'ఫేక్ న్యూస్' గుర్తించడం ఎలా?

  • 20 జనవరి 2018
ఫేక్ న్యూస్

ఒక వార్త సోషల్ మీడియాను కుదిపేస్తుంది. కొన్నిసార్లు విపరీత పరిణామాలకు కారణం అవుతుంది. కానీ చివరికది ఫేక్‌ న్యూస్ అని తేలుతుంది. మరి, ఫేక్ న్యూస్‌ను గుర్తించడం ఎలా?

స్వచ్ఛ్ డిజిటల్ ఇండియాలో భాగంగా బీబీసీ హిందీ-ది క్వింట్ సంయుక్తంగా ఫేక్ న్యూస్‌పై అవగాహన కలిగించేందుకు ప్రయత్నిస్తున్నాయి.

ఫేక్ న్యూస్ వార్తలను ప్రచారం చేయడం వెనక చాలా కారణాలున్నాయి. ఆ వార్తల వల్ల చాలా నష్టాలూ జరుగుతున్నాయి.

అలాగని కంగారు పడాల్సిన పనిలేదు. ఏ వార్త నిజమో, ఏది నకిలీనో కనుక్కోవడానికి అనేక మార్గాలున్నాయి.

అసలు ఫేక్ న్యూస్ ప్రచారం ఎందుకు?

తమ ఇమేజ్‌ని పెంచుకోవడానికో, ఎదుటి వాళ్ల పేరు ప్రతిష్టలను దెబ్బ తీయడానికో, లేదా విద్వేషాన్ని రెచ్చగొట్టడానికో ఎక్కువసార్లు తప్పుడు వార్తలను ప్రచారం చేస్తారు.

కొన్నిసార్లు అవి ఫేక్ న్యూస్ అని తెలిసినా తమ భావజాలానికి అనువుగా ఉందన్న కారణంతో కావాలని కొందరు ఆ వార్తలను ప్రచారం చేస్తారు. అలాంటి వాటిని నమ్మిన వ్యక్తులు.. తాము మోసపోవడంతో పాటు ఎదుటివాళ్లు పన్నే వలలోనూ చిక్కుకుంటారు.

ఇలాంటి వార్తల వల్ల ఇంటర్నెట్ వాతావరణం పాడవడంతో పాటు ఆన్‌లైన్ ద్వారా అందే ఉపయోగకర సమాచారాన్ని కూడా అనుమానించాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఒక్కోసారి ఈ ఫేక్ న్యూస్ హత్యలకూ దారి తీస్తోంది.

ఫేక్ న్యూస్‌ని గుర్తించడం ఎలా?

వాట్సాప్‌లో...

వాట్సాప్ ద్వారా ఫేక్ న్యూస్ క్షణాల్లో వైరల్‌గా మారే ప్రమాదం ఉంది. అందుకే ఏదైనా వార్తని ఫార్వార్డ్ చేసే ముందు అది నిజమో కాదో తేల్చుకోవాల్సిన బాధ్యత అందరిది.

వచ్చిన సమాచారాన్ని గూగుల్‌లో వెతకడం ద్వారా అది సరైనదో కాదో తెలుసుకోవడం చాలా సులువు. ఏదైనా సమాచారాన్ని ఫార్వర్డ్ చేసేముందు చేయాల్సిన మొదటి పని అదే.

నిజాలు తెలుసుకోవడం కష్టమేం కాదు

ఏదైనా సమాచారం నిజమైనదే అయితే అది దేశంలో పేరున్న 10-15 వెబ్‌సైట్లలో కచ్చితంగా వచ్చే ఉంటుంది. దాని ఆధారంగా ఆ సమాచారంపైన ఓ అంచనాకి రావచ్చు.

ఒకవేళ ఏ వెబ్‌సైట్‌లోనూ అది కనిపించకపోతే, దాన్ని ప్రచారం చేసేముందు ఓసారి ఆలోచించాల్సిందే.

ఏదైనా వార్తను ప్రచారం చేస్తున్న వాళ్ల పేరుని గూగుల్‌లో వెతికితే, వాళ్లు గతంలో అలాంటి వార్తలను ప్రచారం చేశారో లేదో కూడా తెలిసిపోతుంది.

Image copyright Getty Images

సోర్స్ చాలా ముఖ్యం

ఆన్‌లైన్‌లో ఏదైనా చదివే ముందు దాన్ని ఎవరు ప్రచురించారో చూడాలి. వాళ్లకున్న గుర్తింపు ఆధారంగా ఆ వార్త నిజానిజాలపైన ఓ అంచనాకి రావచ్చు. మీరు ఆ వార్తను ప్రచురించిన వెబ్‌సైట్ పేరే గతంలో వినకపోయుంటే, ఆ సమాచారాన్ని అనుమానించాల్సిందే.

ఏదైనా పేరున్న సంస్థ ఓ వార్తను ప్రచురిస్తే, అది కచ్చితంగా సోర్స్‌ని కూడా తెలియజేస్తుంది.

