అమెరికాలో ప్రభుత్వ స్తంభన: ‘ట్రంప్‌పై మితవాద శక్తుల ఒత్తిడి’

  • 21 జనవరి 2018
డొనాల్డ్ ట్రంప్ Image copyright Getty Images

అమెరికాలో కీలకమైన ఒక బిల్లు ఎగువసభ సెనేట్‌లో ఆమోదం పొందకపోవడంతో ఏర్పడ్డ ప్రతిష్టంభన కొనసాగుతోంది.

ఫిబ్రవరి 16 వరకు వివిధ స్వల్పకాలిక అవసరాలకు నిధులు వెచ్చించేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి వీలు కల్పించే ఈ బిల్లు.. డెమోక్రాట్లు, రిపబ్లికన్లు ఒక అంగీకారానికి రాకపోవడం వల్ల శుక్రవారం సెనేట్‌లో ఆమోదం పొందలేదు.

ప్రభుత్వ నిధుల వ్యయం, కార్యకలాపాలు, సేవలు స్తంభించిపోవడానికి బాధ్యులు డెమోక్రాట్లేనని రిపబ్లికన్లు విమర్శించారు. రిపబ్లికన్లే కారణమని డెమోక్రాట్లు ప్రతి విమర్శలు చేశారు.

Image copyright Zach Gibson/Getty Images
చిత్రం శీర్షిక రాజధాని వాషింగ్టన్ డీసీలోని 'క్యాపిటల్' భవనం

కొనసాగిన చర్చలు

అమెరికన్ల ప్రయోజనాల కంటే సొంత రాజకీయ ప్రయోజనాలకే డెమోక్రాట్లు ప్రాధాన్యమిస్తున్నారని అధ్యక్షుడు ట్రంప్ విమర్శించారు.

బిల్లుపై రాజీ ప్రతిపాదనలను ట్రంప్ తిరస్కరించారంటూ డెమోక్రాట్లు ప్రతివిమర్శలు చేశారు.

బిల్లుపై ఏర్పడ్డ ప్రతిష్టంభన తొలగించేందుకు కాంగ్రెస్‌లోని ఉభయ సభలు ప్రతినిధుల సభ, సెనేట్‌లలో రిపబ్లికన్లు, డెమోక్రాట్ల మధ్య శనివారం కూడా చర్చలు కొనసాగాయి.

బిల్లుపై పీటముడిని తొలగించేందుకు ఆదివారం కూడా సమావేశమవుతామని సెనేట్ రిపబ్లికన్ పార్టీ నాయకుడు మిచ్ మెక్‌కోనెల్ చెప్పారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక అధ్యక్ష భవనం వైట్‌హౌస్

సోమవారంలోగా పరిష్కారం: ఓఎంబీ

ప్రతిష్టంభనకు సోమవారంలోగా పరిష్కారం లభిస్తుందని అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లోని నిర్వహణ, బడ్జెట్ కార్యాలయం(ఓఎంబీ) సంచాలకుడు మిక్ ముల్వనే ఆశాభావం వ్యక్తంచేశారు.

ముల్వనే ఆశిస్తున్నట్లు జరగకపోతే లక్షల మంది ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగులు విధులకు దూరంగా ఉండే అవకాశముంది. అప్పుడు పెద్ద సంఖ్యలో ప్రభుత్వ కార్యాలయాలు తాత్కాలికంగా మూతపడతాయి.

సెనేట్‌లో మొత్తం సీట్ల సంఖ్య 100 కాగా, రిపబ్లికన్లు 51 మంది, డెమోక్రాట్లు 47 మంది ఉన్నారు. మరో ఇద్దరు స్వతంత్ర సెనేటర్లు.

బిల్లు ఆమోదానికి 60 ఓట్లు కావాలి. బిల్లును ఆమోదింపజేసుకోవాలంటే డెమోక్రాట్ల సహకారం కావాలి.

శుక్రవారం జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 50, వ్యతిరేకంగా 49 ఓట్లు పడ్డాయి.

Image copyright Getty Images

ఎవరి వాదన ఏమిటి?

సరిహద్దులో గోడ నిర్మాణం సహా పలు సరిహద్దు భద్రత చర్యలకు నిధులు సమకూర్చడం, సైన్యానికి కేటాయింపులు పెంచడం, వలస విధానాల సంస్కరణ చేపట్టాల్సి ఉందని రిపబ్లికన్లు చెబుతున్నారు.

ఒకప్పుడు బాలలుగా అమెరికాలోకి ప్రవేశించి, దేశంలోనే ఉండిపోయిన ఏడు లక్షల మందికి పైగా అక్రమ వలసదారులను అమెరికా నుంచి పంపించేయొద్దని ట్రంప్ ప్రభుత్వాన్ని డెమోక్రాట్లు డిమాండ్ చేస్తున్నారు.

