సైన్స్: కొబ్బరి నూనెను కూరల్లో వాడొచ్చా? ఈ నూనె ఆరోగ్యానికి మంచిదా? కాదా?
- డాక్టర్ మైఖేల్ మోస్లే
- బీబీసీ

ఫొటో సోర్స్, Getty Images
కొబ్బరినూనెలో ఎక్కువ శాతం సంతృప్త కొవ్వు పదార్థాలు
కొబ్బరినూనె విషతుల్యమైనదంటూ హార్వర్డ్ ప్రొఫెసర్ కరీన్ మైఖేల్స్ చేసిన వ్యాఖ్యలతో కొబ్బరినూనె గుణగణాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
‘కొబ్బరినూనె, ఇతర పోషకాహారలోపాలు’ అనే అంశంపై జరిగిన చర్చాగోష్ఠిలో ఆమె మాట్లాడుతూ.. కొబ్బరినూనె ఆరోగ్యకరమైన ఆహారమని చెబుతుంటారని, కానీ దీనికి ఒక్క సాక్ష్యం కూడా లేదని అన్నారు. జులైలో యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించారు.
అయితే, కొబ్బరి నూనె నోటి దుర్వాసన, జీర్ణక్రియ సమస్యలను దూరం చేస్తుందన్న సెలెబ్రిటీల ప్రకటనలతో దాని ధర ఆకాశాన్ని అంటుతోంది.
నటి ఏంజెలినా జోలి రోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె తీసుకుంటారని తెలుస్తోంది. మోడల్ మిరాందా కెర్ తాను సలాడ్స్‌ను కొబ్బరి నూనెతో కలిసి తీసుకుంటానని చెప్పడమే కాకుండా, వంట కూడా దానితోనే చేస్తానని, దాన్ని ఒంటికి కూడా పట్టించుకుంటానని చెబుతున్నారు.
అయితే కొబ్బరి నూనెతో ముడిపడిన ఈ ఆరోగ్య ప్రకటనలపై సైంటిస్టులు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
కొబ్బరినూనె కేవలం ఒక అనారోగ్యకరమైన కొవ్వు పదార్థం అనేది వారి భావన. సంతృప్త కొవ్వు పదార్థాలు వెన్నలో 51 శాతం, పందికొవ్వులో 39శాతం మాత్రమే ఉంటే, కొబ్బరినూనెలో 86 శాతం ఉంటాయి.
ఇలాంటి సంతృప్త కొవ్వు పదార్థాలను తీసుకోవడం వల్ల రక్తంలోని ఎల్డీఎల్ (లో డెన్సిటీ లిపొప్రొటీన్) శాతం పెరుగుతుంది.
ఎల్‌డీఎల్‌ను 'చెడు కొలెస్టరాల్' అని కూడా అంటారు. దీని వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
మరోవైపు ఆరోగ్యానికి హాని కలుగజేసే సంతృప్త కొవ్వు పదార్థాలు - హెచ్‌డీఎల్, 'మంచి కొలెస్టరాల్'ను పెంచే అవకాశం కూడా ఉంది. దీని వల్ల వ్యతిరేక ప్రభావం ఉంటుంది. ఒక ప్రత్యేకమైన ఆహారం మీ కొలెస్టరాల్ స్థాయిని పెంచుతూనే, గుండెకు మంచి చేసే అవకాశం ఉంది.
ఫొటో సోర్స్, Getty Images
ఆలివ్ నూనె
కొలెస్టరాల్ పరీక్ష
కొంతమంది చెబుతున్నట్లు, కొబ్బరి నూనె నిజంగా కొలెస్టరాల్‌ను తగ్గించే వండర్ ఫుడ్డా లేక దీనికి అనవసరంగా ప్రాధాన్యతను ఇస్తున్నారా?
ఇందుకోసం బీబీసీ2 లో ప్రసారమయ్యే 'ట్రస్ట్ మీ ఐయామ్ ఎ డాక్టర్' సిరీస్ కోసం ఒక పరిశోధన నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది.
ప్రఖ్యాత కేంబ్రిడ్జి పరిశోధకులు ప్రొఫెసర్ కే-టీ ఖా మరియు ప్రొఫెసర్ నీతా ఫొరౌహిలను బీబీసీ టీమ్ సంప్రదించింది.
వారి సహాయంతో - మధుమేహం, గుండెజబ్బులు లేని 50-75 ఏళ్ల మధ్య వయసున్న 94 మంది వాలంటీర్లను రిక్రూట్ చేసుకుంది. వివిధ రకాల కొవ్వు పదార్థాలను తినడం వల్ల వారిలో వచ్చే మార్పులను సమీక్షించాలని నిర్ణయించింది.
వీరందరినీ మూడు బృందాలుగా విభజించడం జరిగింది. నాలుగు వారాల పాటు ఒక బృందానికి 50 గ్రాములు, అంటే సుమారు 3 టేబుల్ స్పూన్ల ఎక్స్ట్రా వర్జిన్ కొబ్బరి నూనెను ఇవ్వడం జరిగింది. రెండో బృందానికి అంతే పరిమాణంలో ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ నూనెను తీసుకోమని సూచించారు. మూడో బృందానికి రోజూ 50 గ్రాముల 'అన్సాల్టెడ్' వెన్నను తీసుకోమన్నారు.
