వర్జిన్స్ హైపర్‌లూప్: భవిష్యత్తా? భ్రమా?

  • రోరీ కెలాన్ జోన్స్
  • టెక్నాలజీ కరెస్పాండెంట్
హైపర్‌లూప్ వన్

ఫొటో సోర్స్, VIRGIN HYPERLOOP ONE

ఫొటో క్యాప్షన్,

గంటకు 1,123 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే అత్యాధునిక రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయటానికి వర్జిన్ హైపర్‌లూప్ వన్ పరీక్షలు నిర్వహిస్తోంది

ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతిలో హైపర్‌లూప్ రవాణా వ్యవస్థ గురించి చర్చ జరుగుతోంది. ఇంకా ముంబయి-పుణె, చెన్నై-బెంగళూరు మధ్య కూడా హైపర్‌లూప్ ఏర్పాటు చేసే ప్రతిపాదనలున్నాయి.

ఇంతకూ హైపర్‌లూప్ సాంకేతికత ఏంటి? ఇది ఎలా నడుస్తుంది? దీని సాధ్యాసాధ్యాలు, సమస్యలు ఏంటి? బీబీసీ టెక్నాలజీ కరెస్పాండెంట్ రోరీ కెలాన్ జోన్స్ అందిస్తున్న విశ్లేషణాత్మక కథనం ఇది.

‘‘మేం మిమ్మల్ని ఒక పా‌డ్‌లో ఎక్కిస్తాం. దాన్ని గంటకు 1,123 కిలోమీటర్ల వేగంతో షూట్ చేస్తాం. మిమ్మల్ని గమ్యానికి గంటల్లో కాదు.. నిమిషాల్లో చేరుస్తాం.’’

ఇది హైపర్‌లూప్ వన్ చెప్తున్న మాట. నెవాడాలోని ఈ ప్రాజెక్టు పరీక్షా కేంద్రాన్ని నేను ఇటీవల సందర్శించినపుడు.. ఇది చాలా అసాధారణమైన విషయమని నాకనిపించింది.

టెస్లా సంస్థకు చెందిన ఎలాన్ మస్క్ ఈ హైపర్‌లూప్ ఆలోచన తొలుత ప్రతిపాదించారు. ఆ తర్వాత మాగ్లెవ్ రైలును వాక్యూమ్ ట్యూబ్ (శూన్య గొట్టం)లో పెట్టి నడపటం ద్వారా విప్లవాత్మకమైన భవిష్యత్ రవాణా వ్యవస్థను రూపొందించవచ్చునని నిరూపించటానికి చాలా ప్రాజెక్టులు సిద్ధమయ్యాయి.

అయస్కాంతాల సాయంతో పట్టాల మీద రైలును పైకెత్తి నిలుపటం వల్ల రాపిడి తగ్గి వేగం పెరిగే.. మాగ్లెవ్ - అంటే మాగ్నెటిక్ లేవిటేషన్ - రైళ్లు ఇప్పటికే పలు ప్రాంతాల్లో నడుస్తున్నాయి.

అటువంటి వాటిలో ఒకటి చైనాలోని షాంఘై నుంచి అక్కడి విమానాశ్రయానికి ప్రయాణికులను గంటకు 430 కిలోమీటర్ల వేగంతో తీసుకెళుతోంది.

వీడియో క్యాప్షన్,

వీడియో: నెవాడాలోని హైపర్‌లూప్ పరీక్షా కేంద్రాన్ని చూద్దాం రండి..

అయితే ఈ మాగ్లెవ్‌ను వాక్యూమ్ ట్యూబ్‌లో నడపటం ఇంకా అత్యాధునికమైన ప్రక్రియ. దీనినే హైపర్‌లూప్ వన్ అంటున్నారు. ఇంకా సర్ రిచర్డ్ బ్రాన్సన్ చేపట్టిన ప్రాజెక్టు పేరుతో పిలవాలంటే ఇది వర్జిన్ హైపర్‌లూప్ వన్.

లాస్ వేగాస్‌కు ఉత్తరంగా 40 మైళ్ల దూరంలోని ఎడారిలో ఉన్న ఈ పరీక్షా కేంద్రాన్ని చూస్తే.. ఈ వ్యవస్థను నడపటం చాలా ఖరీదైన వ్యవహారమని వెంటనే అర్థమవుతుంది.

ఒక 500 మీటర్ల టెస్ట్ ట్రాక్‌ను - దీనిని డెవ్‌లూప్ అని వ్యవహరిస్తున్నారు - నిర్మించారు. ఉన్నత స్థాయి ఇంజనీర్లు 200 మంది సహా మొత్తం 300 మంది కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు.

వీరు పలు పరీక్షలు నిర్వహించారు. ఈ ట్యూబ్‌ గుండా ఒక పాడ్‌ను గంటకు 387 కిలోమీటర్ల వేగంతో పంపించారు. అయితే.. ఇంతవరకూ ఆ పాడ్‌లలో మనుషులను ఎక్కించలేదు.

