ఇరాక్: శిథిలమైన మోసుల్ నగరం కింద శవాల కోసం వెదుకులాట

  • 11 జనవరి 2018
శిథిలమైన మోసుల్ నగరం Image copyright Getty Images

ఇరాక్‌లోని రెండో అతిపెద్ద నగరం మోసుల్. దాన్ని ఇస్లామిక్ రాజ్యంగా ఐఎస్ ప్రకటించింది. కానీ ఇప్పుడక్కడ శిథిలాలు మాత్రమే మిగిలాయి. వాటి మధ్య కొందరు తమ బంధువుల మృతదేహాల కోసం వెతుకుతున్నారు.

ఇరాక్ ప్రభుత్వం నాలుగు నెలల క్రితం భారీ మిలటరీ ఆపరేషన్‌ నిర్వహించి మోసుల్ నగరాన్ని తమ అధీనంలోకి తెచ్చుకోవడంలో విజయం సాధించినట్టు ప్రకటించింది. కానీ ఆ క్రమంలో జరిగిన దాడుల్లో దాదాపు పది వేల మంది సామాన్య పౌరులు చనిపోయారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ నివేదిక చెబుతోంది.

బాంబు దాడుల్లో నగరంలోని ఎన్నో భవంతులు నేలకూలాయి. ప్రస్తుతం అదో శిథిల నగరాన్ని తలపిస్తోంది.

గతంలో ఆ నగరంలో నివసించిన అహ్మద్ అనే వ్యక్తితో కలిసి ‘బీబీసీ’ మోసుల్‌లో ప్రయాణించింది.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: శిథిలమైన నగరం కింద శవాల కోసం వెదుకులాట

ఆ క్రమంలో అహ్మద్ మోసుల్‌తో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఒకప్పుడు తాను పుట్టి పెరిగిన ఆ నగరాన్ని చూసి గర్వపడేవాణ్ణనీ, ఇప్పుడు దాని పరిస్థితిని చూసి సిగ్గుపడుతున్నాననీ చెప్పారు.

‘ఐఎస్ మిలిటెంట్లు మొదట మా పొరుగు వీధిలోకి ప్రవేశించి అక్కడి వారిని ఖాళీ చేయించారు. ఆ స్థానంలో తమ కుటుంబీకులను చేర్చారు. వాళ్ల కారణంగా మా కుటుంబంలో ఎనిమిది మంది చనిపోయారు.

నీళ్లు తేవడానికి వెళ్లిన మా బావ ఫిరంగుల దాడికి గురై మరణించాడు. ఓసారి ఐఎస్ మిలిటెంట్లు పౌరులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించారు. ఆ సమయంలో నా మరదలికి జబ్బు చేసింది. దాంతో ఆమెను భారంగా భావించిన మిలిటెంట్లు ఆమెను చంపేసి నదిలో పడేశారు’ అంటూ ఆవేదనగా చెబుతారు అహ్మద్.

మోసుల్ శిధిలాల్లో చిక్కుకున్న తమ బంధువుల మృతదేహాల్ని ఎప్పుడు వెలికి తీస్తారోనని అహ్మద్ లాంటి ఎందరో పౌరులు ఎదురు చూస్తున్నారు.

మోసుల్‌ నగరాన్ని పునర్నిర్మించడానికి చాలా ఏళ్లు పడుతుంది. అక్కడి ప్రజల జీవితాలను పునర్నిర్మించడానికి అంతకంటే ఎక్కువ సమయమే పట్టొచ్చు..!

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)