వాలంటీర్లు తమకు ఇష్టం వచ్చిన రీతిలో నాలుగు వారాల పాటు ఈ కొవ్వు పదార్థాలను తీసుకోమని సూచించారు.
రోజూ 450 అదనపు కెలోరీలను ఆహారంగా తీసుకోవడం వల్ల వారి బరువు పెరిగే అవకాశం కూడా ఉందని వారిని హెచ్చరించారు.
ఈ ప్రయోగానికి ముందు వారి రక్త నమూనాలు తీసుకుని ఎల్డీఎల్ (చెడు కొలెస్టరాల్), హెచ్‌డీఎల్ (మంచి కొలెస్టరాల్) శాతాలను కొలవడం జరిగింది. వీటి ద్వారా గుండెపోటు వచ్చే రిస్క్‌ను బాగా గుర్తించవచ్చు.
వెన్నను తిన్నవారిలో సగటున 10 శాతం ఎల్డీఎల్ పెరగ్గా, అదే సమయంలో హెచ్‌డీఎల్ 5 శాతం పెరిగింది. ఆలివ్ ఆయిల్‌ను తీసుకున్న వారిలో చాలా తక్కువ శాతమే అయినా ఎల్డీఎల్ తగ్గగా, హెచ్‌డీఎల్ 5 శాతం పెరిగింది. అలా ఆలివ్ ఆయిల్ గుండెకు మంచిదన్న పేరు నిలబెట్టుకుంది.
కానీ అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన ఫలితాలు కొబ్బరినూనెలో వెలువడ్డాయి. బీబీసీ అంచనా వేసినట్లు ఎల్డీఎల్ పరిమాణం పెరగకపోవడమే కాకుండా, హెచ్‌డీఎల్, అంటే మంచి కొలెస్టరాల్ 15 శాతం పెరిగినట్లు తేలింది.
అంటే కొబ్బరి నూనెను తీసుకుంటున్న వారికి గుండెజబ్బు లేదా గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుందన్న మాట.
ఫొటో సోర్స్, Getty Images
మరికొన్ని పరిశోధనలు అవసరం
దీనిపై బీబీసీ ప్రొఫెసర్ కే-టీ ఖాను ప్రశ్నించినపుడు, ఆమె కూడా ఫలితాలపై ఆశ్చర్యం వ్యక్తం చేసారు.
''బహుశా కొబ్బరి నూనెలోని ప్రధానమైన సంతృప్త కొవ్వు పదార్థం లారిక్ యాసిడ్ రూపంలో ఉండడం వల్ల ఇలా జరిగి ఉండవచ్చు'' అని ఆమె అన్నారు.
అంటే కొబ్బరి నూనెను మనం ఆరోగ్యకరమైన ఆహారం అనవచ్చా?
''ఇది ఒక పరిశోధన మాత్రమే. ఒక పరిశోధన ఎంత బాగా జరిగినా, కేవలం దీని ఆధారంగా ఆహార అలవాట్లలో మార్పు చేసుకోమని సూచించడం బాధ్యతారాహిత్యమే అవుతుంది'' అన్నారామె.
అందువల్ల కొబ్బరి నూనె ఒక 'సూపర్ ఫుడ్' అని ఇప్పుడే ప్రకటించలేము.
అయితే మీరు వంటల్లో కొబ్బరి నూనెను వాడుతుంటే మాత్రం, దానిని నిలిపేయాల్సిన అవసరం లేదు.
ఇవి కూడా చదవండి
- ‘థియేటర్లలో జాతీయ గీతం తప్పనిసరి కాదు’
- ఈ తారలు నల్లటి దుస్తుల్లో ఎందుకొచ్చారు?
- ట్రంప్ మానసిక స్థితిపై మళ్లీ చర్చ
- ఆహార వృథాయే ఆకలి కేకలకు అసలు కారణమా?
- రెండో ప్రపంచ యుద్ధం: ఆహారంపై ఆంక్షలు
- చిన్న పిల్లల ఆహారాన్ని తీసుకెళ్లి చైనాలో అమ్ముకుంటున్నారు
- ఉత్తర కొరియాలో ఎక్కువగా తినే స్నాక్స్ ఇవే!
- ఇవి తింటే.. మీ జుట్టు భద్రం!
- వ్యాయామం చేస్తే కరిగే కొవ్వు ఎటు వెళుతుంది?
- కేకులు, బన్నులు తింటే కేన్సర్ వస్తుందా?
- ఎంత తిన్నామన్నదే కాదు.. ఎప్పుడు తిన్నామన్నదీ ముఖ్యమే!
- 'రోజూ ఒక గుడ్డు తినండి.. ఇక డాక్టర్‌కు దూరంగా ఉండండి!'
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)