ఫొటో సోర్స్, Virgin Hyperloop One

ఫొటో క్యాప్షన్,

హైపర్‌లూప్ వన్ పాడ్

ఈ ఇంజనీరింగ్ బృందానికి అనితా సేన్‌గుప్తా అనే అంతరిక్ష శాస్త్రవేత్త సారథ్యం వహిస్తున్నారు. నాసాలో మార్స్ క్యూరియాసిటీ రోవర్‌ను అభివృద్ధి చేయటంలో కీలక పాత్ర పోషించిన ఆమెను ఈ ప్రాజెక్టు కోసం రిక్రూట్ చేసుకున్నారు.

వాహనాలను ఇతర గ్రహాలపై దించే ‘చాలెంజింగ్ ఇంజనీరింగ్ సమస్య’ మీద పనిచేసిన అనితా.. భూమి మీద ఈ హైపర్‌లూప్ ప్రాజెక్టు వాస్తవికమైనదేనా అనేదానిపై నా సందేహాలను కొట్టిపారేశారు.

ఎడారిలో పాములా మెలికలు తిరిగివున్న తెల్లటి పైపు వైపు చూపిస్తూ.. ‘‘ఇది వాస్తవికమైన ప్రాజెక్టు. ఎందుకంటే మీరు చుట్టూ చేస్తే మా డెవలప్‌మెంట్ టెస్ట్ ట్యూబ్ కనిపిస్తుంది’’ అని పేర్కొన్నారు.

ఈ సాంకేతికత ఇప్పటికే నిరూపితమైందని ఆమె చెప్తారు. దీనిలోకి ఎక్కటానికి జనం సంశయిస్తారేమోనన్న నా సందేహాన్ని కూడా ఆమె కొట్టివేశారు.

ఫొటో సోర్స్, Virgin Hyperloop One

ఫొటో క్యాప్షన్,

మాగ్నటిక్ లెవిటియేషన్ టెక్నాలజీని ఉపయోగించి ట్రాక్ మీద ఈ నమూనా పాడ్‌లను నడుపుతున్నారు

‘‘హైపర్‌లూప్ అంటే వాక్యూమ్ ట్యూబ్‌లో నడిచే మాగ్లెవ్ ట్రైన్’’ అని ఆమె వివరించారు. ఇందులో గాలి ఒత్తిడి స్థాయి గురించి చెప్తూ.. ’’2,00,000 అడుగుల (38 మైళ్ల) ఎత్తులో ఎగిరే విమానంలో లాగా ఉంటుందనుకోవచ్చు’’ అని చెప్పారు.

‘‘విమానంలో ఎగిరివెళ్లడానికి ప్రజలకు ఎలాంటి సమస్యా లేదు. మాగ్లెవ్ రైళ్లలో ప్రయాణించటానికీ ప్రజలకు సమస్య లేదు. ఆ రెండిటినీ కలిపితే ఈ హైపర్‌లూప్ అవుతుందంతే’’ అని అభివర్ణించారు.

2021 నాటికల్లా ఈ ప్రాజెక్టు భద్రత సర్టిఫికేషన్ సాధించి, వాణిజ్య నిర్వహణ ప్రారంభానికి సిద్ధమవుతుందని ఆమె జోస్యం చెప్పారు.

ఇది మతిపోయేంత ఆశాభావంగా కనిపిస్తోంది. ఈ హైపర్‌లూప్‌ను వాస్తవరూపంలోకి దాల్చాల్సింది వాణిజ్య, ప్రభుత్వ భాగస్వాములు. వాటికి దీనిని విక్రయించే పని చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాబ్ లాయిడ్‌ది.

లాస్ ‌వేగాస్‌లో జరిగిన భారీ సీఈఎస్ టెక్ షోలో ఆయనను మేం కలిసినపుడు.. ఈ హైపర్‌లూప్ సాంకేతికత ఆచరణ సాధ్యమైనట్లు నిరూపితమైందని భావిస్తున్నట్లు కనిపించారు.

ఆ విషయాన్ని వదిలేసి.. భవిష్యత్తులో హైపర్‌లూప్ ప్రయాణికులు తమ గమ్యం చేరుకున్న తర్వాత ఇతర తరహా రవాణా మార్గాలతో అనుసంధానించే యాప్ గురించి మాట్లాడటం మీద ఆసక్తి చూపించారు.

ఫొటో సోర్స్, Virgin

ఫొటో క్యాప్షన్,

వర్జిన్ హైపర్‌లూప్ వన్ డిసెంబర్‌లో సర్ రిచర్డ్ బ్రాన్సన్‌ను సంస్థ చైర్మన్‌గా నియమించింది

బ్రిటన్‌లో.. లండన్ నుంచి బర్మింగ్‌హామ్‌కి హెచ్‌ఎస్‌2 హై-స్పీడ్ రైల్వే లైను వంటి మౌలికసదుపాయాల నిర్మాణానికి ఎంత సమయం పట్టిందో వివరిస్తూ ఆయనను నేల మీదకు తీసుకువచ్చే ప్రయత్నం చేశాను.

