ధూమపానం: సరదాగా ఒక్క పఫ్ అని మొదలెడతారు.. తర్వాత బుక్కైపోతారు

  • 11 జనవరి 2018
ధూమపానం Image copyright Getty Images

ఒక్కసారి ఆ సిగరెట్ పొగ రుచి ఎలా ఉంటుందో చూడాలని ప్రయత్నించిన వారిలో మూడింట రెండు వంతుల మంది.. తాత్కాలికంగానైనా రోజువారీ స్మోకర్లుగా మారుతున్నారని ఈ పరిశోధన చెప్తోంది.

అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. జనాభాలో 60.3 శాతం మంది ధూమపానం రుచి చూడాలని ప్రయత్నించారు. అలా రుచి చూసిన వారిలో 68.9 శాతం మందికి ధూమపానం రోజు వారీ అలవాటుగా మారింది.

సిగరెట్లు తొలి అనుభవంతోనే 'ఎంత బలమైన పట్టుసాధిస్తాయ'నేది ఈ అధ్యయనంలో వెల్లడైందని ఈ అధ్యయనం నిర్వహించిన పరిశోధకులు చెప్తున్నారు.

అసలు సిగరెట్‌ను ఒక్కసారి తాగి చూడాలనే ప్రయత్నం చేయకుండా ఉండటం ఎంత ముఖ్యమో ఈ అధ్యయనం నిర్ధారిస్తోందని వారు పేర్కొన్నారు.

Image copyright ROSLAN RAHMAN

‘సరైన దారిలో బ్రిటన్’

ఈ అధ్యయన విశ్లేషణ ‘నికొటిన్ అండ్ టొబాకో రీసెర్చ్’ జర్నల్‌లో ప్రచురితమైంది. 2000 నుంచి 2016 సంవత్సరాల మధ్యలో నిర్వహించిన ఎనిమిది సర్వేల్లో పాల్గొన్న 2,15,000 మంది వెల్లడించిన వివరాలు గ్లోబల్ హెల్త్ డాటా ఎక్స్చేంజ్‌ నుంచి సేకరించి వీరు విశ్లేషించారు.

లండన్‌లోని క్వీన్ మేరీ యూనివర్సిటీకి చెందిన పీటర్ హాజెక్ ఈ అధ్యయనానికి సారథ్యం వహించారు. మొదటి సిగరెట్‌ను ఆసక్తి కొద్దీ రుచి చూడటానికి - ధూమపానం దైనందిన అలవాటుగా మారటానికి గల సంబంధాన్ని ఇంత భారీ సమాచారంలో నమోదు చేయటం ఇదే తొలిసారి అని ఆయన పేర్కొన్నారు.

‘‘మొదటిసారి ధూమపానం చేయటం నుంచి ధూమపానం అలవాటున్న వ్యక్తిగా మారుతున్న రేటు ఆశ్యర్యకరమైనంత ఎక్కువగా ఉందని మేం గుర్తించాం. అసలు మొదట సిగరెట్‌ను రుచి చూసే ప్రయత్నాన్నే నిరోధించటానికి గల ప్రాధాన్యతను ఇది నిర్ధారిస్తోంది’’ అని ఆయన వివరించారు.

‘‘ప్రస్తుతం బ్రిటన్‌లో ధూమపానం గణనీయంగా తగ్గిపోతోంది. 11 ఏళ్ల నుంచి 15 ఏళ్ల లోపు వయసు యుక్తవయస్కుల్లో కేవలం 19 శాతం మంది మాత్రమే సిగరెట్ తాగిచూసే ప్రయత్నం చేశారన్న ఇటీవలి అధ్యయన ఫలితాలతో ఇది సరిపోతోంది. మనం సరైన దారిలోనే వెళుతున్నామని చెప్పే శుభవార్త ఇది’’ అని పీటర్ చెప్పారు.

Image copyright Getty Images

బ్రిటన్ ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ గణాంకాల ప్రకారం 2010లో 19.9 శాతంగా ఉన్న వయోజనులైన ధూమపాన ప్రియులు 2016లో 15.5 శాతం మందికి.. అంటే సుమారు 76 లక్షల మందికి తగ్గిపోయింది.

అలాగే.. 18 ఏళ్ల నుంచి 24 ఏళ్ల వయసుగల యువతలో ధూమపానప్రియుల సంఖ్య 2010లో 25.8 శాతంగా ఉంటే.. 2016 నాటికి 19.3 శాతానికి తగ్గిపోయింది.

పొగాకు అమ్మకాల మీద ప్రభుత్వ నియంత్రణ మరింతగా పెరగాలని యాక్షన్ ఆన్ స్మోకింగ్ అండ్ హెల్త్ అనే స్వచ్ఛంద సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డెబోరా అర్నాట్ పిలుపునిచ్చారు.

అయితే.. ఈ పరిశోధనకు కొన్ని పరిమితులు ఉన్నాయని అధ్యయన రచయితలు చెప్తున్నారు.

Image copyright Getty Images

ఒకసారి ధూమపానం చేసిన వారిలో రోజువారీ స్మోకర్లుగా మారిన వారి నిష్పత్తి.. అమెరికాలో ఒకరికి 52 శాతంగా ఉంటే.. బ్రిటన్‌లో ఒకరికి 82 శాతంగా ఉంది. అంటే.. 68.9 శాతం మంది రోజువారీ స్మోకర్లుగా మారుతున్నారన్న లెక్క.. ఈ సంఖ్యల సగటును బట్టి వేసిన అంచనా.

అలాగే.. జనం తాము ధూమపానం చేసిన ఉదంతాల చరిత్రను గుర్తుచేసుకోవటం ఖచ్చితంగా ఉందా లేదా అన్న అంశం మీదా ప్రశ్నలున్నాయని పరిశోధకులు పేర్కొన్నారు.

‘‘పొగాకు నియంత్రణలో ప్రపంచంలో బ్రిటన్ అగ్రభాగాన ఉంది. మా కఠిన చర్యల ఫలితంగా ఇంగ్లండ్‌లో ధూమపానం కనిష్ఠస్థాయికి చేరింది’’ అని బ్రిటన్ ప్రజారోగ్య శాఖ మంత్రి స్టీవ్ బ్రైన్ పేర్కొన్నారు.

’’ధూమపాన రహిత తరానికి బాటను సిద్ధం చేయటానికి మేం ఇటీవల కొత్తగా పొగాకు నియంత్రణ చర్యలు ప్రారంభించాం. ధూమపానం వల్ల ప్రమాదాల మీద ప్రజల్లో అవగాహన పెంచటానికి, వారు పూర్తిగా మానివేసేలా మద్దతు ఇవ్వటానికి కృషి చేస్తున్నాం’’ అని ఆయన వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు