‘సంప్రదాయ వైద్యంతో గర్భం’.. మోసపోయిన వందలాది మంది మహిళలు

  • 20 జనవరి 2018
False pregnancy Image copyright Alhassan Sillah
చిత్రం శీర్షిక సంప్రదాయ వైద్యురాలి ఆకులు, మూలికల మిశ్రమంతో మహిళలు గర్భవతుల్లా కనిపించేలా పొట్ట పెరిగింది

గర్భం వచ్చేందుకు సహకరిస్తానని నమ్మించి, వందలాది మంది మహిళల్ని మోసం చేసిన సంప్రదాయ వైద్యురాలిని గినియా పోలీసులు అరెస్ట్ చేశారు.

‘న ఫన్ట కమర’ అనే సంప్రదాయ వైద్యురాలు.. మహిళలకు కొన్ని ఆకులు, మూలికలు, ఇతర మందుల్ని కలిపిన మిశ్రమాన్ని ఇచ్చింది.

గర్భం వచ్చేందుకు ఈ మిశ్రమం సహకరిస్తుందని కమర చెప్పడంతో.. ఆమె మాటలు నమ్మి వందలాది మంది మహిళలు దీనిని తీసుకున్నారు.

తన సేవలకు గాను కమర ఒక్కో మహిళ నుంచి 33 డాలర్లు (దాదాపు రూ.2100) వసూలు చేసింది. గినియా దేశంలో సగటు నెలసరి వేతనం 48 డాలర్లు (దాదాపు రూ. 3000) .

ఇలా అమాయకులైన మహిళల్ని నమ్మించి కమర నెలకు లక్షలాది రూపాయలు సంపాదించిందని పోలీసులు భావిస్తున్నారు. ఆమె మాత్రం మహిళలకు సహాయపడుతున్నానని చెబుతోంది.

గినియా రాజధాని నగరం కనర్కీ పోలీసులు మంగళవారం కమరను అదుపులోకి తీసుకున్నారు. పోలీసు స్టేషన్ ఎదుట దాదాపు 200 మంది మహిళలు నిరసన ప్రదర్శన జరిపారు.

కమర గర్భధారణ వైద్యంతో 17 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మహిళలు 700 మందిదాకా బాధితులయ్యారు.

గినియా సహా చాలా ఆఫ్రికా దేశాల్లో ఎంతో మంది ప్రజలు సంప్రదాయ వైద్యులపై ఆధారపడుతున్నారు.

80 శాతం మంది ఆఫ్రికన్లు సంప్రదాయ వైద్య సేవలను వినియోగిస్తున్నారని 2006లో ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

Image copyright Alhassan Sillah
చిత్రం శీర్షిక ‘ఈ వైద్యం వల్ల దీర్ఘకాలిక ఇబ్బందులు కొనితెచ్చుకున్నారు’

‘కృతజ్ఞతగా కోళ్లు, బట్టలు’

‘‘ఈ మహిళ (కమర)ను కలిసేందుకు మేం వెళ్లి ఇప్పటికి ఏడాది’’ అని నిరసన ప్రదర్శనలో పాల్గొన్న ఒక మహిళ బీబీసీ కనర్కీ ప్రతినిధి అల్‌హసన్ సిల్లహ్‌తో చెప్పారు.

‘‘మొదటిసారి మేం వెళ్లినప్పుడు ఆమె కొన్ని ఆకులు, మూలికల మందు ఇచ్చింది. దాంతో మాకు వాంతులయ్యాయి. ఇది మాకు చాలా మంచిదని ఆమె నమ్మబలికింది. అయితే, ఈ మందు వాడుతుంటే పొట్ట కొంచెం పెద్దది అవుతోంది.’’

‘‘కొంతకాలం తర్వాత మేం తిరిగి వెళ్లాం. ఆమె మా పొట్టను పట్టుకుని.. మేం గర్భవతులమయ్యామని ప్రకటించింది’’ అని ఆమె తెలిపారు.

ఒక్కసారి తాను పరీక్షించి, గర్భం వచ్చిందని చెప్పాక మళ్లీ డాక్టర్ దగ్గరకు వెళ్లొద్దని, తనకు కృతజ్ఞతగా కోడిని, బట్టల్ని ఇవ్వాలని కమర చెప్పినట్లు ఆమె వెల్లడించారు.

కొందరు మహిళలు 12 నుంచి 16 నెలల పాటు గర్భవతుల్లాగా కనిపించారు.

బాధితుల్లో 47 మందిని పోలీసు వైద్యులు పరీక్షించి.. ఈ వైద్యం వల్ల దీర్ఘకాలిక ఇబ్బందులు కొనితెచ్చుకున్నారని చెప్పారు.

కాగా, తాను ఏ తప్పూ చేయలేదని కమర చెబుతున్నారు.

‘వాళ్లు (మహిళలు) తమ కలను సాకారం చేసుకునేందుకు నేనెంతో కష్టపడి సాయం చేశాను. మిగతాదంతా దేవుడి దయ’’ అని ఆమె కనర్కీలో రిపోర్టర్లతో చెప్పారు.

మోసపూరిత పద్ధతులతో ప్రజల జీవితాలను ప్రమాదంలో పడేసినందుకు గాను కమరపై కేసు నమోదయ్యింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)