చరిత్ర: క్రీడాపోటీలకు ముందు దక్షిణ కొరియా విమానాన్ని పేల్చేసిన ఉత్తర కొరియా

  • 10 జనవరి 2018
ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జాంగ్ ఉన్ Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జాంగ్ ఉన్

ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య తీవ్రస్థాయి విభేదాలున్నా, శీతాకాల ఒలింపిక్స్ విషయంలో మాత్రం రెండు దేశాలు ఒకే వైఖరితో ఉన్నట్లు కనిపిస్తోంది.

దక్షిణ కొరియాలోని ప్యెంగ్‌చాంగ్ కౌంటీలో ఫిబ్రవరి 9 నుంచి 25 వరకు జరిగే 2018 శీతాకాల ఒలింపిక్స్‌కు తమ క్రీడాకారుల బృందాన్ని పంపించేందుకు ఉత్తర కొరియా అంగీకరించింది.

రెండేళ్లలో తొలిసారిగా తాజాగా ఉభయ దేశాల మధ్య ఉన్నతస్థాయి చర్చలు ఏర్పాటయ్యాయి. చర్చల అనంతరం ఉత్తర కొరియా ఈ నిర్ణయం తీసుకొంది.

గతంలో దక్షిణ కొరియాలో ప్రధానమైన అంతర్జాతీయ క్రీడాపోటీలు నిర్వహించినప్పుడు పోటీలకు ముందుగాని, పోటీల సందర్భంగాగాని ఆ దేశాన్ని లక్ష్యంగా చేసుకొని ఉత్తర కొరియా భీకరమైన దాడులు జరిపింది.

Image copyright News1
చిత్రం శీర్షిక 2014లో ఏసియన్ గేమ్స్ సందర్భంగా దక్షిణ, ఉత్తర కొరియా ప్రతినిధుల కరచాలనం

1987: దక్షిణ కొరియా విమానంలో బాంబు

1987లో ఇరాక్‌ రాజధాని బాగ్దాద్ నుంచి దక్షిణ కొరియా రాజధాని సోల్‌కు వెళ్తున్న కొరియన్ ఎయిర్‌లైన్స్ 858 విమానంలో ఇద్దరు ఉత్తర కొరియా ఏజెంట్లు బాంబు పెట్టారు.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుధాబిలో విమానం ఆగినప్పుడు వారు దిగిపోయారు.

కొన్ని గంటల తర్వాత విమానం అరేబియా సముద్రంపై వెళ్తున్న సమయంలో పేలుడు సంభవించింది. విమానంలోని 115 మంది చనిపోయారు.

1988 ఒలింపిక్స్‌కు సోల్‌లో ఆతిథ్యమిచ్చేందుకు దక్షిణ కొరియా సన్నద్ధమవుతున్న తరుణంలో ఈ ఘటన జరిగింది.

దక్షిణ కొరియాలో ఒలింపిక్స్ జరగకుండా అడ్డుకోవాలనే పట్టుదల ఉత్తర కొరియాలో ఉండేది.

విమానంలో బాంబు పెట్టిన ఏజెంట్లలో ఒకరైన కిమ్ హ్యున్-హుయ్‌ను బీబీసీ ఒక సందర్భంలో ఇంటర్వ్యూ చేసింది.

సోల్ ఒలింపిక్స్‌కు ముందు ఏదైనా దక్షిణ కొరియా విమానాన్ని పేల్చివేయాలని ఉత్తర కొరియా ఉన్నతాధికారి ఒకరు చెప్పారని, అలా చేస్తే దక్షిణ కొరియాలో భయాందోళనలు నెలకొంటాయన్నారని తెలిపారు.

Image copyright News1
చిత్రం శీర్షిక దక్షిణ కొరియాలో ఫుట్‌బాల్ అభివృద్ధి‌లో 2002 ఫిఫా ప్రపంచ కప్‌ది కీలక పాత్ర

2002: అటు ఫుట్‌బాల్ మ్యాచ్.. ఇటు దాడి

2002 ఫిఫా ప్రపంచ కప్‌ పోటీలకు దక్షిణ కొరియా, జపాన్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చాయి. దక్షిణ కొరియాలో ఫుట్‌బాల్ క్రీడ బాగా అభివృద్ధి చెందడంలో ఈ పోటీలది కీలక పాత్ర.

అప్పటివరకు ఫిఫా ప్రపంచ కప్‌లో ఎన్నడూ ఒక్క మ్యాచ్ గెలవని దక్షిణ కొరియా 2002లో బలమైన పోలండ్, అమెరికా, పోర్చుగల్, ఇటలీ, స్పెయిన్ జట్లను ఓడించి సెమీ ఫైనల్‌కు చేరింది.

జూన్ 29న టర్కీతో దక్షిణ కొరియా సెమీఫైనల్ మ్యాచ్ ఆడుతుండగా, యెల్లో సముద్రంలో యెయాన్‌ప్యాంగ్ దీవికి సమీపాన దక్షిణ కొరియా నౌకాదళానికి చెందిన ఓ నౌకపై ఉత్తర కొరియా గస్తీ బోట్లు దాడి చేశాయి.

నాటి పోరులో దక్షిణ కొరియాకు చెందిన ఆరుగురు చనిపోయారు. తొమ్మిది మంది గాయపడ్డారు.

యెల్లో సముద్రంలోని వివాదాస్పద సరిహద్దు 'నార్తర్న్ లిమిట్ లైన్(ఎన్‌ఎల్ఎల్)'ను దాటి వచ్చి ఉత్తర కొరియా బోట్లు ఈ దాడి జరిపాయనే ఆరోపణలున్నాయి.

