కొరియా ఉద్రిక్తత: సైనిక చర్చలకు ఉత్తర, దక్షిణ కొరియా దేశాల అంగీకారం

  • 9 జనవరి 2018
ఉత్తర కొరియా ప్రతినిధి బృందం నాయకుడు రి సోన్-గ్వోన్‌ (ఎడమ) తో కరచాలనం చేస్తున్న దక్షిణ కొరియా ఏకీకరణ మంత్రి చో మ్యోంగ్-గ్యోన్ (కుడి) Image copyright EPA
చిత్రం శీర్షిక ఉభయ కొరియాల మధ్య రెండేళ్ల కాలంలో జరిగిన తొలి ఉన్నత స్థాయి చర్చలు ఇవి

ఉభయ కొరియాల మధ్య రెండేళ్ల కాలంలో మంగళవారం (జనవరి 9వ తేదీ) జరిగిన మొదటి ఉన్నత స్థాయి సమావేశంలో.. సరిహద్దు ఉద్రిక్తతను తగ్గించేందుకు చర్చలు జరపటానికి ఉత్తర, దక్షిణ కొరియాలు అంగీకరించాయి.

దక్షిణ కొరియాలో ఫిబ్రవరిలో జరిగే 2018 వింటర్ ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనేందుకు తమ క్రీడాకారుల బృందాన్ని కూడా ఉత్తర కొరియా పంపిస్తుంది.

రెండేళ్ల కిందట తొలగించిన సైనిక హాట్‌లైన్‌ను పునరుద్ధరించాలనే దానిపైనా ఒప్పందం కుదిరినట్లు దక్షిణ కొరియా ప్రభుత్వం చెప్పింది.

అయితే.. అణ్వస్త్ర నిరాయుధీకరణ విషయంలో ఉత్తర కొరియా ప్రతినిధి బృందం సానుకూలంగా స్పందించలేదని వెల్లడించింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ప్యోన్‌చాంగ్‌లో జరిగే ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనడానికి ఉత్తర కొరియా తొలుత కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ఆసక్తి చూపింది

చర్చల్లో ఏం జరిగింది?

రోజంతా చర్చలు జరిగిన అనంతరం ఉభయ పక్షాలూ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. సైనిక ఉద్రిక్తతను తగ్గించటానికి సైనిక చర్చలు జరపాలని అంగీకారానికి వచ్చినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నాయి.

వింటర్ ఒలింపిక్స్ క్రీడలకు తమ జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రతినిధి బృందాన్ని, అథ్లెట్లను, చీర్‌లీడర్లను, కళాకారులను, ప్రేక్షకులను, తైక్వాండో ప్రదర్శన బృందాన్ని, మీడియాను పంపించటానికి కూడా ఉత్తర కొరియా అంగీకరించింది. వారికి అవసరమైన సదుపాయాలు, సౌకర్యాలను దక్షిణ కొరియా ఏర్పాటు చేస్తుంది.

ఉభయ దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరచటానికి ఇతర రంగాలలో పరస్పర రాకపోకలు, ఉన్నత స్థాయి చర్చలు జరపాలని కూడా ఇరు దేశాలూ అంగీకరించాయని దక్షిణ కొరియా వార్తా సంస్థ యాన్‌హాప్ తెలిపింది.

ఉద్రిక్తతలను పెంచగల శత్రుపూరిత చర్యలను నిలిపివేయాలని ఉత్తరకొరియాకు దక్షిణ కొరియా సూచించగా.. కొరియా ద్వీపకల్పంలో శాంతియుత వాతావరణం నెలకొనేలా చూడాల్సిన అవసరముందని ఉత్తరకొరియా అంగీకరించిందని దక్షిణ కొరియా ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఉత్తర కొరియా క్రీడా బృందంలో అథ్లెట్లు, చీర్‌లీడర్లు కూడా ఉంటారు

మంగళవారం జరిగిన చర్చలకు సంబంధించి దక్షిణ కొరియా వెల్లడించిన ఇతర ముఖ్యాంశాలివీ...

  • 2006 వింటర్ ఒలింపిక్స్‌లో చేసినట్లుగానే.. ప్యోంగ్‌చాంగ్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకుల్లో ఉభయ కొరియాల అథ్లెట్లు కలిసి ప్రదర్శనలో (మార్చ్) పాల్గొనాలని దక్షిణ కొరియా ప్రతిపాదించింది.
  • కొరియా యుద్ధంలో వేరుపడిన కుటుంబ సభ్యుల సమాగమనం నిర్వహించే అంశాన్ని దక్షిణ కొరియా చర్చకు తీసుకువచ్చింది. ఉభయ కొరియాలకూ ఎంతో భావోద్వేగభరితమైన ఈ సమాగమనాన్ని వింటర్ ఒలింపిక్స్ మధ్యలో వచ్చే చంద్ర సంవత్సర (లూనార్ న్యూ ఇయర్) ఆరంభదినమైన సెలవు రోజున నిర్వహిద్దామని కూడా ప్రతిపాదించింది.
  • ఉత్తర కొరియా క్రీడాకారులు ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు వీలుగా.. సంబంధిత ఆంక్షలను ఐక్యరాజ్యసమితితో సమన్వయం చేసుకుంటూ తాత్కాలికంగా తొలగించే అంశాన్ని పరిశీలిస్తామని దక్షిణ కొరియా పేర్కొంది.

