జైనబ్ హత్య: పాకిస్తాన్‌లో బాలికపై అత్యాచారం, హత్య.. కసూర్‌లో అల్లర్లు

  • 10 జనవరి 2018
జైనబ్ ఫొటో. దీనిని ప్రచురించటానికి ఆమె కుటుంబం అనుమతించింది
చిత్రం శీర్షిక ఏడేళ్ల బాలిక జైనబ్ మీద అత్యాచారం చేసి హత్యచేశారు

పాకిస్తాన్‌లోని కసూర్ నగరంలో చిన్నారుల వరుస హత్యలు కొనసాగుతున్నాయి. తాజాగా ఆరేళ్ల జైనబ్ మీద అత్యాచారం చేసి, గొంతు నులిమి హత్య చేశారు. ఈ హత్యలకు నిరసనగా అల్లర్లు చెలరేగగా, పోలీసుల కాల్పుల్లో ఇద్దరు ఆందోళనకారులు చనిపోయారు.

లాహోర్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాసుర్ నగరంలో కొద్ది రోజుల కిందట అదృశ్యమైన జైనబ్ మంగళవారం నాడు ఓ చెత్త కుప్పలో శవంగా కనిపించింది.

చిన్నారుల అపహరణలు, వారిపై లైంగిక దాడులు, హత్యల పరంపరను అరికట్టడానికి అధికారులు ఏమీ చేయటం లేదని ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

ఇటువంటి హత్యలు గడచిన రెండేళ్లలో 12 జరిగాయని కసూర్ పోలీసులు చెప్తున్నారు.

వీటిలో ఐదు హత్యలకు ఒక అనుమానితుడు కారణమని.. అతడి కోసం వందలాది మంది అధికారులు గాలిస్తున్నారని, 90 మంది అనుమానితుల నుంచి డీఎన్‌ఏ నమూనాలు సేకరించామని వారు పేర్కొన్నారు.

చిన్నారుల హత్యల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ కసూర్ నగర పోలీసు ప్రధాన కార్యాలయంలోకి చొచ్చుకువచ్చేందుకు ప్రయత్నించిన ఆందోళనకారుల బృందం మీద పోలీసులు కాల్పులు జరపటంతో ఇద్దరు చనిపోయారు.

జైనబ్ హత్య.. పాకిస్తాన్ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు రగిల్చింది. హంతకుడిని పట్టుకోవాలని సినీ, క్రికెట్ ప్రముఖులు డిమాండ్ చేశారు. ఇందులో పోలీసులకు సాయం చేయటానికి సైన్యం ముందుకు వచ్చింది.

చిత్రం శీర్షిక చిన్నారుల హత్యలను అరికట్టడానికి అధికారులు ఏం చేయటం లేదని ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు

ఖురాన్ పఠనం కోసం బయలుదేరిన జైనబ్ దారిలో అదృశ్యమైంది. చిన్నారి మృతదేహం ఆమె ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలో లభ్యమైంది.

తమ కూతురు అదృశ్యమైన విషయాన్ని ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదని.. జైనబ్ అదృశ్యం కాకముందు చివరిగా ఎక్కడ కనిపించిందనే సీసీటీవీ దృశ్యాలను తమ బంధువులే వెలికితీశారని, పోలీసులు ఏమీ చేయలేదని ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేశారు.

ఒక బాలికను ఒక వ్యక్తి చేయిపట్టుకుని తీసుకువెళుతున్న వీడియో దృశ్యం సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించింది.

‘‘పోలీసులు తక్షణమే స్పందించి ఉన్నట్లయితే ఆ దోషి పట్టుబడి ఉండేవాడు’’ అని జైనబ్ తండ్రి జియో టీవీతో పేర్కొన్నారు. ఈ దారుణం జరిగిన సమయంలో తీర్థయాత్ర కోసం సౌదీ అరేబియాలో ఉన్న ఆయన ఇస్లామాబాద్ నగరానికి తిరిగివచ్చారు.

కసూర్ నగరంలో రెండు నెలలకోసారి ఇటువంటి ఘటనలు జరుగుతున్నట్లు కనిపిస్తోందని పోలీసులు చెప్తున్నారు.

గత నెలలో ఓ తొమ్మిదేళ్ల బాలిక ఇంటి దగ్గరున్న దుకాణానికి వెళ్లి అదృశ్యమైంది. ఆమె తనను అపహరించిన వ్యక్తి నుంచి తప్పించుకున్నప్పటికీ.. శారీరకంగా, మానసికంగా తీవ్రంగా దెబ్బతినివుందని పలు కథనాలు చెప్తున్నాయి.

జైనాబ్ హత్యోదంతం పై సోషల్ మీడియాలో విస్తృత స్థాయిలో ఆగ్రహం పెల్లుబుకింది. #JusticeforZainab హ్యాష్ ట్యాగ్ ప్రపంచ వ్యాప్తంగా ట్రెండింగ్ అంశాల్లో అగ్రస్థాయికి చేరింది.

హంతకుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసిన వారిలో సినీ నటులు, క్రికెటర్లు కూడా ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు