అందంగా ఉన్న వాళ్లంటే కోళ్లకు ఎందుకు ఇష్టం?

  • సతీష్ ఊరుగొండ
  • బీబీసీ ప్రతినిధి
rooster

ఫొటో సోర్స్, Oli Scarff

ఒక్క విషయంలో కోడి-మనిషి సేమ్ టు సేమ్. అందంగా, ఆకర్షణీయంగా ఉన్నవారినే ఎక్కువ మంది ఇష్టపడతారు. కోళ్లు కూడా అంతే.

కోళ్లపై పరిశోధన చేసిన పలు దేశాలకు చెందిన పౌల్ట్రీ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని తేల్చారు. ఆ అధ్యయనంలో ఎన్నో ఆసక్తికర అంశాలు తెలుసుకున్నారు.

'ఒక కోడి 30 వరకు ఇతర కోళ్లను గుర్తుపడుతుంది. పుట్టిన 24 నుంచి 36 గంటల్లో తల్లికోడి ముఖాన్ని కోడిపిల్ల గుర్తిస్తుంది' అని జార్జియా యూనివర్శిటీ పౌల్ట్రీ సైంటిస్ట్ క్లాడియా డుంక్లే చెప్పారు.

ఫొటో సోర్స్, KAREN BLEIER/getty images

ఒకసారి ఫిక్సయితే ఎప్పటికీ మర్చిపోదు!

కోళ్లు 'రెడ్ ట్రయాంగిల్‌ ఫొటో'ను కూడా గుర్తుపట్టినట్లు ఒక అధ్యయనం చెబుతోంది.

ఒకసారి కోడి మెదడులో ఫొటో ఫిక్సయిన తర్వాత, పాక్షికంగా చెరిపేసి చూపించినా ఆ ఫొటోను అవి గుర్తుపట్టేస్తున్నాయి.

మెదడులో నిక్షిప్తమైన ఫొటోల ఆధారంగా ఎదురుగా ఉన్న వస్తువేంటో అవి పోల్చుకుంటున్నాయని నేషనల్ జియోగ్రఫిక్ వెబ్‌సైట్ కథనం ప్రచురించింది.

ఫొటో సోర్స్, Facebook/AGF

కోళ్లు మనుషుల్ని గుర్తుపడతాయి!

అంతేకాదు, మనుషుల్ని కూడా కోళ్లు గుర్తుపెట్టుకుంటాయట.

ముఖం ఆధారంగా మనల్ని అవి గుర్తుపడతాయని తేలింది.

ఇక్కడ మనిషికి-కోడికి దగ్గరి సంబంధం ఉంది.

మనుషుల మాదిరిగానే కోళ్లు కూడా అందంగా, ఆకర్షణీయంగా ఉన్న వారినే ఎక్కువగా ఇష్టపడతాయని తేలింది.

ఈ విషయంలో కోళ్లకు-మనుషులకు సారూప్యత ఉందని 2002లో చేసిన అధ్యయనంలో ఒక అంచనాకు వచ్చారు.

'అందమైన ముఖం ఉన్న వారిని మనుషులు ఎలా అయితే ఇష్టపడతారో, కోళ్లు కూడా అంతే' అని కాలిఫోర్నియా యూనివర్శిటీకి చెందిన పౌల్ట్రీ సైంటిస్ట్ రిచర్డ్ బ్లాచ్‌ఫొర్డ్ అన్నారు.

ఫొటో సోర్స్, THEPALMER/getty images

పరిశోధనలో ఏం తేల్చారు?

శాస్త్రవేత్తలు ముందుగా నాలుగు కోళ్లకు శిక్షణ ఇచ్చారు.

కోడిపెట్టలకు సాధారణ అమ్మాయిల ఫొటోలు చూపించారు.

కానీ వాటికి పురుషుల ఫొటోలు చూపించలేదు.

అలాగే, కోడిపుంజులకు సాధారణ మగవాళ్ల ఫొటోలు చూపించారు. కానీ అమ్మాయిల ఫొటోలు వాటికి చూపించలేదు.

ఆ తర్వాత శిక్షణ పొందిన ఈ కోళ్లకు అందమైన అమ్మాయిలు, పురుషుల ఫొటోలను స్క్రీన్ల మీద చూపించారు.

అప్పుడు అందంగా ఉన్న అమ్మాయిల ఫొటోలు ప్రదర్శించిన స్క్రీన్‌నే కోళ్లు తమ ముక్కుతో ఎక్కువగా పొడిచాయి.

ఇదే పరిశోధన 14మంది మనుషులపైనా చేశారు. వాళ్లు కూడా అందంగా ఉన్న వారిపైనే మనసు పారేసుకున్నారు.

ఆకర్షణ విషయంలో మనుషులు-కోళ్లు ఒకేలా ప్రవర్తిస్తాయని శాస్త్రవేత్తలు ఒక అంచనాకు వచ్చారు.

శాస్త్రవేత్తలు కొన్ని కోళ్లపైనే ఈ పరిశోధన చేశారు. కానీ ఈ పరిశోధన ఫలితాలు చూసిన తర్వాత కోళ్లు, మనుషుల్లోని ఈ ఆకర్షణకు సాంస్కృతిక వ్యత్యాసాల కంటే నాడీ వ్యవస్థే ప్రధాన కారణం అయి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, ASILCLUB

'కోడి మెదడు' అని ఎవర్ని తిట్టకండి!

చెప్పిన పని సరిగా చేయనప్పుడు, ఎంత వివరించినా అర్థం చేసుకోనప్పుడు ఎదుటివారిని 'మట్టి బుర్ర', 'కోడి మెదడు' అని తిట్టడం తరచూ చూస్తుంటాం.

కానీ మీరు అనుకుంటున్న దానికంటే కోళ్లు చాలా తెలివైనవి.

ఆహారం ఎంత దూరంలో ఉందో కచ్చితంగా గుర్తిస్తాయి.

ఆహారం ఉన్న ప్రదేశాన్ని మార్చినా.. అది ఎంతదూరంలో ఉందో కచ్చితంగా లెక్కలేస్తాయి.

అంతేకాదు, తిరిగే పరిసరాలను అవి గుర్తు పెట్టుకుంటాయి.

ఈ విషయంపై కోళ్లపై పరిశోధనలు ఇంకా కొనసాగుతున్నాయి.

ఫొటో సోర్స్, ASIL CLUB

పుంజుతో కలవకుండా పెట్ట గుడ్డు పెట్టగలదా?

గుడ్డు ముందా? కోడి ముందా? అనే చర్చ ఎప్పటి నుంచో నడుస్తోంది.

దానికంటే ముందు మరో ప్రశ్నకు మీకు సమాధానం తెలిసి ఉండాలి.

అసలు పుంజుకు- గుడ్డుకు ఉన్న సంబంధం ఏంటో మీకు తెలుసా?

పుంజుతో కలవకుండా కోడిపెట్ట గుడ్డు పెట్టగలదా?

కొందరు పెట్టదని, మరికొందరు పెడుతుందని చెప్పొచ్చు.

అసలు నిజం ఏమిటంటే.. పుంజుతో కలవకుండానే కోటిపెట్ట గుడ్డు పెట్టగలదు.

శాస్త్రవేత్తల పరిశోధనలో తేలిన విషయం ఇది.

ఫొటో సోర్స్, Noble Foods

మరి కోడిగుడ్డు ఎలా తయారవుతుంది?

కోళ్లు వెలుగు నుంచి శక్తిని గ్రహిస్తాయి. దాని ద్వారా గుడ్లను ఉత్పత్తి చేస్తాయి.

'గుడ్లు పెట్టాలంటే కోళ్లకు చాలా వెలుగు అవసరం అవుతుంది' అని జార్జియా యూనివర్శిటీ పౌల్ట్రీ సైంటిస్ట్ క్లాడియా డుంక్లే చెప్పారు.

కోడి 12గంటల పాటు వెలుగులో ఉంటే, దాని మెదడులో ఒక భాగం ఉత్తేజితమవుతుంది. అప్పుడు గొనడోట్రోపిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. అది గుడ్ల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుందని డుంక్లే వివరించారు.

మహిళల్లో ఉన్న పునరుత్పత్తి ప్రక్రియ మాదిరిగానే కోళ్లలోనూ అలాగే ఉంటుంది.

ఫొటో సోర్స్, FRED TANNEAU

కోళ్లకు ముత్తాత ఇక్కడి కోడిపుంజే!

ఆగ్నేయాసియాలో సుమారు 8000 ఏళ్ల క్రితం నుంచి కోడిపుంజులు ఉన్నాయి.

భారత దేశంలో మధ్యప్రదేశ్‌లోని కన్హా పులుల సంరక్షణ కేంద్రం పరిసరాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి.

తలపై తురాయితో ఠీవీగా ఉంటే కోడిపుంజే కోళ్ల జాతికి ముత్తాత. అంటే పూర్వీకుడు అన్నమాట.

వాతావరణ పరిస్థితులకు అనుగునంగా కోళ్ల జాతి కూడా మార్పు చెందుతూ వస్తోంది.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.