ఈ ప్రతిపాదనలకు ఉత్తర కొరియా ప్రతిస్పందన ఏమిటనేది ఇంకా తెలియరాలేదు.

ఉత్తర కొరియా ప్రతినిధి బృందం సారథి రి సాన్-గ్వాన్ తొలుత మాట్లాడుతూ సంయమనంగా వ్యవహరించారు. ఈ చర్చలు కొత్త సంవత్సరంలో ‘మంచి కానుక’ తెస్తాయని, ఉత్తర కొరియా నిజాయితీతో, నిక్కచ్చిగా వ్యవహరిస్తోందని ఆయన పేర్కొన్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక సరిహద్దు గ్రామమైన పాన్‌మున్‌జోమ్‌లో గల శాంతి భవనంలో ఇరు పక్షాలూ సమావేశమయ్యాయి

చర్చలు ఎక్కడ జరిగాయి? ఎలా జరిగాయి?

ఉభయ కొరియాల సరిహద్దులోని సైనిక మొహరింపు లేని ‘‘శాంతి గ్రామం’’ పాన్‌మున్‌జోమ్‌లో ఈ చర్చలు జరిగాయి.

ఇరు వైపుల నుంచీ ఐదుగురు ఉన్నత స్థాయి అధికారులు చర్చల్లో పాల్గొన్నారు. ఇరు దేశాల అగ్రనేతలు ఈ చర్చలను సీసీటీవీల ద్వారా వీక్షించినట్లు చెప్తున్నారు.

ఉత్తర కొరియా పాలకుడు కిమ్ ఉన్-జాంగ్ కొత్త సంవత్సర ప్రసంగంలో.. ఒలింపిక్స్‌కు తమ దేశం నుంచి క్రీడాకారుల బృందాన్ని పంపించే విషయాన్ని పరిశీలిస్తున్నానని పేర్కొన్నారు. అంతకుముందు దక్షిణ కొరియా ఒలింపిక్స్ చీఫ్ మాట్లాడుతూ.. ఈ క్రీడల్లో పాల్గొనటానికి ఉత్తర కొరియా క్రీడాకారులను స్వాగతిస్తామని చెప్పారు.

కిమ్ సంసిద్ధత వ్యక్తం చేయటంతో దక్షిణ కొరియా ఉన్నత స్థాయి చర్చలు జరుపుదామని ప్రతిపాదించింది. అయితే.. అమెరికా, దక్షిణ కొరియాలు తమ సంయుక్త సైనిక విన్యాసాలను ఒలింపిక్స్ పూర్తయ్యేవరకూ వాయిదా వేయటానికి అంగీకరించిన తర్వాతే ఉత్తర కొరియా ఈ చర్చలకు ఒప్పుకుంది. అమెరికా, ఉత్తర కొరియాలు ఏటా నిర్వహించే సైనిక విన్యాసాలను యుద్ధానికి సన్నాహకమని ఉత్తర కొరియా పరిగణిస్తుంది.

అయితే.. అమెరికా - దక్షిణ కొరియాల కూటమిని విభజించటానికి ఉత్తర కొరియా వేసిన ఎత్తుగడ ఈ చొరవ అని అమెరికాలోని కొందరు విమర్శకులు అభివర్ణిస్తున్నారు.


Image copyright Reuters
చిత్రం శీర్షిక ఉత్తర కొరియా వైఖరిలో ప్రాధమికంగా మార్పు వచ్చిందని దక్షిణ కొరియాలో విశ్వసించే వారు అతి స్వల్పం

నాటకీయ మార్పు

విశ్లేషణ: సోల్ నుంచి బీబీసీ ప్రతినిధి రూపర్ట్ వింగ్‌ఫీల్డ్

అణు యుద్ధం అనివార్యమంటూ వారం, పది రోజుల కిందట ఉత్తర కొరియా హెచ్చరించింది. ఈ ఉదయం ఉత్తర కొరియా ప్రతినిధి బృందం ఉభయ కొరియాలను విభజిస్తున్న సరిహద్దును దాటి వచ్చింది. ప్యోంగ్‌చాంగ్ క్రీడలకు తమ దేశం నుంచి క్రీడాకారులను పంపించటానికి అంగీకరించింది.

కొన్ని నెలల పాటు ఉద్రిక్తతలు రేగిన నేపథ్యంలో ఇది అకస్మాత్తుగా సంభవించిన నాటకీయ మార్పు. అయితే.. ఈ పరిణామాలను చూసి ఉత్తర కొరియా వైఖరిలో ప్రాధమికంగా మార్పు వచ్చిందని దక్షిణ కొరియాలో విశ్వసించే వారు అతి స్వల్పం.

అమెరికా తనపై సైనిక దాడికి ప్రణాళిక రచిస్తోందన్న భయం ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్-ఉన్‌లో పెరుగుతోందని, ఉద్రిక్తతలను తగ్గించటానికి తాను ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నారని నిపుణులు అంటున్నారు.

అయితే.. ఉత్తర కొరియాను నిజాయితీగల చర్చల్లోకి తీసుకురావటంతో పాటు.. అనుమానపూరిత మిత్ర దేశమైన అమెరికా అసంతృప్తికి లోనుకాకుండా చూడాల్సిన కత్తిమీద సాములాంటి పరిస్థితిలో దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్ ఉన్నారు.


మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)