చంద్రయాన్ 2: రాకెట్లను శ్రీహరి కోట నుంచే ఎందుకు ప్రయోగిస్తారు?
- సతీష్ ఊరుగొండ
- బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, iSRO
నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్తున్న ఇస్రో రాకెట్
ఇస్రో జీశాట్ 29 ఉపగ్రహాన్ని బుధవారం విజయవంతంగా నింగిలోకి పంపింది. అంతకు ముందు 2017 ఫిబ్రవరిలో 104 ఉపగ్రహాలను ఇస్రో ఒకేసారి నింగిలోకి పంపింది.
నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ -షార్ ఉంది. భారత్‌కు చెందిన ఉపగ్రహాలను ఇక్కడి నుంచే ప్రయోగిస్తున్నారు.
చంద్రయాన్-1ను విజయవంతం చేసి భారత కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పింది..షార్. అంతరిక్ష రహస్యాలను ఛేదించేందుకు ప్రయత్నిస్తోంది.
శ్రీహరికోట నుంచే రాకెట్ ప్రయోగాలు ఎందుకు?
అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి దేశవ్యాప్తంగా పలు కేంద్రాలు ఉన్నాయి.
తిరువనంతపురంలో ఉపగ్రహ తయారీ కేంద్రం, ఇతర కీలక విభాగాలు ఉన్నాయి.
శ్రీహరికోట ఎందుకంత ప్రత్యేకం!
-
తిరువనంతపురంలో ఉపగ్రహ తయారీ కేంద్రం
-
హసన్, భోపాల్‌లలో రాకెట్లను నియంత్రించే మాస్టర్ కంట్రోల్ కేంద్రం
-
హసన్, లఖ్‌నవూ, మారిషస్‌లలో శాటిలైట్ ఎర్త్ సెంటర్లు
-
భారత దేశానికి సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది.
మరి, రాకెట్ ప్రయోగాలకు శ్రీహరికోటనే ఎంపిక చేయడానికి కారణాలు ఏమిటి?
ఫొటో సోర్స్, Google MAPS
శ్రీహరికోట భూమధ్య రేఖకు సమీపంగా ఉంది. ప్రపంచ పటం మీదుగా ఉన్న నల్లటి గీతే భూమధ్య రేఖ
1. భూమధ్యరేఖకు దగ్గరగా ఉండటం
రాకెట్ ప్రయోగాలకు శ్రీహరికోటను ఎంపిక చేయడానికి ప్రధానంగా 5 కారణాలు చెప్పుకోవచ్చు.
అందులో ఒకటి భూమధ్య రేఖకు శ్రీహరికోట దగ్గరగా ఉండటం.
ఇక్కడి నుంచి రాకెట్ ప్రయోగిస్తే పైసా ఖర్చు లేకుండా దానికి సెకన్‌కు 0.4 కిలోమీటర్ల అదనపు వేగం వస్తుంది.
భూభ్రమణం వల్ల రాకెట్‌కు గంటకు 1440 కిలోమీటర్ల అదనపు వేగం కలిసొస్తుంది.
శ్రీహరికోట ఎందుకంత ప్రత్యేకం!
-
తూర్పు తీరంలో శ్రీహరికోట ఉంది.
-
తూర్పు దిశ రాకెట్ ప్రయోగాలకు షార్ అనువైన ప్రాంతం.
-
భూమధ్య రేఖకు శ్రీహరికోట సమీపంగా ఉంది.
-
కౌరూ కేంద్రం తర్వాత అత్యంత అనువైన ప్రాంతం శ్రీహరికోటే.
భారత్‌లో శ్రీహరికోట, ఫ్రెంచ్‌గయానాలో కౌరూ, అమెరికాలో ఫ్లోరిడా కెన్నడీ స్పేస్ సెంటర్లు భూమధ్య రేఖకు సమీపంగా ఉన్నాయి.
ఈ కారణంగానే వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా.. కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచే యూరప్ రాకెట్లను ప్రయోగిస్తోంది.
ఫొటో సోర్స్, ISRO
భూభ్రమణానికి-రాకెట్ వేగానికి సంబంధం ఏమిటి?
గంటకు లక్షా 8వేల కిలోమీటర్ల వేగంతో భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోంది.
భూమి తిరుగుతున్న దిశలో రాకెట్‌ను ప్రయోగిస్తే అది కూడా మంచి వేగం అందుకుంటుంది.
అయితే, భూపరిభ్రమణ వేగం అంతటా ఒకేలా ఉండదు. అది ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది.
శ్రీహరికోట ఎందుకంత ప్రత్యేకం!
-
భూపరిభ్రమణ వేగం భూమధ్య రేఖ వద్ద అధికం
-
ధ్రువాల వద్ద భూపరిభ్రమణ వేగం అస్సలు ఉండదు!
-
గంటకు 1,674 కి.మీ భూమధ్య రేఖ వద్ద భూమి వేగం
-
భూమి పశ్చిమం నుంచి తూర్పు దిశగా తిరుగుతోంది.
రాకెట్ కూడా తూర్పు దిశగా ప్రయోగిస్తే, భూపరిభ్రమణ వేగం కారణంగా అది అదనపు స్పీడ్ అందుకుంటుంది.
అందుకే ప్రపంచంలో ముఖ్యమైన రాకెట్ ప్రయోగ కేంద్రాలు అన్నీ భూమధ్య రేఖకు సమీపంగానే ఏర్పాటు చేశారు.
ఫొటో సోర్స్, ESA
ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టడం సులువు
సమాచార ఉపగ్రహాలు భూమధ్య రేఖకు సరిగ్గా ఎగువన, లేదంటే కాస్త అటుఇటుగా ఉండే భూస్థిర కక్ష్యలో తిరుగుతూ ఉంటాయి.
అవి భూగురుత్వాకర్షణకు లోను కాకుండా, భూమి చుట్టూ స్థిరంగా తిరుగుతూ ఉండాలి.
భూమధ్య రేఖ సమీపం నుంచి ప్రయోగించే రాకెట్‌తో శాటిలైట్‌ను ఆ కక్ష్యలో చేర్చడం చాలా సులువు.
అందుకే సమాచార ఉపగ్రహాలను భూమధ్య రేఖ సమీపం నుంచే ప్రయోగిస్తారు.
ఒకవేళ భూగురుత్వాకర్షణకు గురైతే ఉపగ్రహాల గమనంలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.
అప్పుడు స్థిర కక్ష్యలో కొనసాగేందుకు చాలా శక్తిని ఖర్చు చేయాల్సి వస్తుంది. ఒక్కోసారి గతి తప్పి భూమి వైపు దూసుకురావొచ్చు.
ఫొటో సోర్స్, Science Photo Library
శ్రీహరికోటకు సుమారు 50 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. రాకెట్ ప్రయోగం విఫలమైనా ఎలాంటి ప్రాణనష్టం ఉండదు
2. సుదీర్ఘ తూర్పు తీరప్రాంతం!
రాకెట్ ఒక్కసారి గాల్లోకి లేచిన తర్వాత నేరుగా నింగిలోకే వెళ్తుందన్న గ్యారెంటీ లేదు.
సాంకేతిక కారణాలతో అప్పడప్పుడు రాకెట్లు గాడి తప్పి కూలిపోతూ ఉంటాయి.
అలాంటప్పుడు ఆ రాకెట్ శకలాలు జనావాసాల మీద పడితే ప్రాణనష్టం జరుగుతుంది.
శ్రీహరికోట ఎందుకంత ప్రత్యేకం!
-
ఒకవైపు బంగాళాఖాతం మరోవైపు పులికాట్ సరస్సు
-
43,360 ఎకరాలు శ్రీహరికోట విస్తీర్ణం
-
సుమారు 50 కి.మీ శ్రీహరికోట తీరప్రాంతం
-
ఈ విషయంలో శ్రీహరికోట పూర్తి సురక్షితం. ఎందుకంటే దాని చుట్టూ నీరు ఉంది.
ఈ పరిసరాల్లో పెద్దగా జన సంచారంగానీ, ఇళ్లు కానీ లేవు.
ఏదైనా జరగరాని ప్రమాదం జరిగినా.. రాకెట్ శకలాలు సముద్రంలో పడిపోతాయి. ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం ఉండదు.
ఫొటో సోర్స్, EPA
రాకెట్ ప్రయోగ కేంద్రం ఎంపికలో రవాణా సదుపాయాలు కీలక పాత్ర పోషిస్తాయి
3. రోడ్డు, రైలు, జల రవాణా సదుపాయం
రాకెట్ ప్రయోగాలకు పెద్ద పెద్ద యంత్రాలు, పరికరాలు అవసరం అవుతాయి. కొన్నింటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది.
అందుకే రవాణాకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలను రాకెట్ ప్రయోగ కేంద్రాల కోసం ఎంపిక చేస్తారు.
శ్రీహరికోట ఈ పరీక్షలో కూడా పాసైంది.
శ్రీహరికోట ఎందుకంత ప్రత్యేకం!
-
* శ్రీహరికోటకు అందుబాటులో రోడ్డు, రైలు, జల మార్గాలు
-
* శ్రీహరికోట నేషనల్ హైవే 5పై ఉంది.
-
రైల్వే స్టేషన్ 20 కిలోమీటర్లు
-
చెన్నై పోర్టు 70 కిలోమీటర్లు
ఫొటో సోర్స్, AFP
అంతరిక్ష పరిశోధనలో ఇస్రో తన సత్తా చాటుతోంది. రాకెట్ ప్రయోగాలను ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తారు.
4. ప్రయోగాలకు అనుకూల వాతావరణం
రాకెట్ ప్రయోగాలకు వాతావరణం అనుకూలంగా ఉండాలి. ఎక్కువ వర్షపాతం ఉండకూడదు. ఎండలు మండకూడదు.
శ్రీహరికోటలో ఏడాది పొడుగునా సాధారణ వాతావరణమే ఉంటుంది.
వర్షాలు, ఎండలు అతిగా ఉండవు. ఒక్క అక్టోబర్, నవంబర్‌లో మాత్రమే భారీ వర్షాలు కురుస్తాయి. మిగతా 10నెలలు ప్రయోగాలకు అనుకూల సమయమే.
ఫొటో సోర్స్, Hugh Lewis
5. భూమి స్వభావం ముఖ్యమే!
రాకెట్ ప్రయోగం సమయంలో భూమి తీవ్రంగా కంపిస్తుంది. దాన్ని తట్టుకునేలా భూమి అత్యంత ధృడంగా ఉండాలి.
శ్రీహరికోటలో భూమి రాళ్లతో అత్యంత ధృడంగా ఉంటుంది.
రాకెట్ ప్రయోగ కేంద్రం ఏర్పాటుకు శ్రీహరికోట ఒక ఆప్షన్ కాదు. భారత్‌కు ఉన్న అరుదైన అవకాశం.
శ్రీహరికోటను మించిన ప్రదేశం మరొకటి భారతదేశంలో లేదు. అందుకే ఇది'రాకెట్ ప్రయోగాల కోట' అయింది.
నిజానికి అంతరిక్ష పరిశోధనా ప్రయోగ కేంద్రాన్ని మొదట కేరళలోని తుంబలో ఏర్పాటు చేశారు.
తొలుత రాకెట్ల ప్రయోగ కేంద్రంగా ఉన్న తుంబ, తర్వాత పూర్తిస్థాయి రాకెట్ నిర్మాణ కేంద్రంగా మారింది.
ఇవి కూడా చదవండి:
- మహిళలు కనిపెట్టిన అద్భుతాలివి
- రూపాయికి ఏమేం కొనొచ్చో చూడండి
- ఇంటర్వ్యూ: హెబ్బార్స్ కిచెన్ సృష్టికర్త ఈవిడే
- #metoo బాలీవుడ్లో లైంగిక వేధింపులు ఎలా ఉంటాయంటే..
- #కోడిపందేలు: కోడి నెమలి ఎలా అయ్యింది?
- ‘ఇంతకీ అజ్ఞాతవాసి ఫ్రెంచ్ మూవీకి కాపీయా? కాదా?’
- ఫేస్బుక్లో గ్యాస్ ఇలా బుక్ చేసుకోండి
- 'గ్రీన్ కార్డు రావాలంటే మరో 108 ఏళ్లు ఆగాలి'
బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.