ట్రంప్ అను నేను..!

  • 15 జనవరి 2018
డొనాల్డ్ ట్రంప్ Image copyright AFP/Getty

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను జాత్యహంకారిని కానని పేర్కొన్నారు. ఆఫ్రికా దేశాల గురించి ‘షిట్‌హోల్’ అని ప్రస్తావిస్తూ ఆయన చేసినట్లు చెప్తున్న వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగటంతో తాను జాత్యహంకారిని కాదని తాజాగా ట్రంప్ వివరణ ఇచ్చారు.

అమెరికా వలస విధానం సంస్కరణల అంశంపై ఇటీవల అధ్యక్ష భవనంలో జరిగిన ఒక సమావేశంలో ట్రంప్ పై విధమైన తూలనాడే పదజాలం ఉపయోగించి వివక్షాపూరిత వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వచ్చాయి.

ఆయన ఆదివారం రాత్రి విలేకరులతో మాట్లాడుతూ.. ’’నేను జాత్యహంకారిని కాదు. మీరు ఇంటర్వ్యూ చేసిన వారిలోకెల్లా అతి తక్కువ జాత్యహంకారిని నేను’’ అని పేర్కొన్నారు.

జాత్యహంకార ఆరోపణలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించటం ఇదే మొదటిసారి.

Image copyright Getty Images

స్వీయ పొగడ్తల ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన గురించి తాను గొప్పగా చెప్పుకోవటం ఇదే మొదటిసారి కాదు. కొద్ది రోజుల ముందటే తనను తాను చాలా తెలివైన వాడినని (జీనియస్) ట్రంప్ ట్విటర్ వేదికగా కీర్తించుకున్నారు.

అధ్యక్ష ఎన్నికలకు ముందూ, ఎన్నికల సమయంలో ప్రచారంలోనూ, అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత కూడా ఆయన స్వీయ పొగడ్తలు కొనసాగుతూనే ఉన్నాయి. అటువంటి స్వీయ పొగడ్తలు, వివరణల్లో కొన్ని...

Image copyright Twitter

‘‘నిజానికి.. నా జీవితం మొత్తం మానసిక స్థిరత్వం, నిజంగా తెలివిగా వ్యవహరించటం నాకున్న రెండు గొప్ప ఆస్తులు. కుటిల హిల్లరీ క్లింటన్ కూడా ఇవే అంశాలను ప్రయోగించారు కానీ, అందరికీ తెలిసినట్లుగా ఆమె ఓడిపోయారు. నేను చాలా విజయవంతమైన వ్యాపారవేత్త నుంచి టాప్ టీవీ స్టార్‌గా, అమెరికా అధ్యక్షుడిగా (నా తొలి ప్రయత్నంలోనే) ఎదిగాను. దీనిని కేవలం తెలివైనవాడిని అని కాదు.. అద్భుత మేధావిని అనొచ్చని నేననుకుంటాను. ఆ విషయంలో చాలా స్థిరమైన మేధావిని!’’

- ‘ఫైర్ అండ్ ఫ్యూరీ: ఇన్‌సైడ్ ద ట్రంప్ వైట్ హౌస్’ పుస్తకంలోని అంశాలను తప్పుపడుతూ తాను చేసిన ట్వీట్ల మీద వచ్చిన విమర్శలపై ట్రంప్ ఇటీవల మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. అనంతరం 2018 జనవరి 6న ట్విటర్‌లో పై వ్యాఖ్యలు చేశారు.

‘‘మన దేశపు అధ్యక్షుల్లో అందరికన్నా అతి గొప్ప అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్’ అని ఆడమ్ లెవైన్, ద ఫెడరలిస్ట్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. థాంక్యూ.’’ - 2018 జనవరి 11, ట్విటర్

Image copyright Twitter

‘‘చిస్లర్ మెక్సికో నుంచి మిషిగన్‌కు భారీ ప్లాంటును తరలిస్తోంది. ఏడాది పొడవునా సాగిన వ్యతిరేక పోకడ మలిదిరిగింది. థాంక్యూ చిస్లర్. చాలా తెలివైన నిర్ణయం. మిషిగన్ ఓటర్లు ట్రంప్/పెన్స్‌కు ఓటు వేసినందుకు చాలా సంతోషంగా ఉన్నారు.’’ - 2018 జనవరి 11, ట్విటర్

’’నేను పదవి చేపట్టినప్పటి నుంచీ వాణిజ్య విమానయానం విషయంలో చాలా కఠినంగా ఉన్నాను. శుభవార్త - 2017లో సున్నా మరణాలు ఉన్నాయని ఇప్పుడే నివేదిక అందింది. అత్యంత సురక్షితమైన, ఉత్తమమైన సంవత్సరం ఇది.’’ - 2018 జనవరి 2, ట్విటర్

‘‘నేను నిజంగా వినమ్రుడినని నేనుకుంటాను. మీరు అర్థం చేసుకునే దానికన్నా చాలా ఎక్కువ వినమ్రుడినని నేను అనుకుంటాను.’’ -2016 జూలై 18, సీబీఎస్ ఇంటర్వ్యూ

‘‘మహిళలంటే నాకు ఎంతో గౌరవముంది. నిర్మాణ రంగంలో ఇతరులెవరికన్నా ఎక్కువగా మహిళల కోసం గ్లాస్ సీలింగ్ (గాజు తెర)ను నిజంగా బద్దలు కొట్టింది నేనే.’’ 2016 జూన్ 7, ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూ

‘‘నా జీవితమంతా విజయాలే. నా జీవితంలో ఓటమి లేదు.’’ - 2015 ఆగస్టు 18, టైమ్ ఇంటర్వ్యూ

Image copyright Twitter

‘ఓడినోళ్లు, ద్వేషించేవాళ్లు మన్నించండి.. కానీ నా ఐక్యూ చాలా అధికమైనది - అది మీ అందరికీ తెలుసు. మరీ అంత మూర్ఖంగానో అభద్రతగానో భావించొద్దు. అది మీ తప్పు కాదు.’’ - 2013 మే 8, ట్విటర్

‘‘నా ట్విటర్ ఎంత శక్తిమంతంగా మారిందంటే.. నా శత్రువులు నిజం చెప్పేలా నేను చేయగలను.’’ - 2012 అక్టోబర్ 17, ట్విటర్

‘‘నా అందంలో ఒక భాగం ఏమిటంటే.. నేను చాలా రిచ్.’’ - 2011 మార్చి 17, గుడ్ మార్నింగ్ అమెరికా

Image copyright Twitter

వలసలపై ట్రంప్ ఏం అన్నారని ఆరోపణ?

వివిధ దేశాలకు చెందిన పౌరులకు అమెరికా కల్పించిన తాత్కాలిక ఆశ్రయ హోదా (టెంపరరీ ప్రొటెక్టెడ్ స్టేటస్ - టీపీఎస్)ను ట్రంప్ సర్కారు ఉపసంహరించుకుంటున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో వలస విధానం సంస్కరణ ప్రతిపాదనలపై అధికార, ప్రతిపక్ష పార్టీల ప్రజా ప్రతినిధులు గురువారం ట్రంప్ వద్ద సమావేశమైన సందర్భంగా ఈ వివాదం చెలరేగింది.

ఆ సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ ’’షిట్‌హోల్ దేశాల నుంచి ఆ జనమంతా ఇక్కడికి రావటానికి మనమెందుకు ఒప్పుకుంటున్నాం?’’ అని ప్రశ్నించినట్లు వార్తలు వచ్చాయి.

ప్రకృతి విపత్తులు, యుద్ధం, భారీ జబ్బుల వల్ల దెబ్బతిన్న దేశాల నుంచి శరణార్థులకు తాత్కాలిక నివాసం కల్పించటానికి బదులుగా నార్వే వంటి దేశాల నుంచి వలసలను ఆహ్వానించాలని ట్రంప్ ఆ సమావేశంలో పేర్కొన్నట్లు చెప్తున్నారు.

ఈ ఆరోపణలు, విమర్శలపై ట్రంప్ శుక్రవారం ఉదయం ట్విటర్‌లో స్పందిస్తూ.. ఆ సమావేశంలో తను ఉపయోగించిన భాష కఠినమైనదే కానీ.. వార్తల్లో వినిపిస్తున్న పదాలతో మాట్లాడలేదని వివరణ ఇచ్చారు.

తాను హైతీ పౌరులను అవమానించినట్లుగా వచ్చిన విమర్శలను కూడా ఆయన తిరస్కరిస్తూ మరో ట్వీట్ చేశారు. అవన్నీ డెమొక్రాట్ పార్టీ వాళ్లు పుట్టించినవని ఆరోపించారు.

అయితే.. ట్రంప్ ఆ సమావేశంలో ’’విద్వేషపూరిత, జాతివివక్షాపూరిత’’ భాషను ఉపయోగించారని సెనేటర్ డిక్ డర్బిన్ పునరుద్ఘాటించారు.

కానీ ట్రంప్ అటువంటి వ్యాఖ్యలు చేసినట్లుగా తమకు గుర్తు లేదని.. అంతర్గత భద్రత శాఖ మంత్రి కిర్స్టెన్ నీల్సన్ సహా రిపబ్లికన్ పార్టీ సీనియర్ ప్రజాప్రతినిధులు పలువురు పేర్కొన్నారు.

మరోవైపు.. ట్రంప్ ఆ వ్యాఖ్యలు చేశారన్న మాటను ఆ సమావేశంలో పాల్గొన్న రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం కొట్టివేయలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

అఫ్గానిస్థాన్ యుద్ధంలో రోజూ 74 మంది చనిపోతున్నారు... బీబీసీ పరిశోధనలో వెలుగు చూసిన వాస్తవాలు

ఆత్మహత్యలకు కారణమవుతున్న పురుగుమందులను భారత్ నిషేధించిందా?

పాకిస్తాన్‌లో హిందూ విద్యార్థిని అనుమానాస్పద మృతి... పోలీసుల నివేదికను తప్పుపట్టిన బాధితురాలి కుటుంబం

ఇ-సిగరెట్లపై కేంద్రం నిషేధం: వీటివల్ల ఎలాంటి ప్రమాదాలున్నాయి?

పీరియడ్ బ్లడ్ చూపిస్తే తప్పేంటి... శానిటరీ ప్యాడ్స్ యాడ్‌పై ఫిర్యాదులను తిరస్కరించిన ఆస్ట్రేలియా

చంద్రయాన్ 2: ఇస్రో విక్రమ్ ల్యాండర్‌తో మళ్లీ కనెక్ట్ అయ్యేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తోంది...

సౌదీ అరేబియా చమురు కేంద్రాలపై డ్రోన్ దాడుల ప్రభావం భారత్ మీద పడుతుందా?

యూట్యూబ్: నకిలీ క్యాన్సర్ చికిత్స వీడియోలతో యూట్యూబ్ సొమ్ము చేసుకుంటోందా?