డైట్ కోక్, ఫ్రైడ్ చికెన్‌తో ట్రంప్ ఆరోగ్యానికి ఢోకా లేదన్న వైట్ హౌస్ డాక్టర్

  • 17 జనవరి 2018
ఆరోగ్య పరీక్షల వివరాలు వెల్లడిస్తున్నడాక్టర్ జాక్సన్‌ Image copyright Reuters
చిత్రం శీర్షిక ఆరోగ్య పరీక్షల వివరాలు వెల్లడిస్తున్నడాక్టర్ జాక్సన్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు నిర్వహించిన గ్రహణశక్తి పరీక్షలలో ఎలాంటి అసాధారణ లక్షణాలు కనిపించలేదని, ఆయన ఆరోగ్యం అద్భుతంగా ఉందని వైట్ హౌస్ డాక్టర్ తెలిపారు.

''ఆయన గ్రహణశక్తి, న్యూరోలాజికల్ కార్యకలాపాలు సాధారణంగానే ఉన్నాయి'' అని డాక్టర్ రోనీ జాక్సన్ తెలిపారు.

అమెరికా అధ్యక్షుడి బాధ్యతలు స్వీకరించాక మొదటిసారిగా 71 ఏళ్ల ట్రంప్‌కు గత వారం 3 గంటల పాటు వైద్యపరీక్షలు నిర్వహించారు.

ఇటీవల ఒక వివాదాస్పద పుస్తకం విడుదల అనంతరం ఆయన మానసిక ఆరోగ్యంపై పలు అనుమానాలు తలెత్తిన నేపథ్యంలో ఈ వైద్య పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి.

Image copyright Reuters
చిత్రం శీర్షిక గతవారం వైద్యపరీక్షల అనంతరం డాక్టర్ జాక్సన్‌తో ట్రంప్

ట్రంప్ జీన్స్ భేష్

మంగళవారం డాక్టర్ జాక్సన్ మీడియాతో, ''అధ్యక్షుని ఆరోగ్యం అద్భుతంగా ఉంది. ఆయన పదవీ కాలమంతా ఇలాగే ఉండొచ్చని వైద్యపరీక్షలు చెబుతున్నాయి'' అన్నారు.

ఇది జీవితాంతం అల్కాహాల్‌కు, స్మోకింగ్‌కు దూరంగా ఉండడం వల్ల కలిగిన లాభం అని తెలిపారు.

డైట్ కోక్, ఫ్రైడ్ చికెన్ తిని, శారీరక వ్యాయామం చేయని వ్యక్తి ఎలా ఆరోగ్యంగా ఉంటాడని ఒక రిపోర్టర్ ప్రశ్నించగా, ట్రంప్ జీన్స్ అద్భుతంగా ఉండడం వల్లే ఇది సాధ్యమైందని అన్నారు.

శుక్రవారం ట్రంప్‌కు మేరీల్యాండ్‌లోని బెతెస్డాలో ఉన్న వాల్టర్ రీడ్ మెడికల్ సెంటర్‌లో మిలటరీ వైద్యులు పరీక్షలు నిర్వహించారు.

ట్రంప్‌కు పరీక్షలు చేసిన వారిలో అధ్యక్షుడి ఫిజీషియన్‌ అయిన డాక్టర్ జాక్సన్ కూడా ఉన్నారు.

వైద్యపరీక్షల్లో గ్రహణశక్తి లోపాలను కనుగొనేందుకు ట్రంప్‌కు మాంట్రియల్ కాగ్నిటివ్ అసెస్‌మెంట్ (మోకా) న్యూరోసైకలాజికల్ టెస్ట్ నిర్వహించారు.

మోకా పరీక్షలో వ్యక్తుల శ్రద్ధ, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, భాష, వారి అంచనాలు, దృక్పథం మొదలైనవి పరీక్షిస్తారు.

Image copyright MOCA
చిత్రం శీర్షిక మాంట్రియల్ కాగ్నిటివ్ అసెస్‌మెంట్ (మోకా) న్యూరోసైకలాజికల్ టెస్ట్

'ఫైర్ అండ్ ఫ్యూరీ: ఇన్ సైడ్ ద ట్రంప్ వైట్ హౌస్' అన్న మైఖేల్ వుల్ఫ్ పుస్తకంతో అధ్యక్షుడి గ్రహణశక్తిపై సందేహాలు వ్యక్తమయ్యాయి.

ట్రంప్ తన బాధ్యతలను నిర్వర్తించే స్థితిలో లేడని వుల్ఫ్ ఆరోపించారు. వైట్ హౌస్‌లోని పనివాళ్లంతా - చిన్నపిల్లాడు ఏది కోరితే అది తీర్చినట్లు, ట్రంప్‌ కోరికలను తీరుస్తున్నారని అన్నారు.

దీనిపై ట్రంప్ మాట్లాడుతూ, ఆ పుస్తకం నిండా అబద్ధాలు ఉన్నాయని అన్నారు.

కొందరు న్యూరోలాజికల్ నిపుణులు ట్రంప్ గత సంభాషణను, ఇటీవలి సంభాషణలతో పోల్చి, ఆయన ఇటీవల తక్కువ పదాలను ఉపయోగిస్తున్నారని, అర్థం లేకుండా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.

డిసెంబర్, 2015లో ఎన్నికలకు ముందు ఆరోగ్య పరీక్షల అనంతరం ఆయన ఫ్యామిలీ డాక్టర్ హెరాల్డ్ బోర్న్‌స్టీన్, ''అధ్యక్షుడిగా ఎన్నిక కాబోయే అత్యంత ఆరోగ్యవంతమైన వ్యక్తి'' అని ట్రంప్‌ ఆరోగ్యంపై ప్రశంసలు కురిపించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)