'కిచెన్‌ దొడ్డిదారి నుంచి చొరబడి కాబూల్‌ లగ్జరీ హోటల్‌లో కాల్పులు'!

  • 21 జనవరి 2018
కాబూల్ హోటల్ పై దాడి Image copyright Reuters
చిత్రం శీర్షిక హోటల్‌పై సాయుధులు దాడి చేయడంతో అందులో ఉన్నవారు ప్రాణాలు రక్షించుకునేందుకు ఇలా సాహసం చేశారు

ఇంటర్‌కాంటినెంటల్‌ హోటల్‌ కాబుల్‌లో ఒక ఐకానిక్ భవనం. అఫ్గాన్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న అత్యంత లగ్జరీ హోటల్ ఇది.

శనివారం సాయంత్రం సాయుధులు ఈ హోటల్‌లో చొరబడ్డారు. అతిథులు, హోటల్ సిబ్బందిపై కాల్పులు జరుపుతూ, గ్రెనేడ్లు విసురుతూ విధ్వంసం సృష్టించారు.

సాయుధుల కాల్పుల్లో ఒక విదేశీయుడు సహా ఐదుగురు పౌరులు చనిపోయారు. మరో ఆరుగురు గాయపడ్డారని ఆ దేశ హోంశాఖ వెల్లడించింది.

తర్వాత ఇంటర్‌కాంటినెంటల్‌ హోటల్‌ను సాయుధులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

రంగంలోకి దిగిన అఫ్గాన్ ప్రత్యేక బలగాలు సాయుధులతో గంటల తరబడి హోరాహోరీగా తలపడ్డాయి.

హోటల్‌లో చిక్కుకున్న 150మంది అతిథులను సురక్షితంగా భద్రతా బలగాలు కాపాడాయి.

ముగ్గురు సాయుధులను హతమార్చినట్లు అఫ్గాన్ హోంశాఖ వెల్లడించింది.

సాయుధుల నుంచి హోటల్‌ను తిరిగి స్వాధీనం చేసుకున్నామని ప్రకటించింది.

Image copyright Reuters
చిత్రం శీర్షిక సాయుధులు చొరబడిన 8 గంటల తర్వాత కూడా కాల్పుల శబ్ధాలు వినిపించాయి

2011 నుంచి తాలిబన్ల హిట్‌లిస్ట్‌లో హోటల్‌!

ఈ దాడికి ఇప్పటి వరకు ఎవరూ బాధ్యత ప్రకటించుకోలేదు.

2011 నుంచి ఈ హోటల్‌ తాలిబన్ల హిట్‌లిస్టులో ఉంది.

హోటళ్లపై దాడులు జరిగే అవకాశం ఉందని కాబూల్‌లోని అమెరికా దౌత్యకార్యాలయం హెచ్చరించిన కొన్ని రోజుల్లోనే ఈ దాడి జరిగింది.

'హోటళ్లపై దాడులు చేసేందుకు అతివాదులు ప్రయత్నిస్తున్నారన్న సమాచారం మాకు ఉంది. ఎయిర్‌పోర్టుకు సమీపంగా ఉన్న హోటళ్లను వారు టార్గెట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది' అని అమెరికన్ ఎంబసీ అధికారులు తెలిపారు.

Image copyright AFP

సాయుధుల దాడి ఘటనపై విచారణకు ఆదేశం

ఇంటర్‌కాంటినెంటల్‌‌ హోటల్‌పై దాడి ఘటనపై అఫ్గాన్ ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది.

'సాయుధులు హోటల్‌లోకి ఎలా చొరబడ్డారు' అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

హోటల్‌ భద్రతను 2 వారాల క్రితమే ఒక ప్రైవేటు సంస్థకు అప్పగించారు.

'సాయుధులు కిచెన్‌ వెనక డోర్‌ నుంచి హోటల్‌లో చొరబడి ఉంటారు' అని పోలీసులు అంచనా వేస్తున్నారు.

ఇంటర్‌కాంటినెంటల్‌‌లో వివాహాలు, కాన్ఫరెన్సులు, రాజకీయ సభలు ఎక్కువగా జరుగుతుంటాయి.

సాయుధులు దాడి చేసిన సమయంలో ఇక్కడ ఐటీ కాన్ఫరెన్స్ జరుగుతోందని కొన్ని వార్తా సంస్థలు తెలిపాయి.

గత మే నెలలో ట్రక్‌ బాంబు దాడిలో 150 మంది చనిపోయిన ఘటన జరిగినప్పటి నుంచి కాబూల్‌లో భద్రత కట్టుదిట్టం చేశారు.

అయితే, ఇటీవల కాలంలో అఫ్గాన్‌లో దాడులు తరుచూ జరుగుతూనే ఉన్నాయి.

గత నెలలో షియా సాంస్కృతిక కేంద్రంపై జరిగిన బాంబు దాడిలో 40 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.