జైనబ్ పాకిస్తాన్‌ 'నిర్భయ' అవుతుందా?

  • 19 జనవరి 2018
జైనబ్ Image copyright Getty Images

ఐదేళ్ల క్రితం జ్యోతి సింగ్‌ని దిల్లీలో కదిలే బస్సులో రేప్ చేసినప్పుడు ఎంత భయపడ్డానో, ఇప్పుడూ అంతే భయపడుతున్నాను.

భావోద్వేగాలకు సరిహద్దులుండవు. పాకిస్తాన్‌లో ఉన్న నన్ను కూడా ఆ ఘటన దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆ సమయంలో నేనెంత బాధపడ్డానో, అభద్రతకు లోనయ్యానో, కోపంతో రగిలిపోయానో నాకిప్పటికీ గుర్తే.

ఓ వారం క్రితం పాకిస్తాన్‌లోనూ అలాంటి ఘోరమైన ఘటనే జరిగింది. అభం శుభం తెలియని జైనబ్ అనే ఆరేళ్ల చిన్నారిని అమానుషంగా రేప్ చేసి చంపేశారు. ఆమె శరీరాన్ని గుర్తుపట్టలేని విధంగా ఛిద్రం చేసి చెత్తలో పారేశారు. మళ్లీ నాలో అదే భయం, అదే కలవరపాటు, అదే కోపం...

ఓ పక్క ఇప్పటికే పాకిస్తాన్ సంక్షోభంలో చిక్కుకొని ఉండగా, మరోపక్క ఇటీవల పెచ్చరిల్లుతున్న లైంగిక హింస కేసులతో ప్రజలు మరింత సతమతమవుతున్నారు.

ఇలా అమానుషంగా బలైన వాళ్లలో జైనబ్ మొదటి అమ్మాయేం కాదు. పాకిస్తాన్‌లో రోజూ సగటున పదకొండు మంది చిన్నారులు లైంగిక హింసకు గురవుతున్నారని సాహిల్ అనే బాలల హక్కుల సంస్థ లెక్కలు చెబుతున్నాయి. వాస్తవానికి ఈ సంఖ్య అంతకంటే ఎక్కువే ఉంటుందని చాలామంది నమ్మకం.

2016లో పాకిస్తాన్‌లోని పంజాబ్‌ పోలీసులు కోర్టుకు సమర్పించిన గణాంకాల ప్రకారం, ఒక్క ఆ ప్రావిన్సులోనే ఆ ఏడాది 10 ఏళ్ల లోపు బాలికలు రేప్‌కు గురైన కేసులు 107 నమోదయ్యాయి. గతేడాది ఆ సంఖ్య 128కి చేరింది. కానీ వీటిల్లో శిక్ష పడినవారి సంఖ్య ఎంతో తెలిస్తే సిగ్గుతో తల వంచుకోవాల్సిందే. ఒక్కరంటే ఒక్కరికి కూడా ఈ కేసుల్లో గతేడాది శిక్ష పడలేదు.

కొన్నిసార్లు సరైన సాక్ష్యం లేకపోవడంవల్లో, ఇతర న్యాయపరమైన కారణాలవల్లో దోషులు తప్పించుకుంటారని 'సాహిల్' ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్ మునిజె బానో అంటారు.

'దోషులను శిక్షించి బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అలా జరిగినప్పుడే ప్రజలకు తమ భద్రతపైన నమ్మకం కలుగుతుంది' అంటారు బానో.

భారత్‌లో బలైన రేప్‌ బాధితులలో నిర్భయ తొలి మహిళేమీ కాదు. కానీ ఆ రేప్ జరిగిన తీరు చాలామందిని తీవ్రంగా కలచివేసింది. దేశ వ్యాప్తంగా వేల మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి తమ ఆవేదన తెలియజేశారు. మొత్తంగా ఆ కేసు దేశంలో చాలా మందిని ఒకతాటిపైకి తెచ్చింది.

ప్రస్తుతం పాకిస్తాన్‌లోనూ అలాంటి పరిస్థితే తలెత్తింది. జైనబ్ హత్యపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. 2012లో భారతీయులు అనుభవించిన ఆవేదననే ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలూ అనుభవిస్తున్నారు.

ఆ ఆవేదనకు ప్రధాన కారణం.. ఏడాది కాలంలో కసూర్‌లో ఇలా రేప్‌కు గురైన చిన్నారుల్లో జైనబ్ 12వ పాప. వీళ్లలో తొమ్మిది మందిని ఒక వ్యక్తే రేప్ చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

కసూర్‌లో 2015లో బైటపడ్డ లైంగిక హింస స్కాండల్‌ను జైనబ్ హత్య మరోసారి జ్ఞాపకం చేస్తోంది. ఆ సమయంలో కసూర్ పరిధిలోని హుసేన్ ఖాన్ వాలా అనే గ్రామంలో పదుల సంఖ్యలో చిన్నారుల్ని లైంగికంగా వేధించి సెల్‌ఫోన్లలో ఆ దృశ్యాలను చిత్రీకరించిన ఉదంతం మొత్తం దేశాన్ని కుదిపేసింది.

