వినికిడి సమస్య: హలో.. మిమ్మల్నే.. వినిపిస్తోందా? లేదంటే వెంటనే పరీక్షించుకోవాలి
- డాక్టర్ మైఖేల్ మోస్లీ
- బీబీసీ

ఫొటో సోర్స్, Getty Images
మీకు వినికిడి సమస్యలు ఉన్నట్లయితే నిపుణుల సాయం తీసుకోవడంలో ఆలస్యం చేయవద్దు
జనాభాలో సగటున ప్రతి ఆరుగురిలో ఒకరికి ఏదో ఒక స్థాయిలో వినికిడి లోపం ఉందని పలు అధ్యయనాలు చెప్తున్నాయి.
వారసత్వంగా సంక్రమించే అంశాలు, ధ్వని కాలుష్యానికి లోనుకావటం, గాయాలు, వ్యాధులు ఇందుకు ప్రధాన కారణాలు. ఇక వయసు విషయం వేరే చెప్పనక్కర్లేదు.
లావు పెరగటం, జుట్టు నెరవటం లాగానే.. వినికిడి శక్తి తగ్గటం కూడా వయసుతో పాటు అనివార్యంగా జరిగేదేనని చాలా మందిమి అనుకుంటూ ఉంటాం. వృద్ధాప్యం పెరిగేకొద్దీ వినికిడి శక్తి లోపించే అవకాశాలున్నాయన్నది నిజమే.
యాభై ఏళ్ల వయసు దాటిన వారిలో 40 శాతం మందికి పైగా ఏదో ఒక స్థాయి వినికిడి లోపం ఉంది. ఇక 70 ఏళ్లు పైబడిన వారిలో 70 శాతం మందికి ఈ సమస్య ఉంటుంది.
శుభవార్త ఏమిటంటే.. ఈ సమస్యను మనం నివారించవచ్చు. చెడ్డ వార్త ఏమిటంటే.. వినికిడి లోపాన్ని విస్మరిస్తే.. దిమెన్షియా ప్రమాదం ఎక్కువగా ఉండటం సహా పలు తీవ్ర పరిణామాలకు దారితీసే ముప్పు ఉంటుంది.
ఫొటో సోర్స్, Getty Images
వినికిడి యంత్రాలు అవసరమైన జనంలో కేవలం 40 శాతం మంది మాత్రమే వాటిని వాడుతున్నారు
మనుషులపై వినికిడి లోపం ప్రభావం ఎలా ఉంటుంది?
నా వినికిడి శక్తి గతంలో ఉన్నంత బాగా ఇప్పుడు లేదు. అందువల్ల ఈ అంశం మీద నాకు వ్యక్తిగతంగా చాలా ఆసక్తి ఉంది.
నేను రణగొణ ధ్వనులతో నిండివుండే పబ్బులు, రెస్టారెంట్లకు వెళ్లినపుడు ఎవరు ఏం చెప్తున్నారో వినటానికి చాలా కష్టపడాలి. నా పిల్లలు సంతోషంగా ఒకరితో ఒకరు అరుస్తూ మాట్లాడుకుంటుంటే.. వారి మాటల్లో ఒకటీ అరా వినపడుతుంటే మొత్తం వింటున్నట్లు నటిస్తూ కూర్చుంటాను.
ఆ మాటలు వినటానికి నేను చాలా కష్టపడి ఏకాగ్రత నిలపాలి. దానివల్ల చాలా అలసిపోతాను. అలాగే ఆ మాటల్లోని వివరాలు నాకు అందకుండా పోతున్నాయన్నది నాకు తెలుసు. అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అయినా ‘ఏంటీ???’, ‘ఏంటీ???’ అని అడుగుతూ వారిని మళ్లీ మళ్లీ చెప్పాలని అడగాలనిపించదు.
వినికిడి శక్తి క్రమంగా తగ్గిపోవటం కొంత మందికి అసౌకర్యం కన్నా పెద్ద సమస్య అవుతుంది. దానివల్ల వారు సామాజికంగా ఏకాకిగా మారిపోయే ముప్పు ఉంటుంది. దానిఫలితంగా వారికి కుంగుబాటు వంటి మానసిక ఆరోగ్య సమస్యలు కూడా రాగలవు.
ఫొటో సోర్స్, Getty Images
వినికిడి శక్తి లోపం వల్ల దిమెన్షియా (మతిమరుపు) ప్రమాదం అధికంగా ఉంటుంది
వినికిడి శక్తి కోల్పోవటం వల్ల దిమెన్షియా (మతిమరుపు) వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుందనేందుకు చాలా ఆధారాలు లభిస్తున్నాయి.
కాబట్టి.. ఈ సమస్యను విస్మరించకుండా ఉండటం చాలా ముఖ్యం. అయినప్పటికీ.. బ్రిటన్‌లో ప్రజలు తమకు వినికిడి సమస్య మొదలైన తర్వాత చికిత్స తీసుకోవడానికి సగటున పదేళ్ల పాటు ఆగుతారు.
యాక్షన్ ఆన్ హియరింగ్ లాస్ అనే స్వచ్ఛంద సంస్థ అంచనా ప్రకారం.. వినికిడి యంత్రాలు అవసరమైన జనంలో కేవలం 40 శాతం మంది మాత్రమే వాటిని వాడుతున్నారు.
వారి వైద్యుడు ఆడియాలజీ నిపుణులను సంప్రదించాలని సిఫారసు చేయకపోవటమో, పెద్దగా కనిపించే వినికిడి యంత్రాలు ఇస్తారేమోనన్న ఆందోళనో.. మిగతా వారు ఆ పరికరాలను వాడకపోవటానికి కారణం కావచ్చు.
వినికిడి సమస్య ఉందని చెప్పే సంకేతాలు ఏమిటి?
వినికిడి యంత్రాలు గతంలో కన్నా చాలా గోప్యంగా, సమర్థవంతంగా ఉన్నప్పటికీ.. వాటిని ధరించటానికి ఇంకా చాలా మంది విముఖంగానే ఉన్నారు.
ఫొటో సోర్స్, Getty Images
ఒక బిజీ రెస్టారెంట్లో టేబుల్ మీద అవతలి వాళ్లు చెప్తున్నదానిని వినటానికి కష్టపడాల్సి రావచ్చు
ఇంకొంత మంది చికిత్స తీసుకోకపోవటానికి కారణం.. తమ వినికిడి శక్తి మందగిస్తోందని వారు గుర్తించకపోవటం కావచ్చు.
వినికిడి శక్తి క్రమక్రమంగా లోపించటాన్ని గుర్తించటం ఆశ్చర్యకరంగా కష్టమే. ఎందుకంటే అలాంటి లోపాన్ని భర్తీ చేసుకోవటంలో మన మెదడు చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి.. పరిస్థితి బాగా ముదిరే వరకూ మన వినికిడి శక్తి ఎంతగా తగ్గిపోయిందో మనకు తెలియను కూడా తెలియదు.
వినికిడి శక్తి లోపిస్తోందనే హెచ్చరిక సూచనలు:
- టీవీ సౌండ్ చాలా ఎక్కువగా పెట్టుకోవటం
- సంభాషణలను వినటంలో ఇబ్బందులు
- ఫోన్ కాల్స్‌ను, డోర్ బెల్‌ను వినకుండా మిస్ కావటం
- వినికిడి సమస్య ఉందన్న మాటను తిరస్కరించటం
ఫొటో సోర్స్, Getty Images
వినికిడి సమస్యను అధిగమించేందుకు ప్రధానంగా కంటిచూపు మీద ఆధారపడుతుంటారని ఆడిటరీ న్యూరాలజిస్ట్ చెప్తారు
వినికిడి శక్తి తగ్గిపోయే సమస్యను అధిగమించేందుకు జనం అనుసరించే మార్గాల్లో.. తమ ఇతర ఇంద్రియ శక్తుల మీద - ప్రధానంగా కంటిచూపు మీద ఆధారపడటం ఒకటని ఆడిటరీ న్యూరాలజిస్ట్ డాక్టర్ జెన్నిఫర్ బిజ్లీ చెప్తారు.
‘‘మెదడులో ఒక నిర్దిష్ట భాగం వినే పని చేస్తుందని, చూసే పని మరొక భాగం చేస్తుందని.. ఆ సమాచారాన్ని ఆ తర్వాతే ఒకచోటకు చేరుస్తాయని మనం భావించేవాళ్లం. కానీ.. ఈ ఇంద్రియ శక్తుల మధ్య నిజంగా ముందుగానే పరస్పర సంప్రదింపులు ఉంటాయని.. గందరగోళ ధ్వనుల మధ్య వినడం వంటి కష్టమైన పరిస్థితుల్లో ఆ సమాచారం మనకు సాయపడుతుందని మనకు ఇప్పుడు తెలుసు’’ అని ఆమె పేర్కొన్నారు.
’’ఒక వ్యక్తి నోటీ కదలికను లేదా సైగలను చూడటం ద్వారా.. రణగొణ ధ్వనుల మధ్య నుంచి సదరు వ్యక్తి స్వరాన్ని మరింత సమర్థవంతంగా పట్టుకుని వినటం సాధ్యమవుతుంది’’ అని వివరించారు.
ఫొటో సోర్స్, Getty Images
మాట్లాడే వ్యక్తి నోటి కదలికలు లేదా సైగలను చూడటం ద్వారా.. రణగొణ ధ్వనుల మధ్య ఆ వ్యక్తి స్వరాన్ని మరింత సమర్థవంతంగా వినవచ్చు
వినికిడి శక్తి మెరుగవటానికి ఏం చేయవచ్చు?
వినికిడి యంత్రాలు వాడకూడదని.. అలాగని నలుగురిలో ఉన్నప్పుడు వినడానికి ఇబ్బంది పడకూడదని మీరు భావిస్తున్నట్లయితే ఈ చిట్కాల్లో కొన్నిటిని ప్రయత్నించి చూడండి:
- ఇతరులతో కలిసి ఉన్నపుడు మీరు అందరి మధ్యలో ఉండండి
- ఇతరుల ముఖాలను స్పష్టంగా చూడగలిగేలా వెలుతురు మీ వెనుక నుంచి వచ్చే విధంగా చూసుకోండి
- ఇతరులు మీతో మాట్లాడుతున్నపుడు మీ వైపు తిరిగి మాట్లాడాలని, వారి నోటిని మూయవద్దని కోరండి
- ఇంకా మీకు నిజంగా ఆసక్తి ఉంటే.. లిప్ - రీడింగ్ (పెదవుల కదలికలను బట్టి మాటలు అర్థంచేసుకోవటం) నేర్చుకోవచ్చు
లిప్-రీడింగ్ నేర్చుకోవటం చాలా విలువైన నైపుణ్యమని.. అది కేవలం సంభాషణలను అర్థం చేసుకోవటానికే కాకుండా ఇంకా ఎక్కువ మేలు చేస్తుందని అసోసియేషన్ ఆఫ్ లిప్‌రీడింగ్ టు అడల్ట్స్ (ఏటీఎల్ఏ) చైర్‌వుమన్ మాలీ బెర్రీ అంటారు.
‘‘మనకు సాయం చేసే ఒక నైపుణ్యాన్ని నేర్చుకోవటం మాత్రమే కాదు.. అది మన మెదడుకు శిక్షణనిస్తుంది. ఏక కాలంలో చూస్తూ, వింటూ.. జరుగుతున్న దాని సారాంశాన్ని సంగ్రహించేలా శిక్షణనిస్తుంది. దీనివల్ల.. వినికిడి శక్తి మందగించటంతో వచ్చే గుర్తుపట్టలేకపోవటమనే సమస్య రాకుండా అది సాయం చేస్తుంది’’ అని ఆమె వివరించారు.
ఫొటో సోర్స్, Getty Images
లిప్-రీడింగ్ నేర్చుకోవటం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి
గుర్తుపట్టటం, జ్ఞాపకశక్తిల మీద వినికిడి లోపం ప్రభావాలు చాలా బలంగా ఉండే అవకాశముంది.
కానీ.. వినికిడి శక్తి కోల్పోవటాన్ని సరిచేసుకుంటే జ్ఞాపకశక్తి తరుగుదలను నివారించవచ్చు. అమెరికాలోని జాన్ హాప్కిన్స్ పరిశోధకులు ఇటీవల జరిపిన ఒక అధ్యయనం ఈ విషయాన్ని స్పష్టంగా చూపింది.
కాబట్టి.. వయసుతో వచ్చే వినికిడి మాంద్యానికి చికిత్స లేకపోయినప్పటికీ.. పరిస్థితులను మెరుగుపరచటానికి ఇంకా చాలా చేయొచ్చు.
ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మీ వినికిడి శక్తి తగ్గిపోతోందని మీరు భావిస్తే.. ఆలస్యం చేయొద్దు. అందుకు తాత్కాలిక కారణాలేవైనా ఉన్నాయా లేవా అని నర్ధారించుకుని, వినికిడి సమస్య పరీక్ష చేయించే మీ వైద్యుడి సాయం తీసుకోండి.
‘ట్రస్ట్ మీ.. ఐ యామ్ ఎ డాక్టర్’ కొత్త ధారావాహిక ప్రతి బుధవారం గ్రీన్విచ్ కాలమాన ప్రకారం రాత్రి 8:30 గంటలకు బీబీసీ2లో కొనసాగుతుంది. ఆ తర్వాత ఐప్లేయర్లో అందుబాటులో ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- కాఫీ ఆరోగ్యానికి మంచిదా? కాదా?
- ఇంటి పనులు చేయడం లేదా? అయితే ఇది చదవండి!
- ‘పరిశోధన’ కలలను బతికించుకున్న గృహిణులు
- 2017: సైన్స్‌లో 8 కీలక పరిణామాలివే!
- ఒకచోట ఉండే మహిళలకు పీరియడ్స్ ఒకేసారి వస్తాయా?
- ఇది కొత్త ప్రేమ ఫార్ములా
- తల్లిపాలకు టెక్నాలజీ అవసరమా?
- జికా వైరస్: క్యాన్సర్‌కు మందు
- పెళ్లి చేసుకుంటే మతిమరుపు పోతుందంట!!
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)