క్రీడల్లో భారత్‌ కంటే ఉత్తర కొరియానే ముందు!!

  • 19 జనవరి 2018
రి సీ గ్వాంగ్ - ఉత్తర కొరియా వాల్ట్ క్రీడాకారుడు Image copyright Getty Images

ఫిబ్రవరి నుంచి దక్షిణ కొరియాలో జరిగే వింటర్ ఒలింపిక్స్‌లో ఉత్తర కొరియా పాల్గొనే అంశం అంతర్జాతీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. వాళ్లు ఆ పోటీల్లో పాల్గొంటారో లేదోననే విషయంపై ఇంకా స్పష్టత లేదు.

ఒకవేళ ఒలింపిక్స్‌కు వెళ్లినా కేవలం ఇద్దరు స్కేటర్లకు మాత్రమే ఆ పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఆ విషయం పక్కన పెడితే, అసలు క్రీడల్లో ఉత్తర కొరియా ప్రదర్శన ఎలా ఉంటుందనే విషయం కూడా ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

ఆశ్చర్యకర విషయమేంటంటే.. చాలా క్రీడల్లో ఉత్తర కోరియా ఆటగాళ్లు అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటారు. కొన్ని క్రీడల్లో తరచూ ఆ దేశస్థులదే పై చేయి.

సమ్మర్ ఒలింపిక్స్‌నే పరిగణనలోకి తీసుకుంటే.. భారత్ లాంటి పెద్ద దేశాలకంటే ఉత్తర కొరియా ప్రదర్శనే మెరుగ్గా ఉంది. ఆ దేశం ఇప్పటిదాకా 54 ఒలింపిక్స్ పతకాలను కైవసం చేసుకుంది.

Image copyright AFP/Getty

వెయిట్ లిఫ్టింగ్‌లో ఉత్తర కొరియా మొదట్నుంచీ అదరగొడుతోంది. ఆ క్రీడలో మూడు ప్రపంచ రికార్డులు, రెండు ఒలింపిక్స్ రికార్డులు ఆ దేశం పేరిటే ఉన్నాయి.

2016లో రియో డి జనీరోలో జరిగిన ఒలింపిక్స్‌లో ఉత్తర కొరియా క్రీడాకారులు రెండు స్వర్ణాలతో కలిపి మొత్తం ఏడు మెడల్స్ గెలుచుకున్నారు.

ఫిఫా ర్యాంకుల ప్రకారం మహిళల ఫుట్‌బాల్‌లో ఆ దేశానిది 11వ స్థానం. 2019 ఒలింపిక్స్ క్వాలిఫయర్ల నుంచి ఆ దేశం అనూహ్యంగా వైదొలగినా, గత డిసెంబర్‌లో జరిగిన ఈస్ట్ ఏషియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఛాంపియన్‌షిప్‌ను ఆ దేశ మహిళలే గెలుచుకున్నారు.

2016 అండర్-20 మహిళల ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లోనూ వాళ్లే విజేతలు. పురుషులతో పోలిస్తే ఫుట్‌బాల్‌లో ఆ దేశ మహిళల ప్రదర్శన చాలా మెరుగ్గా ఉంది.

ఉత్తర కొరియా పురుషుల ఫుట్‌బాల్ జట్టు కేవలం రెండు సార్లే ప్రపంచ కప్‌లో పాల్గొంది. ఆ క్రీడలో వాళ్ల స్థానం 126.

Image copyright AFP/Getty

ఈ ఏడాది వింటర్ ఒలింపిక్స్‌కు ఉత్తర కొరియా తమ టైక్వాండో ప్రదర్శన (డెమాన్‌స్ట్రేషన్) బృందాన్ని పంపే అవకాశాలున్నాయి. ఆ క్రీడలో కూడా ఉత్తర కొరియాకు మంచి పేరుంది. కానీ దక్షిణ కొరియాలో జరిగే ఒలింపిక్స్‌లో టైక్వాండో‌లోని కొన్ని విభాగాల్లో పోటీలకు చోటు దక్కలేదు. దాంతో కేవలం ప్రదర్శనకు మాత్రమే ఉత్తర కొరియా టైక్వాండో బృందం పరిమితమయ్యే అవకాశం ఉంది.

ఇటీవల ప్యాంగ్యాంగ్‌లో జరిగిన టైక్వాండో పోటీల్లో ఉత్తర కొరియా 22 స్వర్ణాలను గెలుచుకుంది. రెండో స్థానంలో నిలిచిన రష్యా కేవలం ఏడు పసిడి పతకాలకు పరిమితమైంది.

క్రీడల కోసం ప్రభుత్వం ఏం చేస్తోంది?

టైక్వాండోతో పాటు మరికొన్ని క్రీడలకు ఉత్తర కొరియా ప్రభుత్వం చాలా ప్రాధాన్యమిస్తుంది. దేశంలో యువ ప్రతిభావంతులను అన్వేషించడానికి అక్కడో వ్యవస్థ పనిచేస్తోంది.

చాలా సమయంతో పాటు డబ్బునీ వెచ్చించి ఆ యువ క్రీడాకారులకు శిక్షణ ఇస్తారు. వాళ్లలో నుంచి కొందర్ని ఎంపిక చేసి ప్రత్యేక స్పోర్ట్స్ స్కూళ్లలో వాళ్లకు శిక్షణ ఇచ్చి ప్రొఫెషనల్ క్రీడాకారులుగా తయారు చేస్తారు.

దేశంలో పేదరికంతో సంబంధం లేకుండా అక్కడి క్రీడాకారులకు అత్యుత్తమ సదుపాయాల మధ్య శిక్షణ అందుతుంది అంటారు ఉడొ మెర్కెల్ అనే ఉత్తర కొరియా క్రీడా రంగ నిపుణుడు.

Image copyright AFP

చాలా కమ్యూనిస్ట్ దేశాల్లో మాదిరిగానే ఉత్తర కొరియాలోనూ ప్రభుత్వం క్రీడలకు మంచి ప్రాధాన్యమిస్తోంది. మిలటరీ, లేబర్ యూనియన్లు లాంటివి తరచూ క్రీడా పోటీలను నిర్వహిస్తాయి.

1980ల్లో ప్రజల్లో క్రీడల పట్ల ఆసక్తి పెంచేందుకు, బాక్సింగ్, టైక్వాండో లాంటి కొన్ని క్రీడలవైపు వాళ్లను మళ్లించేందుకు ప్రభుత్వం భారీ క్యాంపైన్‌లను నిర్వహించింది.

వాటి ఫలితం ఆ దేశ క్రీడాకారుల ప్రదర్శనలోనూ కనిపిస్తోంది. ఎన్నో పెద్ద దేశాలతో పోలిస్తే ఉత్తర కొరియా క్రీడాకారులు తమకంటూ కొంత ప్రత్యేకత గుర్తింపును సాధించుకున్నారు.

ఇవి కూడా చూడండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)