అది జరిగిన ఏడాది తరవాత మైనర్లపైన జరిగే లైంగిక వేధింపులను శిక్షార్హమైన నేరాల జాబితాలో చేరుస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం చట్టం చేసింది. అంతకు ముందు రేప్‌కు మాత్రమే శిక్ష ఉండేది.

కానీ ఆ చట్టం చేసినా కసూర్‌లో లైంగిక హింసను ఎదుర్కొన్న వాళ్లకు న్యాయం జరగలేదు. ఆ కేసులో కేవలం ఇద్దరిని మాత్రమే దోషులుగా తేల్చారు. మిగిలిన వాళ్లలో కొందరు బెయిల్‌పై విడుదలవగా, ఇంకొందరు నిర్దోషులుగా బయటికొచ్చారు.

అందుకే జైనబ్ ఉదంతం పాకిస్తాన్‌లో అంతలా చర్చనీయాంశమైంది. ప్రభుత్వ వైఫల్యత వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని కొందరంటే, తల్లిదండ్రులు సమాజం విఫలమవడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని ఇంకొందరంటున్నారు.

మరోపక్క పోలీసులకు విధించే డెడ్‌లైన్లను కోర్టులు పొడిగిస్తూ వెళ్తున్నాయి. దాంతో దోషులకు తప్పించుకునే అవకాశం కూడా ఎక్కువవుతోంది.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionఆరేళ్ల చిన్నారి జైనబ్ హత్యతో అట్టుడికిన పాకిస్తాన్

పిల్లల్లో లైంగిక వేధింపులు అనే అంశంపైన అవగాహన పెంచాలనీ, పాఠ్యాంశాల్లో, తల్లిదండ్రుల పెంపకంలో మార్పు రావాలనీ కొందరు ఉద్యమిస్తున్నారు.

అలాంటి ఉద్యమకారుల్లో నటుడు అహ్సాన్ ఖాన్ ఒకరు. కానీ కొన్నేళ్ల క్రితం పిల్లల్లో లైంగిక హింస, వేధింపులపై అవగాహన పెంచే ఉద్దేశంతో తీసిన 'ఉడారి' అనే నాటికలో నటించినందుకు అతడిని చాలామంది విమర్శించారు.

అనైతిక విషయాలను అహ్సాన్ ఖాన్ చూపిస్తున్నారని ప్రేక్షకులు ఫిర్యాదు చేయడంతో టీవీ ఛానెళ్లకు ఆ కార్యక్రమాన్ని నిలిపివేయక తప్పలేదు.

'మనమెప్పుడూ అలాంటి సంఘటనలను దాచిపెట్టడానికే ప్రయత్నిస్తాం. బాధితులను చిన్న చూపు చూస్తాం. వాళ్లను ఏమాత్రం గౌరవించం' అని అహ్సాన్ ఖాన్ బీబీసీతో మాట్లాడుతూ చెప్పారు.

కానీ కొన్ని రోజులుగా ఆ పరిస్థితిలో మార్పు వస్తోంది. చాలామంది సెలెబ్రిటీలు కూడా సామాజిక మాధ్యమాల్లో జైనబ్ ఉదంతంపై స్పందిస్తున్నారు. జీవితంలో తాము ఎదుర్కొన్న హింస గురించి కూడా ప్రస్తావిస్తున్నారు.

భారత్‌లో నిర్భయ హత్య తరవాత పరిస్థితిలో చెప్పుకోదగ్గ మార్పులే వచ్చాయి. లైంగిక హింస గురించి యువత స్వేచ్ఛగా చర్చిస్తోంది. మగవాళ్ల దృక్పథంలో మార్పు తెచ్చేందుకు అనేక క్యాంపైన్‌లు ప్రారంభమయ్యాయి. చట్టాల్లో మార్పులొచ్చాయి. స్త్రీవాద ఉద్యమాలు ఊపందుకున్నాయి. పిల్లల పాఠ్యాంశాల్లోనూ మార్పులు చోటు చేసుకున్నాయి.

మరి పాకిస్తాన్‌కు కూడా ఇది నిర్భయ ఉదంతంతో సమానమేనా? జైనబ్ హత్య తరవాత చెలరేగిన ఆందోళన ఏదైనా అర్థవంతమైన మార్పుకు దారి తీస్తుందా? లేకపోతే మరో 'జైనబ్' రేప్‌కి గురై చనిపోయేదాకా ఈ చర్చ ఇక్కడితో ముగిసిపోతుందా?

ఈ దేశం 'షార్ట్ మెమరీ సిండ్రోమ్'తో బాధపడుతోందని చరిత్ర చెప్పకనే చెబుతోంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు