ఈ తమన్నా ఒంటికాలితో పోరాడుతోంది

  • 13 జనవరి 2018
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionఒంటికాలుతోనే పోరాడుతున్న యువతి

బంగ్లాదేశ్ లోని జెస్సోర్ జిల్లాకు చెందిన పదహారేళ్ల తమన్నాకు పుట్టుకతోనే ఒక కాలు లేదు. రెండు చేతులూ లేవు. కానీ, నిరాశ పడలేదు. పట్టుదలతో చదువుకుని మంచి గ్రేడ్‌లతో తన ప్రతిభను చాటుకుంటోంది.

వైకల్యం ముందు ఆమె ఓడిపోలేదు. తన కలను సాకారం చేసుకునేందు ఒంటికాలుతోనే పోరాడుతోంది.

ఒంటికాలుతోనే చూడచక్కని చిత్రాలు గీయడం నేర్చుకుంది. ఎవరిమీదా ఆధారపడకుండా తన పనులు తానే చేసుకుంటూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.

"చిన్నప్పుడు కాలుతో రాయడం చాలా కష్టంగా ఉండేది. కానీ.. ఇప్పుడు ఇబ్బంది లేదు. స్కూలుకెళ్లడమంటే చాలా ఇష్టం. డ్రాయింగ్ వేయడం, అందులోనూ మనుషుల బొమ్మలు గీయడమంటే మరీ ఇష్టం" అని తమన్నా అంటోంది"

అయితే.. వారి గ్రామంలోని పాఠశాలలో వికలాంగ విద్యార్థులకు సరైన సౌకర్యాలు లేవు. దాంతో తమన్నాను బడికి పంపేందుకు ఆమె తల్లిదండ్రులు ఎంతో కష్టపడాల్సి వస్తోంది.

రోజూ చక్రాల బండిపై ఉదయం తీసుకెళ్లి, సాయంత్రం తీసుకొస్తారు.

చదువులో ఆమె ప్రతిభ ముందు వైకల్యమే ఓడిపోయింది. ప్రాథమికోన్నత విద్యలో తమన్నా అత్యుత్తమ గ్రేడ్‌తో ఉత్తీర్ణత సాధించింది. ప్రస్తుతం స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుకుంటోంది.

"నా బిడ్డను స్కూల్లో చేర్పించలేకపోయినప్పుడు చాలా బాధపడ్డాను. అయితే, ఏదో ఒక రోజున ఈ ప్రపంచానికి నా కూతురు గొప్పతనం చాటిచెప్పగలనన్న నమ్మకం ఉంది" అని ఆమె తండ్రి రోవ్సాన్ అలీ అంటున్నారు.

"నాకు మరో ఇద్దరు పిల్లలున్నారు. అయినా.. తమన్నాపైనే నేను ఎక్కువ ఆశలు పెట్టుకున్నా. కానీ.. నా కల నిజమవుతుందో లేదో... ఎందుకంటే, సెకండరీ స్కూల్ తర్వాత ఆమెను కాలేజీలో చేర్పించాలంటే అక్కడ సరైన సదుపాయాలు ఉండవు" ఆమె తల్లి ఖడిజా పర్విన్ శిల్పి ఆందోళన చెందుతున్నారు.

"డాక్టర్ కావాలన్నది నా కోరిక . కానీ.. ఈ వైకల్యం వల్ల అది నాకు సాధ్యమయ్యేలా లేదు. వైకల్యం ఉందన్న బాధేమీ లేదు. కానీ.. దాని కారణంగానే చదువు ఆపేయాల్సి వస్తుందేమో " అంటూ తమన్నా భయపడుతోంది.

ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు