ట్రంప్‌కి వైద్యపరీక్షలు: వాటిలో ఏం బయటపడుతుంది?

  • 11 జనవరి 2018
జపాన్ ప్రధాని షింజో అబే ఇచ్చిన విందులో పాల్గొన్న అనంతరం ట్రంప్ Image copyright EPA

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి శుక్రవారం మొదటిసారిగా 'అధ్యక్ష వైద్య పరీక్షలు' జరగనున్నాయి. ఈ పరీక్షల్లో ఏం తేలనుంది?

మేరీలాండ్‌లో బెతెస్డాలోని వాల్టర్ రీడ్ వైద్య కేంద్రంలో ట్రంప్‌కు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా ఆయన డాక్టర్‌కి కొన్ని మంచి విషయాలు, కొన్ని చెడ్డ విషయాలు చెప్పనున్నారు.

ముందు మంచి విషయాలేంటో చూద్దాం.

ఆయనకు మద్యం అలవాటు లేదు. ఇప్పటివరకు ఎన్నడూ తాగలేదు.

మద్యం అలవాటు కారణంగా తన సోదరుడు ఫ్రెడ్ 43 ఏళ్లకే చనిపోయారని, దాని నుంచి తాను పాఠం నేర్చుకున్నానని ట్రంప్ గతంలో చెప్పారు.

అంతే కాదు, ట్రంప్‌కు సిగరెట్ అలవాటూ లేదు.

ఇప్పుడు చెడ్డ విషయాలు.

ఇటీవల విడుదలైన పుస్తకంలో ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా నాలుగు రకాల ఫుడ్స్ తిన్నారని రాశారు. అవి:

  • మెక్‌డొనాల్డ్స్
  • కెంటకీ ఫ్రైడ్ చికెన్
  • పిజ్జా
  • డైట్ కోక్

ట్రంప్ మాజీ ప్రచార మేనేజర్ కోరే లెవాన్డోస్కీ రచనా సహకారం అందించిన ఈ పుస్తకంలో ట్రంప్ డిన్నర్ కింద 'రెండు పెద్ద మ్యాక్ లు, రెండు ఫిలెట్-ఒ-ఫిష్, ఒక చాకొలేట్ మాల్టెడ్ (మిల్క్ షేక్)' తీసుకున్నారని పేర్కొన్నారు.

అవి 2,430 కెలోరీలతో సమానం. ఒక మనిషి రోజుకు 2,500 కెలోరీలు మాత్రమే తీసుకోవాలనేది ఆరోగ్య నిపుణుల అభిప్రాయం.

దీనికి తోడు, ట్రంప్‌కు ఎక్సర్‌సైజులంటే నమ్మకం లేదు. ఆయన గోల్ఫ్ ఆడినా, ఆ ఆటలో బగ్గీని ఎక్కే తిరుగుతారు.

ఒక విశ్వసనీయం సమాచారం ప్రకారం ట్రంప్.. ‘మనిషి శరీరం అపరిమితమైన శక్తి కలిగిన బ్యాటరీ లాంటిది. ఎక్సర్‌సైజులు చేస్తే అది తగ్గిపోతుంది' అని భావిస్తారు.

Image copyright Sara Kayat
చిత్రం శీర్షిక ట్రంప్ డైట్‌పై డా.సారా కయత్ సమీక్ష

ట్రంప్ గురించి మంచి, చెడు విషయాలు:

  • వయసు: 71 ఏళ్లు
  • ఎత్తు: 6 అడుగుల 3 అంగుళాలు
  • బరువు: 236 పౌండ్లు
  • బాడీ మాస్ ఇండెక్స్ : 29.5 (ఓవర్ వెయిట్ విభాగం)
  • 15-20 పౌండ్లు: ట్రంప్ తగ్గాలనుకుంటున్న బరువు

సెప్టెంబర్, 2016లో అధ్యక్ష ఎన్నికలకు రెండు నెలల ముందు ట్రంప్ తన మెడికల్ రికార్డులను విడుదల చేసారు. అప్పుడు ఆయన కొలెస్టరాల్ 169 ఉంది. 200లోపు కొలెస్టరాల్ ఉంటే అది మంచిదే. ఆయన 'మంచి', 'చెడు' కొలెస్టరాల్ రెండూ కూడా ఆరోగ్యకరంగానే ఉన్నాయి.

