భారతదేశంలో వైద్య చికిత్స చేయించుకోవాలనుకునే పాకిస్తాన్ పేషెంట్లకు వీసా సమస్యలు

భారతదేశంలో వైద్య చికిత్స చేయించుకోవాలనుకునే పాకిస్తాన్ పేషెంట్లకు వీసా సమస్యలు

పాకిస్తానీలు భారతదేశంలో మెడికల్ వీసాల కోసం చేసే దరఖాస్తులు తిరస్కారానికి గురవుతుంటాయి. ఏవో కొన్ని అత్యవసర పరిస్థితులలో ట్విటర్ ద్వారా భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ దృష్టికి వెళ్ళిన దరఖాస్తులకే ఆమోదం లభిస్తుంటుంది.

నిజానికి ఇది సరైన వీసా మంజూరీ విధానం కాదనడానికి సందేహించాల్సిన పని లేదు.

అయితే, అధికారిక వివరాల ప్రకారం భారతదేశంలో ఆరోగ్య చికిత్సల కోసం విదేశీయులు చేస్తున్న ఖర్చుల లెక్కల్లో ప్రథమ స్థానంలో ఉన్నది పాకిస్తానే.

డాక్టర్ తైమూర్ హసన్ క్యాన్సర్ పేషెంట్. కొన్నేళ్ళ కిందట ఢిల్లీకి వచ్చి చికిత్స తీసుకున్న తరువాత ఆయనకు కొత్త జీవితం లభించింది.

ఆయనకు ఇపుడు క్యాన్సర్ తిరగబెట్టింది. అయితే, ఈసారి ఆయన వీసా కోసం ఆరు నెలలు ఎదురు చూడాల్సి వచ్చింది.

అది కూడా భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తన ట్వీట్ లో అంగీకారం తెలిపిన తరువాతనే వచ్చింది.

ఇది మా డాక్టర్లకు కూడా ఆందోళన కలిగించే విషయం. తమ వద్ద ఉన్న రోగులకు సరైన సమయంలో తగిన వైద్యం అందాలని వారు ఆశిస్తారు.

అలా సరైన సమయంలో చికిత్స లభించకపోతే.. జబ్బు మరింత తీవ్రమవుతుంది.

డాక్టర్ తైమూర్, పంజాబ్ లోని వాఘా అటారి గేట్ ద్వారా, కాలి నడకతో భారత్ లోకి అడుగు పెట్టారు.

ఇదే అనువైన మార్గం. ద్వైపాక్షిక సంబంధాలు బాగున్నప్పుడు సరిహద్దు ప్రాంతం రద్దీగా ఉంటుంది. వీసాలు తక్కువ సంఖ్యలో ఉంటే.. లాహోర్, అమృత్ సర్ సరిహద్దు వద్ద పెద్దగా సందడే ఉండదు.

భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ తాజా సర్వే ప్రకారం.. 2015-16 లో 1,921 మంది పాకిస్తానీ రోగులకు వీసా మంజూరైంది. ఇది ఈ ప్రాంతంలోని ఇతర దేశాలతో పోల్చితే చాలా తక్కువ.

అయితే, పాకిస్తాన్ రోగుల నుంచి భారతదేశానికి లభిస్తున్న తలసరి ఆదాయం మాత్రం చాలా ఎక్కువని కూడా ఆ సర్వే వెల్లడించింది. ఈ గణాంకాలు కూడా పరిస్థితుల్లో మార్పు తేలేకపోతున్నాయి.

అయితే, కొత్తగా నియమితులైన పాకిస్తాన్ లోని భారత రాయబారి అజయ్ బిసారియా.. తన హయాంలో మెడికల్ టూరిజాన్ని ప్రోత్సహించాలని భావిస్తున్నారు.

‘‘ప్రజల పట్ల మానవతా దృక్పథంతో ఉండడం ద్వైపాక్షిక సంబంధాలకు చాలా ముఖ్యమని భావిస్తాం. మెడికల్ వీసా అన్నది కష్టం లో ఉన్న ప్రజలకు, అత్యవసర వైద్యం అవసరమైన వారికి అందించే చేయూతలో ఇదొక కోణం మాత్రమే. దీనిని మేం మరింతగా ప్రోత్సహించాలనుకుంటున్నాం.’’ అని అజయ్ వివరించారు.

ఇలాంటి హామీ ఉన్నప్పటికీ.. అనుమతి కోసం ఎదురు చూస్తున్న రోగులు చాలా మందే ఉన్నారు. డాక్టర్ తైమూరుల్ హసన్ చాలా అదృష్టవంతులు. సుష్మా స్వరాజ్ జోక్యంతో ఆయన ఢిల్లీకి చేరుకుని తగిన సమయంలో చికిత్స తీసుకున్నారు. కానీ, ఈ పద్ధతుల్లో ఎందరికి వీసాలు మంజూరవుతాయి? ఎంత కాలానికి మంజూరవుతాయి?

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)