మెట్రో రైళ్లలో వందల మంది తమ ప్యాంట్లు విప్పేశారు

  • 10 జనవరి 2018
లండన్ మెట్రో Image copyright NADER ELGADI

ఆదివారం ఉన్నట్టుండి ప్రపంచవ్యాప్తంగా 50 నగరాల్లోని మెట్రో రైళ్లలో వందల మంది ప్యాంట్లు లేకుండా అర్ధనగ్నంగా ప్రయాణిస్తూ అందరినీ గాబరాపెట్టారు.

లండన్‌ మెట్రోలో దాదాపు 250 మంది పొట్టి నిక్కర్లు.. లోదుస్తులతో ప్రయాణిస్తూ హల్‌చల్ చేశారు.

'ఫ్లాష్ మాబ్‌'లా ఏర్పడి అందరూ చూస్తుండగానే ఒక్కసారిగా మెట్రో రైళ్లలో ప్యాంట్లు విప్పేశారు.

కేరింతలు కొడుతూ.. పకపకా నవ్వుతూ.. సందడి చేశారు.

దాంతో ఏం జరుగుతోంది? అంటూ అవాక్కవడం ఇతర ప్రయాణికుల వంతైంది!

Image copyright NADER ELGADI
చిత్రం శీర్షిక మెట్రో స్టేషన్‌లో

ఎందుకిలా చేశారు?

సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలు చూస్తే ప్రజల్లో ఏదైనా అవగాహన కల్పించేందుకో లేదా నిరసన వ్యక్తం చేసేందుకో చేస్తున్నారని అనుకుంటాం.

కానీ.. వీళ్లు చేసిన ఈ అర్ధనగ్న ప్రదర్శనకు మాత్రం అలాంటి కారణాలేవీ లేవట.

కేవలం 'హాస్యం' కోసమే తాము ఇలా చేశామని అందులో పాల్గొన్నవారు చెప్పారు.

'నో ట్రౌజర్ ట్యూబ్ రైడ్' పేరుతో ఇలా ప్రపంచవ్యాప్తంగా పలు నగరాల్లో చేస్తున్నారు. ఇది తొమ్మితోసారి.

"ఇది కేవలం ఫన్ కోసమే. మరే విశేషమూ లేదు" అని లండన్‌‌లోని ఈ రైడ్ నిర్వాహకుల్లో ఒకరైన ఎవాన్ మార్కోవిచ్ 'బీబీసీ థ్రీ'కి చెప్పారు.

'ఇది ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కాదు. చారిటీలకు విరాళాలు సేకరించేందుకు అంతకన్నా కాదు. కేవలం జనాల ముఖాల్లో నవ్వు చూడాలి అన్న ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నాం" అని ఆయన వివరించారు.

Image copyright NADER ELGADI
చిత్రం శీర్షిక కొందరు ఇలా పుస్తకాలు చదివారు.

ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు అందరూ (ఒంటినిండా దుస్తులతో) లండన్‌లోని చైనాటౌన్‌ వద్ద గుమికూడారు.

నగరంలోని మెట్రోను పూర్తిగా చుట్టేసేందుకు వీలుగా 6 బృందాలుగా విడిపోయి వేరువేరు స్టేషన్లకు వెళ్లారు.

ఆ తర్వాత వాళ్లంతా రైళ్లలోకి ప్రవేశించగానే.. అందరూ ప్యాంట్లను విప్పేసుకోవాలని ఆయా బృందాల నాయకులు ఆదేశించారు.

వెంటనే ప్యాంట్లు తొలగించేసి.. అందరూ ఒక్కసారిగా పకపకా నవ్వడం.. కేరింతలు కొట్టడం ప్రారంభించారు.

Image copyright NADER ELGADI
చిత్రం శీర్షిక కొందరు సరదా చేష్ఠలతో అందరినీ నవ్వించారు.

చలిని లెక్కచేయకుండా!

లండన్‌లో ఆదివారం చలి తీవ్రంగా ఉంది. ఉష్ణోగ్రత 3 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది.

అయినా వాళ్లు లెక్కచేయలేదు. చిన్నా పెద్ద అన్న తేడా లేకుండా అన్ని వయసుల వారూ ఈ వింత రైడ్‌లో పాల్గొన్నారు.

కొందరు అర్ధనగ్నంగా ప్రయాణిస్తూ పుస్తకాలతో కాలక్షేపం చేశారు. మరికొందరు సరదా చేష్ఠలతో అందరినీ నవ్వించారు.

ఈ 'నో ట్రౌజర్ ట్యూబ్ రైడ్' 2002లో న్యూయార్క్‌లో ప్రారంభమైంది. క్రమంగా ప్రపంచవ్యాప్తంగా అనేక నగరాలకు పాకింది.

ఈ ఏడాది లండన్.. మాస్కో.. బ్రిస్బేన్.. ఆక్లాండ్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 నగరాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 20 వేల మంది పాల్గొన్నారు.

ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)