ఇంటర్నెట్ అడ్రెస్ బార్‌లో వెబ్‌సైట్ యూఆర్ఎల్‌‌ని గమనించడం కూడా చాలా ముఖ్యం. అడ్రెస్ బార్‌లో ‘.కామ్’ బదులు ‘.ఇన్’ అనో ‘.కో’ అనో కనిపిస్తే అది నకిలీ వెబ్‌సైట్ అన్నట్లే లెక్క.

ఉదాహరణకు... www.bbc.in/telugu - ఇది నకిలీ. https://www.bbc.com/telugu - ఇది సరైనది.

తేదీని సరిచూసుకోండి

ఇంటర్నెట్‌లో ఏ సమాచారం వచ్చినా దాని తేదీ తప్పకుండా ఉంటుంది. ఆ తేదీని సరిచూసుకోవడం ద్వారా అది తాజా వార్తో, నకిలీ వార్తో వెంటనే కనిపెట్టొచ్చు.

ఆధారపడ్డదగ్గ వెబ్‌సైట్లయితే కచ్చితంగా తేదీని ప్రచురిస్తాయి. ఒక్కోసారి సందర్భం లేకుండానే విద్వేషాలను రెచ్చగొట్టేందుకు పాత వార్తలనో కామెంట్లనో కావాలని వెలికితీస్తుంటారు.

అందుకే ఇతరులతో వార్తను షేర్ చేసే ముందు తేదీని ఓసారి గమనించండి.

Image copyright Getty Images

అది జోకా?

ఫేకింగ్ న్యూస్, ఆనియన్ లాంటి కొన్ని వెబ్‌సైట్లు ఉద్దేశ పూర్వకంగానే నకిలీ వార్తలను ప్రచురిస్తాయి. మీకొచ్చిన వార్తలు వాటిలో నుంచైతే దాన్ని పంచుకునే ముందు ఓసారి ఆలోచించండి.

‘అబౌట్’ సమాచారం చూడండి

దాదాపు ప్రతి వెబ్‌సైట్‌కూ ‘ఎబౌట్’ పేజీ ఉంటుంది. అందులో ఆ వెబ్‌సైట్‌కి సంబంధించిన సమాచారం ఉంటుంది. దాన్ని ఎవరు నడిపిస్తున్నారో ఆ వెబ్‌సైట్ చెబుతుంది. ఆ సమాచారం చూస్తే వార్తల్ని ఏమాత్రం నమ్మొచ్చో అర్థమవుతుంది.

మీరెలా స్పందిస్తున్నారు?

ఏదైనా వార్త చదివాకా మీకు కోపం, బాధ, గర్వం, పట్టరాని సంతోషం లాంటి భావోద్వేగాలు కలిగితే, ఆ సమాచారాన్ని పంచుకునే ముందు ఒక్కసారి గూగుల్‌లో దాన్ని వెతికి అది నిజమో కాదో తేల్చుకోండి. ఫేక్ న్యూస్‌కే ఎక్కువగా ఇలా భావోద్వేగాలను రెచ్చగొట్టే అవకాశం ఉంటుంది.

హెడ్‌లైన్‌ని మాత్రమే చూడొద్దు

వార్తలో చాలా తప్పులుండీ, ఫొటోల్లో నాణ్యత లోపిస్తే ఆ సమాచారాన్నీ అనుమానించాల్సిందే. గూగుల్ యాడ్స్ సాయంతో డబ్బు సంపాదించే ఉద్దేశంతో, నాణ్యతను పట్టించుకోకుండా ఫేక్ న్యూస్ వెబ్‌సైట్లు నకిలీ వార్తలను ప్రచురిస్తాయి.

ఒకవేళ మీరే కావాలనే నకిలీ వార్తలను ప్రచారం చేస్తే అవి తీవ్రమైన పరిణామాలకూ దారితీసే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త.

(స్వచ్ఛ్ డిజిటల్ ఇండియా ఇనీషియేటివ్‌లో భాగంగా బీబీసీ హిందీ, ది క్వింట్ సంయుక్తంగా చేసిన కథనం ఇది)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు

ట్రంప్ పదవి ఊడుతుందా.. అసలు అభిశంసన అంటే ఏంటి

‘అయోధ్య తీర్పులో స్పష్టంగా చెప్పారు, రామ జన్మస్థలం మసీదు కిందే ఉంది’ - సి.ఎస్.వైద్యనాథన్

World Kindness Day: ఇతరుల పట్ల ప్రేమ, దయ చూపితే ఎక్కువ కాలం జీవిస్తారు ఎందుకు

అయోధ్య తీర్పు: ‘తప్పు చేసిన దోషికే బహుమతి ఇచ్చారు’ - జస్టిస్ లిబర్హాన్ కమిషన్ న్యాయవాది అనుపమ్ గుప్తా

ట్రంప్‌పై పోటీచేయాలనే ఒత్తిడి వస్తోంది: హిల్లరీ క్లింటన్

ఆర్టీఐ పరిధిలోకి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం

సాంబార్ సరస్సు తీరంలో వెయ్యికి పైగా పక్షుల మృతికి కారణాలేమిటి

తాలిబన్ల వద్ద బందీలైన ప్రొఫెసర్ల విడుదలకు మిలిటెంట్లను విడిచిపెట్టనున్న అఫ్గానిస్తాన్