Image copyright News1
చిత్రం శీర్షిక 2002 జూన్‌లో ఉత్తర కొరియా దాడిలో చనిపోయినవారికి గత ఏడాది దక్షిణ కొరియాలో నివాళులు అర్పిస్తున్న కుటుంబ సభ్యులు

కొరియా యుద్ధం తర్వాత ఎన్‌ఎల్ఎల్‌ను రెండు దేశాల మధ్య సరిహద్దుగా ఐక్యరాజ్యసమితి గుర్తించింది. కానీ దీనిని సరిహద్దుగా ఉత్తర కొరియా గుర్తించడం లేదు.

సముద్రంలో దక్షిణ కొరియాతో పోరాటం జరిపినప్పటికీ, తర్వాత 2002లోనే దక్షిణ కొరియాలోని బుసాన్‌లో జరిగిన ఆసియా క్రీడాపోటీల్లో ఉత్తర కొరియా పాల్గొంది.

184 మంది అథ్లెట్లు, 134 మంది అధికారులు, 288 మంది చీర్‌లీడర్లు- మొత్తం 606 మందితో కూడిన ప్రతినిధి బృందాన్ని బుసాన్‌కు పంపింది.

ఆప్తులను తిరిగి కలుసుకొనేందుకు..

కొరియా యుద్ధం వల్ల కుటుంబాల నుంచి విడిపోయి, వేర్వేరుగా ఉత్తర, దక్షిణ కొరియాల్లో ఉంటున్నవారు తిరిగి ఒకరినొకరు కలుసుకొనేందుకు 2000 నుంచి 2007 మధ్య ఇంచుమించు రెండేళ్లకోసారి ఉభయ దేశాలు ప్రత్యేక కార్యక్రమాలు (రీయూనియన్స్) నిర్వహించేవి.

దాదాపు 60 ఏళ్లలో తొలిసారిగా తమ ఆప్తులను కలుసుకొన్నవారు ఎంతో మంది ఉన్నారు.

2007 నుంచి 2013 మధ్య ఇలాంటి కార్యక్రమాలు రెండు సార్లే జరిగాయి. అప్పట్లో లీ మ్యుంగ్-బాక్ నాయకత్వంలోని దక్షిణ కొరియా ప్రభుత్వం, ఉత్తర కొరియా ప్రభుత్వం మధ్య సంబంధాలు దెబ్బతినడమే దీనికి కారణం.

దాదాపు మూడేళ్ల విరామం తర్వాత 2014 ఫిబ్రవరిలో జరిగిన రీయూనియన్ అందరి దృష్టిని ఆకర్షించింది. 2015 నుంచి రీయూనియన్ కార్యక్రమాలు జరగడం లేదు.

Image copyright News1
చిత్రం శీర్షిక 2014లో జరిగిన రీ‌యూనియన్‌లో తమ బంధువులను కలుసుకొన్న వ్యక్తులు

మరోవైపు రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటూ వచ్చాయి.

2014 సెప్టెంబరులో దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌లో ఆసియా క్రీడాపోటీలు జరిగాయి. ఏసియన్ గేమ్స్‌లో పాల్గొనబోమని తొలుత ప్రకటించిన ఉత్తర కొరియా తర్వాత 273 మంది అథ్లెట్లు, అధికారులను ఇంచియాన్‌కు పంపింది.

ఉత్తర కొరియా బృందంలో అత్యంత శక్తిమంతమైన ముగ్గురు సైనిక, రాజకీయ ముఖ్యులు హవాంగ్ ప్యాంగ్-సో, చో ర్యాంగ్-మే, కిమ్ యాంగ్-గాన్ ఉన్నారు.

చీర్‌లీడర్ల బృందాన్ని పంపాలనే ఆలోచనను ఉత్తర కొరియా విరమించుకొంది.

2017లో ఉత్తర కొరియా ఆరోసారి అణ్వస్త్ర పరీక్షను జరిపింది.

పలుమార్లు క్షిపణి పరీక్షలు నిర్వహించింది. ఈ చర్యలతో ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి.

ఇంతలో ఉత్తర కొరియా వైఖరిలో చెప్పుకోదగ్గ మార్పు కనిపించింది. ప్యెంగ్‌చాంగ్‌లో జరిగే శీతాకాల ఒలింపిక్స్‌కు తమ క్రీడాకారుల బృందాన్ని పంపిస్తామని ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జాంగ్-ఉన్ నూతన సంవత్సర ప్రసంగంలో ప్రకటించారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక 2003లో దక్షిణ కొరియాలోని డేగు నగరంలో జరిగిన ప్రపంచ విద్యార్థుల క్రీడాపోటీల్లో ఉత్తర కొరియా చీర్‌లీడర్లు

వారంలోనే చర్చల విధివిధానాలపై అంగీకారం

చర్చలపై ప్రస్తుతం ఉభయ దేశాలు ఆసక్తి చూపుతున్నట్లు కనిపిస్తోంది.

గతంలో ఉన్నతస్థాయి సమావేశాల విషయంలో ఉభయ దేశాలు ఒకదానిపై ఒకటి పైచేయి సాధించేందుకు యత్నించేవి. వేదిక, తేదీలు, పాల్గొనేవారు ఎవరనే అంశాలపై వాదోపవాదాలు ఉండేవి. ఈసారి చర్చల విధివిధానాలపై కేవలం వారంలోనే రెండు దేశాలూ అంగీకారానికి వచ్చాయి.

జనవరి 9న స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు మొదలయ్యాయి. క్రీడల్లో పాల్గొనడం కంటే గొప్ప పరిణామాలకు ఈ చర్చలు నాంది పలకాలని దక్షిణ కొరియాలోని మూన్ జే-ఇన్ ప్రభుత్వం ఆశిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు