ట్రంప్లొమసీ: ప్రపంచాన్ని ట్రంప్ మరింత ప్రమాదంలోకి నెట్టేశారా?

  • బార్బరా ప్లెట్ ఉషర్
  • బీబీసీ ప్రతినిధి, వాషింగ్టన్
సియోల్‌లో టీవీ స్క్రీన్స్‌పై ట్రంప్, కిమ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

సియోల్‌లో టీవీ స్క్రీన్స్‌పై ట్రంప్, కిమ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ "అమెరికా ఫస్ట్" పేరిట గందరగోళ, భయపెట్టే భాషలో చేసిన విధాన ప్రకటనలు ఆయన మిత్రపక్షాలతో పాటు ప్రత్యర్థులను కూడా అప్రమత్తులను చేశాయి. ట్రంప్ విధానాలతో ప్రపంచం మరింత ప్రమాదకరంగా మారిందా?

నిజంగా జరిగింది ఏమిటో గమనిస్తే 'కాదు' అనే సమాధానం వస్తుంది.

ట్రంప్ ఎప్పటికప్పుడు తన ట్విటర్ పోస్టులతో కొంత భయోత్పాతాన్ని, గందరగోళాన్ని సృష్టించినప్పటికీ తన మిత్రపక్షాలతో మాత్రం సంబంధాలను పాడుచేసుకోలేదు.

కొత్త గొడవలను రేకెత్తించినా, చాలా వరకు మునుపటి అధ్యక్షుడు బరాక్ ఒబామా విధానాలనే పాటిస్తూ వచ్చారు.

ఆయన వల్ల పరిస్థితుల్లో కొంత కుదుపు వచ్చి ఉండొచ్చు కానీ విధ్వంసం జరగలేదు.

మరి, ఆయనేమైనా ప్రపంచాన్ని సంక్షోభం వైపు నెట్టేశారా?

ఇవీ నా అభిప్రాయాలు.

ఇస్లామిక్ స్టేట్ - మధ్యప్రాచ్యంలో విజయం

ట్రంప్ అధ్యక్షుడయ్యాక ఇస్లామిక్ స్టేట్ ఇరాక్, సిరియాలలో దారుణంగా దెబ్బ తింది. దాంతో మిగిలిన వారంతా అక్కడి నుంచి పారిపోతున్నారు.

నిజానికి, ఇస్లామిక్ స్టేట్ కార్యకలాపాలు మిగతాదేశాలలో క్రియాశీలకంగా ఉంటూ, ఉన్మాదాన్ని ప్రేరేపిస్తూనే ఉన్నాయి. కానీ, దాని ప్రధాన కేంద్రం మాత్రం బలహీనపడింది. దీనివల్ల ప్రపంచానికి ఉగ్రవాద ముప్పు తగ్గిందనే చెప్పొచ్చు.

అయితే - ఇదంతా ట్రంప్ ఘనతేమీ కాదు, ఒబామా ప్రారంభించిన పనిని ఈయన పూర్తి చేశారు అనేది కొందరి వాదన. ఇది నిజమే అయినా, ట్రంప్ అమెరికా దళాలకు ఎక్కువ అధికారాన్ని ఇస్తూ, ఆ కార్యకలాపాలను వేగవంతం చేశారు. ఏదైతేనేం, ఇదంతా ట్రంప్ ఘనతే అని చెప్పొచ్చు. విదేశీ విధానాల విషయంలో దీనిని పెద్ద విజయంగా భావించొచ్చు.

తీర్పు: విజయం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ట్రంప్ విధానాలతో ఇస్లామిక్ స్టేట్‌కు చావుదెబ్బ

ఇరాన్ - మధ్యప్రాచ్యంలో అస్థిరత

ఒక ఏడాది క్రితం, అమెరికా సహా మరో ఐదు శక్తిమంతమైన దేశాలు, ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నప్పటి నుండీ, ప్రపంచానికి ఇరాన్ నుండి అణు బాంబు ముప్పు తగ్గిందనే చెప్పొచ్చు. ఈ ఒప్పందం చాలావరకు పనిచేస్తున్నట్టే ఉంది.

కానీ, దీనిలో చాలా లొసుగులు ఉన్నాయని, వాటిని సరిచేయాల్సిన అవసరం ఉందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఈ ఒప్పందంలో కీలకపాత్ర వహించిన యూరప్ ఇంకాస్త కఠినంగా వ్యవహరించకపోతే ఈ ఒప్పందం నుండి అమెరికా తొలగిపోవాల్సి వస్తుందని ట్రంప్ ఎప్పటి నుండో హెచ్చరిస్తున్నారు.

అణ్వాయుధాల తయారీపై ఆంక్షలను శాశ్వతం చెయ్యాలని ట్రంప్ అంటున్నారు. అంతేకాకుండా, ఇరాన్ గతిశీల ఆయుధాల తయారీ కార్యక్రమాన్ని నిరోధించాలని అంటున్నారు. ప్రాంతీయ తీవ్రవాదానికి తోడ్పాటును అందించే, పశ్చిమ దేశాలకు ముప్పు కలిగించే విధానాల లాంటి వాటిని ఒప్పందంలో చేర్చి, ఇరాన్ విద్వేషపూరిత కార్యకలాపాలను అరికట్టాలని ఆయన కోరుతున్నారు.

పైన పేర్కొన్న ఒప్పందం అమలులోకి వస్తే పలు ప్రమాదాలున్నాయి. అవి - ఇరాన్ ప్రత్యర్థి అయిన సౌదీ అరేబియాకు ట్రంప్ ఇస్తున్న మద్దతును పరిగణనలోకి తీసుకుంటే మధ్య ప్రాచ్య దేశాల్లో తీవ్రమైన అస్థిరత; ట్రాన్స్-అట్లాంటిక్ ఐక్యత వీగిపోవడం.

రెండవ ప్రపంచయుద్ధం నుండి ప్రపంచ భద్రత ముఖ్యంగా ఈ ఐక్యతపైనే ఆధారపడి ఉన్నది అనేది గమనించాల్సిన విషయం.

తీర్పు: ప్రమాదం

మళ్ళీ అణు యుద్ధ మేఘాలు

అణ్వాయుధాలతో బెదిరిస్తూ, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్-ఉన్ ఈ ప్రపంచాన్ని ప్రమాదకరంగా మార్చేస్తున్నారు.

కానీ, దానిపై తీవ్రంగా స్పందిస్తూ, ట్రంప్ కూడా పరిస్థితిని మరింత దిగజార్చారు. చర్చలకు ఆహ్వానించడంలో ట్రంప్ మాట తీరు అవమానకరంగానూ, హెచ్చరికలు జారీ చేసినట్టుగానూ ఉంటుందన్నది నిజమే.

1962లో క్యూబా క్షిపణి సంక్షోభం నాటి నుంచి అమెరికా ఒక అణ్వాయుధ దేశాన్ని హెచ్చరించడం ఇదే మొదటిసారి. ఇది చాలా ప్రమాదం.

కానీ, ఇప్పుడు ఆయన ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య నడుస్తున్న సామరస్య చర్చల బాటలోనే చర్చలకు తన సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు.

తీర్పు: ప్రమాదం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ట్రంప్, పుతిన్

మళ్లీ ప్రచ్ఛన్న యుద్ధ పరిస్థితులు

ప్రచ్ఛన్న యుద్ధం నాటి పరిస్థితులు మళ్లీ ఏర్పడుతున్నాయని బిల్ క్లింటన్ సమయంలో విదేశాంగ మంత్రిగా ఉన్న విలియం పెర్రీ ఇటీవల ఒక సదస్సులో అన్నారు.

అమెరికా, రష్యాలు తిరిగి అణ్వాయుధాలను పెంచుకుంటుండడంతో ప్రమాదం ఏర్పడుతోందన్నారు.

అయితే ఇది ట్రంప్ తప్పు కాదు.

రష్యా ఉక్రెయిన్‌లో జోక్యం చేసుకోవడంతో, ఒబామా కాలం నాటి నుంచే రెండు దేశాల మధ్య సంబంధాలు సన్నగిల్లాయి.

దీనిపై ట్రంప్ పుతిన్‌తో మాట్లాడాలనుకున్నా ఆ పని చేయలేరు. ఎందుకంటే ఆయన తన ఎన్నికల ప్రచారంలో మాస్కో ప్రమేయం ఉందన్న ఆరోపణలతో మాస్కో-వాషింగ్టన్ సంబంధాలు దెబ్బ తిన్నాయి.

తీర్పు: అలర్ట్

దౌత్య వ్యవహారాలపై ట్రంప్ అయిష్టత

ట్రంప్‌కు దౌత్యవేత్తలకన్నా సైనికాధికారులంటేనే ఎక్కువ ఇష్టం.

9/11 తర్వాత అమెరికా విదేశీ విధానంలో మిలటరీ ప్రాధాన్యత పెరిగింది. కానీ ట్రంప్ వచ్చాక అది మరింత వేగవంతమైంది.

దౌత్య వ్యవహారాలు ఆయనకు పెద్దగా అర్థం కావు లేదా వాటికి ఆయన ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వరు.

దౌత్య వ్యవహారాలు ముందస్తు నిరోధకాలలాంటివి. సమస్యలు యుద్ధాలుగా మారకుండా అవి నిరోధిస్తాయి. అందువల్ల వాటిని నిర్లక్ష్యం చేస్తే, మరిన్ని యుద్ధాలు వచ్చే అవకాశం ఉంది.

అందువల్ల మార్షల్ ప్లాన్, ఈజిప్ట్-ఇజ్రాయెల్ శాంతి ఒప్పందం, వియత్నాం, ఇరాక్ యుద్ధాలను ట్రంప్ గుర్తు చేసుకోవాలి.

తీర్పు: అలర్ట్

అమెరికా వెనుకంజ?

అంతర్జాతీయ సమస్యలను పరిష్కరించే కొన్ని ఒప్పందాల నుంచి అమెరికా మెల్లగా వెనక్కి తప్పుకుంటోంది. పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడం ఇలాంటిదే. అమెరికా క్లీన్-పవర్ దిశగా తనవైన ప్రయత్నాలు చేస్తున్నా, అవి సరిపోవు.

'అమెరికా ఫస్ట్' అన్న విధానంతో, రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన నాటి నుంచి ప్రపంచాన్ని శాంతియుతంగా ఉంచడంలో ముఖ్య పాత్ర పోషించిన మిత్రపక్షాలు, సంస్థలను అమెరికా క్రమంగా దూరం చేసుకుంటోంది.

దీని వల్ల ప్రపంచం మరింత ప్రమాదం వైపుకు వెళుతోందని వాష్టింగ్టన్ పోస్ట్ ప్రతినిధి డేవిడ్ ఇగ్నేషియస్ తెలిపారు.

తీర్పు: అలర్ట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

అంతర్జాతీయ ఒప్పందాలకు గుడ్ బై

ఎప్పుడు ఎలా ఉంటారో, ఎలా వ్యవహరిస్తారో..

ట్రంప్ 'అమెరికా ఫస్ట్' అన్న విధానం కన్నా తన వివాదాస్పద వ్యక్తిత్వానికే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారని చెప్పవచ్చు.

తన వివాదాస్పద ట్వీట్లతో, తన సీనియర్ అధికారుల వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కామెంట్ చేస్తూ, ఆయన అమెరికా విదేశాంగ విధానాన్ని మార్చేశారు.

దీని వల్ల అమెరికా శత్రువులు, మిత్రులు ఇద్దరిలో కూడా ఆ దేశ విదేశాంగ విధానం ఖచ్చితంగా ఏమిటనే దానిపై గందరోగళం ఏర్పడి, అమెరికా నాయకత్వంపై నమ్మకం సడలుతోంది.

తీర్పు: అలర్ట్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)