఇలాంటి అంశాలనే పాక్ తనకు అనుకూలంగా మలచుకొని అమెరికాతో సంబంధాలను నెరపుతూ వస్తోంది.

Image copyright ASIF HASSAN
చిత్రం శీర్షిక అఫ్గాన్‌లోకి నాటో సైనిక సరఫరాలను కొన్ని నెలలపాటు అడ్డుకున్న పాకిస్తాన్

అఫ్గాన్‌లోకి సైనిక సరఫరాలను పాక్ అడ్డుకోగలదా?

అఫ్గానిస్థాన్‌లోకి అంతర్జాతీయ సైనిక బలగాల సరఫరాలు భూమార్గంలో వెళ్లాలంటే పాకిస్తాన్ గుండానే వెళ్లాలి. ఈ మార్గంలో అమెరికా సైనిక సరఫరాలను అడ్డుకోవడం ద్వారా పాక్ తన ప్రయోజనాలను కాపాడుకొనేందుకు ప్రయత్నించగలదా? లోగడ ఒకసారి ఇలాగే చేసింది.

పాకిస్తాన్‌లోని అబోటాబాద్‌లో ‌అల్‌ఖైదా అప్పటి అధినేత ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా బలగాలు రహస్య ఆపరేషన్‌లో చంపేయడం, పాక్ సైనిక స్థావరంపై అమెరికా యుద్ధవిమానాలు దాడి చేయడం, అందులో 20 మందికి పైగా పాక్ సైనికులు చనిపోవడం, ఇతర పరిణామాల నేపథ్యంలో పాక్.. 2011-12లో కొన్ని నెలలపాటు నాటో సరఫరాలను ఈ మార్గంలో అనుమతించలేదు.

సైనిక సరఫరాలకు ఆటంకం కలిగించడమో లేదా, సరఫరాలు ఆలస్యమయ్యేలా పాకిస్తాన్ చేయొచ్చేమోగాని, పూర్తిగా అడ్డుకోకపోవచ్చని రిజ్వీ విశ్లేషించారు. అమెరికా వద్ద పాకిస్తాన్‌కు అప్పట్లో ఉన్నంత వెసులుబాటు ఇప్పుడు లేదని తెలిపారు.

అప్పట్లో ఆగ్రహం పాకిస్తాన్‌దైతే ఇప్పుడు అమెరికాదని ఆయన పేర్కొన్నారు. పాక్ ఇలాంటి చర్య చేపడితే పాక్‌కు పరిస్థితులు మరింత ప్రతికూలంగా మారతాయని చెప్పారు. అన్ని రకాల ద్వైపాక్షిక సంబంధాలు నిలిచిపోయే స్థాయికి పరిస్థితులు వెళ్లొచ్చని అంచనా వేశారు. ప్రస్తుతం పాక్‌కు సైనికేతర సాయాన్ని అమెరికా కొనసాగిస్తోంది. సైనిక సాయాన్ని అంశాల వారీగా, షరతులకు లోబడి అందించే అవకాశం ఉంది.

అన్ని సంబంధాలూ తెగిపోతే నాటోయేతర ప్రధాన మిత్రపక్షాల జాబితాలోంచి పాకిస్తాన్‌ను అమెరికా తొలగించొచ్చు. ఉగ్రవాదానికి సహకరించే దేశంగా పాక్‌ను ప్రకటించవచ్చు. పాక్ ప్రయోజనాలను దెబ్బతీసేలా భారత్, అఫ్గానిస్తాన్‌లతో అమెరికా మరింత మెరుగ్గా కలిసి పనిచేయవచ్చు. అయితే అటు అమెరికా, ఇటు పాక్ పరిస్థితులు అంతవరకు వెళ్లాలని కోరుకోకపోవచ్చు.

పాకిస్తాన్‌లో అస్థిరతను అమెరికా కోరుకోదని విశ్లేషకులు చెబుతున్నారు. ''అణ్వస్త్ర వ్యాప్తి అధికమవుతున్న దేశాల్లో పాకిస్తాన్ ఒకటి. అక్కడ ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి. పాక్‌లో అస్థిరత ఏర్పడితే అణ్వస్త్ర పరిజ్ఞానం ఉగ్రవాదుల చేతుల్లో పడే ఆస్కారముంది. అందుకే పాక్‌లో అస్థిరత ముప్పుపై అమెరికా, దాని మిత్రపక్షాలు ఆందోళన చెందుతాయి'' అని అమెరికాకు చెందిన దక్షిణాసియా నిపుణులు క్రిస్టీన్ ఫాయిర్ వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)