దిగువ ఆదాయ కుటుంబాల్లోని పిల్లలకు ఆరోగ్య బీమా పథకాన్ని ఆరేళ్లపాటు పొడిగిస్తామని రిపబ్లికన్లు ప్రతిపాదించారు. దీనిని ఎప్పటికీ కొనసాగించాలని డెమోక్రాట్లు డిమాండ్ చేస్తున్నారు.

అమెరికా మహోన్నత సైన్యం, ప్రమాదకరంగా మారిన అమెరికా దక్షిణ సరిహద్దుల భద్రత గురించి కంటే కూడా అక్రమ వలసదారుల గురించే డెమోక్రాట్లు ఎక్కువగా ఆలోచిస్తున్నారని ట్రంప్ విమర్శించారు.

ప్రతిష్టంభనపై సెనేట్‌లో డెమోక్రాటిక్ పార్టీ నాయకుడైన చుక్ ష్కుమర్ స్పందిస్తూ- ట్రంప్ తీరును తప్పుబట్టారు.

ట్రంప్ తన ప్రభుత్వంలోని మితవాద శక్తుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని ఆయన ఆరోపించారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక చుక్ ష్కుమర్

'ఈ వ్యూహాలను డెమోక్రాట్లు విరమించుకోవాలి'

బిల్లు ఆమోదానికి సహకరించకపోవడం ద్వారా ప్రభుత్వ వ్యయాన్ని, తద్వారా కార్యకలాపాలను, సేవలను డెమోక్రాట్లు స్తంభింపజేశారని వైట్‌హౌస్ పేర్కొంటోంది.

ఇలాంటి వ్యూహాలను వారు విరమించుకొనే వరకు వలస విధాన సంస్కరణలపై అధ్యక్షుడు వారితో చర్చలు జరపబోరని వైట్‌హౌస్ అధికార ప్రతినిధి సారా సాండర్స్ స్పష్టం చేశారు.

తాత్కాలిక ఏర్పాటుకే బిల్లు

సాధారణంగా అమెరికా బడ్జెట్‌, ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే తేదీ అయిన అక్టోబరు 1లోగా కాంగ్రెస్ ఆమోదం పొందాల్సి ఉంటుంది.

అయితే దీనిపై సకాలంలో చర్చలు కొలిక్కి రాక, తర్వాతి సంవత్సరం జనవరిలో కూడా కొనసాగుతుంటాయి.

ఈ సమయంలో ఫెడరల్ ఏజెన్సీలకు జీతాల చెల్లింపు, ఇతర వ్యయాలకు తాత్కాలిక ప్రాతిపదికన నిధులను ఏర్పాటు చేస్తుంటారు.

ఈ క్రమంలో ఇప్పుడు ఫిబ్రవరి 16 వరకు ఫెడరల్ ప్రభుత్వ వ్యయాలకు వీలు కల్పించాల్సి ఉండగా, ఈ బిల్లుకు ట్రంప్ ప్రభుత్వం సెనేట్‌ ఆమోదాన్ని సాధించలేకపోయింది.

Image copyright LOIC VENANCE/AFP/Getty Images
చిత్రం శీర్షిక మూసివేసిన వాటిలో న్యూయార్క్‌లోని ప్రఖ్యాత 'స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ' కూడా ఉంది.

'స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ' మూసివేత

నిధుల వ్యయానికి ప్రభుత్వానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో ప్రభుత్వం అత్యధిక సంఖ్యలో ఉద్యోగులను సెలవులో ఉండాలని ఆదేశించింది.

తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికాలో పలు జాతీయ స్మారక కట్టడాలు, భవనాలు తాత్కాలికంగా మూతపడ్డాయి. అక్కడ సందర్శకులను అనుమతించడం లేదు.

మూసివేసిన వాటిలో న్యూయార్క్‌లోని ప్రఖ్యాత 'స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ' కూడా ఉంది.

నాడు ఒబామాను విమర్శించిన ట్రంప్

స్వల్ప కాలిక వ్యయాలకు సంబంధించిన బిల్లు కాంగ్రెస్ ఆమోదం పొందకపోవడం వల్ల ప్రభుత్వ నిధుల వ్యయం, కార్యకలాపాలు, సేవలు చివరిసారిగా 2013 అక్టోబరులో స్తంభించాయి.

నాడు బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ పరిస్థితికి ఒబామానే కారణమని ట్రంప్ అప్పట్లో ఒక ఇంటర్వ్యూలో విమర్శించారు.

2013లో 16 రోజులపాటు ఈ సమస్య కొనసాగింది. ఒక దశలో అత్యధికంగా సుమారు 8.5 లక్షల మంది ఫెడరల్ ఉద్యోగులు విధులకు హాజరు కాలేదు.

ఫలితంగా నాడు 200 కోట్ల డాలర్ల విలువైన ఉత్పాదకతను ప్రభుత్వం కోల్పోయిందని అప్పట్లో ఓఎంబీ(నిర్వహణ, బడ్జెట్ కార్యాలయం) అంచనా వేసింది. ఇది ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపిందని తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)