ట్రంప్ బ్లడ్ ప్రెజర్ (116/70) కూడా తగిన పరిమితుల్లోనే ఉంది. ఆయన కాలేయం, థైరాయిడ్ కూడా ఆరోగ్యంగానే ఉన్నాయి. ఆయనకు చివరిసారిగా నిర్వహించిన కలనోస్కోపీలో ఎలాంటి సమస్యలూ కనిపించలేదు.

'మొత్తంగా చూస్తే ట్రంప్ ఆరోగ్యం భేషుగ్గా ఉంది' అని ఆయన డాక్టర్ హెరాల్డ్ బోర్న్‌స్టీన్ అన్నారు.

అయితే లండన్‌కు చెందిన డాక్టర్ సారా కయత్ మాత్రం ట్రంప్ రిస్క్ తీసుకుంటున్నారని అభిప్రాయపడ్డారు.

''ఎక్కువ కొవ్వు పదార్థాలు, ఎక్కువ ఉప్పు ఉన్న ఆహారాన్ని తీసుకోవడమే కాదు, పళ్లు, కాయగూరలు కూడా చాలా తక్కువగా తీసుకుంటున్నారు'' అని ఆమె అన్నారు.

'పళ్లు, కాయగూరలు తక్కువగా తీసుకోవడం, ఎక్కువ సంతృప్త కొవ్వు పదార్థాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల గుండెజబ్బులు, క్యాన్సర్, మధుమేహ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది' అని ఆమె అభిప్రాయపడ్డారు.

పొగ త్రాగకపోవడం, మద్యం సేవించకపోవడం వల్ల ట్రంప్‌కి మేలే అయినా, ఎక్సర్‌సైజ్ మాత్రం చాలా ముఖ్యమని డాక్టర్ కయత్ అన్నారు.

''ఎక్సర్‌సైజ్ లేకపోవడం వల్ల సిగరెట్ తాగితే ఎలాంటి గుండెజబ్బులు వస్తాయో, అలాంటి జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఎలాంటి శారీరక శ్రమ చేయని వారికి, రోజూ ఎక్సర్‌సైజ్ చేసే వారితో పోలిస్తే గుండెజబ్బులు వచ్చే అవకాశం రెండు రెట్లు ఎక్కువ'' అన్నారు.

Image copyright Reuters
చిత్రం శీర్షిక ఫిలడెల్ఫియాలో ప్రచారం సందర్భంగా ఆర్డర్ కోసం ఎదురుచూస్తున్న ట్రంప్

మానసిక స్థితిపై పరీక్షలు ఉండవు

ఇటీవల ట్రంప్ మానసిక ఆరోగ్యంపై కూడా చాలా సందేహాలు లేవనెత్తుతున్నా, శుక్రవారం జరిపే వైద్య పరీక్షల్లో దానిని మాత్రం పరీక్షించరు.

ఆయన వైద్య పరీక్షల రిజల్ట్స్‌ను పూర్తిగా వెల్లడించకున్నా, వైట్ హౌస్ డాక్టర్ రానీ జాక్సన్ వాటి గురించి సంక్షిప్తంగా వివరిస్తారు.

మరి ట్రంప్ కనుక డాక్టర్ సారా కయత్ ఆఫీసుకు వెళితే ఆమె ఏం సలహా ఇస్తారు?

‘'పోషకాహారం, శారీరక శ్రమ వల్ల వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గి, దీర్ఘకాల వ్యాధుల వల్ల మరణించే అవకాశం తగ్గుతుంది. ఇవి రెండూ లేకుంటే అది సిగరెట్ తాగడంతో సమానం. కేవలం ఒక విషయంలో మీరు మెరుగ్గా ఉన్నారని రెండో అంశాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు'' అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)