అమెరికా: రెండు లక్షల మంది సాల్వెడార్ పౌరులు దేశం విడిచి వెళ్లడానికి డెడ్‌లైన్ పెట్టిన ట్రంప్

  • 9 జనవరి 2018
క్యాపిటల్ హిల్ వద్ద నిరసన ప్రదర్శన Image copyright Getty Images
చిత్రం శీర్షిక అమెరికాలో నివసించటానికి చట్టబద్ధమైన మార్గంలో అనుమతి పొందలేకపోతే వేలాది కుటుంబాలను బలవంతంగా స్వదేశాలకు తిప్పిపంపేస్తారు

అమెరికాలో నివసించటానికి, పనిచేయటానికి దాదాపు రెండు లక్షల మంది ఎల్ సాల్వెడార్ ప్రజలకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది.

సెంట్రల్ అమెరికాలోని ఎల్ సాల్వెడార్‌లో 2001లో భారీ భూకంపం విలయం సృష్టించినపుడు ఆ దేశ పౌరులు దాదాపు రెండు లక్షల మందికి అమెరికా తాత్కాలిక ఆశ్రయం (టెంపరరీ ప్రొటెక్టెడ్ స్టేటస్ - టీపీఎస్) ఇచ్చింది.

ఈ ఆశ్రయం గడువు సోమవారంతో ముగియనుంది.

ట్రంప్ సర్కారు తాజా నిర్ణయంతో 2019 సెప్టెంబర్ 9వ తేదీ లోగా వారందరూ దేశం విడిచివెళ్లిపోవాల్సి ఉంటుంది. ఒకవేళ అమెరికాలో ఉండాలనుకుంటే చట్టబద్ధమైన మార్గంలో ఆ అర్హతను సంపాదించుకోవాల్సి ఉంటుంది.

చిన్నారులుగా అమెరికాలో ప్రవేశించిన వలసదారులను బలవంతంగా తిప్పిపంపించకుండా భద్రత కల్పిస్తూ ఒబామా హయాంలో ప్రవేశపెట్టిన డాకా (డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్) పథకాన్ని రద్దు చేయాలని నిర్ణయించినట్లు ట్రంప్ ప్రభుత్వం నాలుగు నెలల కిందట ప్రకటించిన విషయం తెలిసిందే.

అనంతరం.. వేలాది మంది హైతీ, నికరాగువా పౌరులకు గల తాత్కాలిక ఆశ్రయ హోదాను కూడా ట్రంప్ సర్కారు తొలగించింది. తాజాగా సాల్వెడార్ పౌరులకు కూడా టీపీఎస్ ఆశ్రయానికి కూడా డెడ్‌లైన్ ప్రకటించింది.

Image copyright AFP
చిత్రం శీర్షిక తాత్కాలిక ఆశ్రయ హోదా 2019 సెప్టెంబర్ 9వ తేదీ వరకూ రద్దు కాబోదని అమెరికా అంతర్గత భద్రత శాఖ పేర్కొంది

అమెరికాలోని సాల్వెడార్ పౌరులపై ప్రభావం ఏమిటి?

తాత్కాలిక ఆశ్రయ హోదా 2019 సెప్టెంబర్ 9వ తేదీ వరకూ రద్దు కాబోదని.. ‘‘ఒక పద్ధతిగా మార్పు చేయటం కోసం’’ ఈ గడువును నిర్ణయించామని అంతర్గత భద్రత శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.

‘‘2001 భూకంపం వల్ల తలెత్తిన వాస్తవ పరిస్థితులు ఇప్పుడేమాత్రం లేవు. కనుక ప్రస్తుతమున్న టీపీఎస్ హోదాను రద్దు చేసి తీరాలి’’ అని ఆ శాఖ పేర్కొంది.

అమెరికా వ్యాప్తంగా నివసిస్తున్న దాదాపు 2,00,000 మంది సాల్వెడార్ పౌరుల ఆశ్రయ హోదా మీద ఈ నిర్ణయం ప్రభావం చూపుతుంది. వారిని వారి కుటుంబాల నుంచి వేరు చేసి బలవంతంగా వారి దేశానికి పంపించే అవకాశం ఉంటుంది.

అలాగే.. సాల్వెడార్ పౌరులకు అమెరికాలోనే జన్మించిన దాదాపు 2,00,000 మంది చిన్నారుల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకమవుతుంది. వారిని కూడా బలవంతంగా అమెరికా నుంచి పంపించివేసే ప్రమాదం ఉంటుంది.

కాలిఫోర్నియా, టెక్సాస్, వాషింగ్టన్ డీసీల్లో.. తాత్కాలిక ఆశ్రయ హోదా గల సాల్వెడార్ పౌరులు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు.

సెంటర్ ఆఫ్ మైగ్రేషన్ స్టడీస్ వివరాల ప్రకారం..

  • అమెరికా వ్యాప్తంగా సాల్వెడార్ పౌరులకు సంబంధించిన 1,35,000 కుటుంబాలున్నాయి
  • వారిలో నాలుగో వంతు మందికి సొంత ఇళ్లు కూడా ఉన్నాయి.
  • సాల్వెడార్ పౌరుల్లో 88 శాతం మంది కార్మికులుగా ఉన్నారు
  • 10 శాతం మంది స్వయం ఉపాధిలో ఉన్నారు
  • 10 శాతం మంది అమెరికా పౌరులను వివాహం చేసుకున్నారు
Image copyright Getty Images
చిత్రం శీర్షిక హైతీ, నికరాగువా దేశాల పౌరులకు గల టీపీఎస్ హోదాను కూడా రద్దు చేస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం కొద్ది నెలల కిందట ప్రకటించింది

తాత్కాలిక ఆశ్రయ హోదా (టీపీఎస్) అంటే ఏమిటి?

ఈ పథకాన్ని 1990లో తీసుకువచ్చారు. పలు దేశాలకు చెందిన వలస ప్రజలు అమెరికాలోకి చట్టబద్ధంగా వచ్చారా లేదా అనే అంశంతో నిమిత్తం లేకుండా దేశంలో చట్టబద్ధంగా నివసించటానికి, పని చేయటానికి ఈ పథకం అనుమతిస్తుంది.

సాయుధ సంఘర్షణ, ప్రకృతి విపత్తు, పెద్ద వ్యాధులతో ప్రభావితమయిన దేశాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.

నాటి అధ్యక్షుడు జార్జ్ బుష్ మొదటిసారి ఈ పథకం అమలులోకి తెచ్చినప్పటి నుంచీ.. పది దేశాలకు చెందిన 3,00,000 మందికి పైగా వలసలకు అమెరికా టీపీఎస్ హోదా కల్పించింది.

టీపీఎస్ హోదా పొందిన వారిలో సాల్వెడార్ పౌరులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. 2001 మార్చిలో ఆ దేశంలో భూకంపం విలయం సృష్టించిన నేపథ్యంలో ఆ దేశ పౌరులకు ఈ పథకాన్ని వర్తింపచేశారు.

గత ఏడాది చివర్లో.. హైతీ పౌరులు 59,000 మందికి, నికరాగువా పౌరులు 5,300 మందికి ప్రత్యేక ఆశ్రయ హోదాను అమెరికా రద్దు చేసింది. ఇది కూడా 2019లో అమలులోకి వస్తుంది.

Image copyright AFP
చిత్రం శీర్షిక ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా వాషింగ్టన్ డీసీలో నిరసన ప్రదర్శనలు జరిగాయి

అమెరికా నిర్ణయంపై ప్రతిస్పందనలు ఏమిటి?

అమెరికా ప్రభుత్వ నిర్ణయం ’ఎప్పుడో తీసుకోవాల్సిన నిర్ణయం’ అని సెంటర్ ఆఫ్ ఇమిగ్రెంట్ స్టడీస్ మార్క్ క్రికోరియన్ సమర్థించారు.

‘19 ఏళ్ల పాటు కొనసాగే ’తాత్కాలిక హోదా’ అనేది విడ్డూరం’ అని ఆయన బీబీసీ న్యూస్‌తో వ్యాఖ్యానించారు.

అసలు టీపీఎస్ చట్టాన్ని రద్దు చేయాలని, తాత్కాలిక వలస ఆశ్రయం మీద కాంగ్రెస్ (పార్లమెంటు)లో ఓటింగ్ ద్వారా నిర్ణయించే ప్రక్రియను ప్రవేశపెట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు.

అమెరికా సర్కారు నిర్ణయాన్ని.. టీపీఎస్ హోదాతో అమెరికాలో నివసిస్తున్న సాల్వెడార్ పౌరులు తప్పుపట్టారు.

’’నా జీవితం ఇక్కడే ఉంది. నా ఇల్లు ఇక్కడే ఉంది. నేను పన్ను కడుతోంది ఇక్కడే. నేను చచ్చేలా పనిచేస్తున్నా.. కానీ ఇక్కడ సంతోషంగా ఉన్నా’’ అని మిండా హెర్నాండెజ్ అనే 48 ఏళ్ల హౌస్‌కీపర్ పేర్కొన్నట్లు ఏఎఫ్‌పీ వార్తా సంస్థ తెలిపింది. ఇరవై ఏళ్ల కింద ఎల్ సాల్వెడార్ నుంచి అమెరికా వచ్చిన ఆమె ప్రస్తుతం లాంగ్ ఐలండ్‌లో నివసిస్తున్నారు.

అమెరికాలో నివసిస్తున్న తమ దేశ పౌరులకు ఆశ్రయాన్ని పొడిగించేలా చేయటం కోసం సాల్వెడార్ ప్రభుత్వం అమెరికా సర్కారుతో సంప్రదింపులు జరుపుతోంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ట్రంప్ సర్కారు నిర్ణయాన్ని కాంగ్రెస్‌లో ప్రతిపక్షమైన డెమొక్రాట్లు ఖండించారు

అమెరికాలో పనిచేస్తున్న సాల్వెడార్ ప్రజలకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనడటం కోసం తమ ప్రభుత్వం ట్రంప్ సర్కారుతో కలిసి కృషి చేస్తుందని ఎల్ సాల్వెడార్ విదేశాంగ మంత్రి హ్యూగో మార్టినెజ్ పేర్కొన్నారు.

అమెరికాలో నివసించే సాల్వెడార్ పౌరులు అక్కడ సంపాదించి తమ దేశంలోని కుటుంబాలకు పంపించే నగదు.. ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగంగా ఉందని సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్ చెప్తోంది. ఇలా పంపించే నగదు 2015లో ఎల్ సాల్వెడార్ జీడీపీలో 15 శాతం కన్నా ఎక్కువగా ఉందని ఆ సంస్థ అంచనా.

ట్రంప్ సర్కారు నిర్ణయాన్ని కాంగ్రెస్‌లో ప్రతిపక్షమైన డెమొక్రాట్లు ఖండించారు. ఎల్ సాల్వెడార్‌లో ఉన్న హింసాత్మక పరిస్థితులను ప్రభుత్వం విస్మరించిందని వారిలో చాలా మంది తప్పుపట్టారు. ప్రపంచంలో హత్యల రేట్లు అధికంగా ఉన్న దేశాల్లో ఎల్ సాల్వెడార్ ఒకటి.

‘‘ఈ నిర్లక్షపూరిత, నిర్హేతుక నిర్ణయం వల్ల వేలాది కుటుంబాలు చిన్నాభిన్నమవుతామనే ఆందోళనకు లోనవుతాయి’’ అని వాషింగ్టన్ డీసీ మేయర్ మ్యురియల్ బోసర్ పేర్కొన్నారు.

‘‘భయం, బెదిరింపులతో పరిపాలన సాగించాలని పట్టుపట్టే వలసల వ్యతిరేక అధ్యక్షుడని.. కష్టపడి పనిచేసే కుటుంబాలను దెబ్బతీస్తున్నారని ఈ నిర్ణయం గుర్తుచేస్తుంది’’ అని నెవెడా సెనేటర్ కేథరీన్ కోర్టెజ్ మాస్టో పేర్కొన్నారు.

అమెరికాలోని రాయబార కార్యాలయాలు సాల్వెడార్ పౌరులకు సలహాల రూపంలో సహాయం అందిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)