ఆయన వెంటనే ఒక ఐడియా చెప్తూ.. దానిని అమలు చేస్తే.. హీత్రూ విమానాశ్రయం వద్ద.. ఏళ్ల తరబడి పనులు జరుగుతున్న మూడో రన్‌వే ఇక అవసరమే ఉండదని పేర్కొన్నారు.

‘‘గాట్విక్ - హీత్రూల మధ్య ఒక హైపర్‌లూప్ నిర్మించవచ్చు. ఆ రెండు విమానాశ్రాయాలకు ఒక దాని నుంచి మరొక దానికి.. టెర్మినళ్ల మధ్య తిరిగినట్లుగా.. నాలుగు నిమిషాల్లో చేరుకోవచ్చు’’ అని ఆయన వివరించారు.

‘‘ఇప్పుడు హీత్రూలో టెర్మినల్ 5 నుంచి టెర్మినల్ 2కు చేరుకోవటానికి పట్టే సమయం కన్నా గాట్విక్ నుంచి హీత్రూకి చేరుకోవటానికి తక్కువ సమయం పడుతుంది’’ అని వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Virgin Hyperloop One

రన్‌వే నిర్మించటానికి అయ్యే భారీ వ్యయం, వివాదం ఏమీ లేకుండా ఏడు టెర్మినళ్ల భారీ విమానాశ్రయాన్ని నిర్మించటం ఆకర్షణీయంగా కనిపించొచ్చు.

ప్రాజెక్టు చైర్మన్ సర్ రిచర్డ్ బ్రాన్సన్ ‘‘హీత్రూ - గాట్విక్‌ల మధ్య వేగవంతమైన అనుసంధానం చాలా ఆలోచనాత్మకంగా ఉంటుంది’’ అని మాతో పేర్కొన్నారు. కానీ ఇది అత్యాశలాగా వినిపిస్తుంది.

హీత్రూ నుంచి గాట్విక్ వరకూ సొరంగం తవ్వటానికి అయ్యే వ్యయం.. ససెక్స్ - సర్రేల మధ్య ట్యూబ్‌లను నడపటానికి ప్రణాళికా రచన పీడకలను చూస్తే.. దానికన్నా మూడో రన్‌వేను అలవోకగా నిర్మించవచ్చు అనిపిస్తుంది.

ఇదిలావుంటే.. ఎలాన్ మస్క్ లాస్ ఏంజెల్స్ కింద సొరంగం తవ్వుతూ తన సొంత హైపర్‌లూప్ ప్రాజెక్టల గురించి ఆలోచిస్తున్నారు.

న్యూయార్క్ నుంచి వాషింగ్టన్ డీసీకి అరగంటలో ప్రయాణికులను తీసుకెళ్లేలా ప్రాజెక్టు నిర్మాణానికి అమెరికా ప్రభుత్వం నుంచి తనకు ‘మౌఖిక అనుమతి’ లభించిందని గత వేసవిలో పేర్కొన్నారు.

ఫొటో క్యాప్షన్,

భూమి మీద కానీ, లోపల కానీ హైపర్‌లూప్ ట్యూబులను నిర్మించటం ఒక సవాలు

ఇది కూడా అసాధ్యమైన ప్రాజెక్టులా కనిపిస్తోంది. మస్క్ టెస్లా ప్రాజెక్టు కోసం భారీగా డబ్బు తెచ్చిపోసిన పెట్టుబడిదారులు మళ్లీ తమ జేబుల్లోంచి పెట్టుబడులు పెడతారా అన్నది అనుమానమే.

అయితే.. విమానం తర్వాత ఆవిష్కరిస్తున్న తొలి కొత్త తరహా రవాణా వ్యవస్థను ముందుకు తీసుకెళ్లేందుకు ముందుచూపు గల కొన్ని ప్రభుత్వాలైనా ముందుకొస్తాయని వర్జిన్ హైపర్‌లూప్‌ రాబ్ లాయిడ్ ధీమాగా ఉన్నారు.

ఏళ్ల తరబడి సాంకేతిక ఆవిష్కరణ మొత్తం సోషల్ మీడియా గురించే అన్నట్లుగా సాగిన తర్వాత.. ఇటువంటి ఆశావహ ముందుచూపు కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తోందని పీటర్ థీల్ అనే పెట్టుబడిదారుడు పేర్కొన్నారు.

ప్రధాన నగరాలను అనుసంధానిస్తూ హైపర్‌లూప్‌ మార్గాలను నిర్మించటమనేది.. ప్రణాళికా పత్రాలను దాటి ముందుకు సాగుతుందా అన్న అనుమానాలున్నప్పటికీ.. మనం హరిత రవాణా వ్యవస్థ గురించి ఆలోచించేలా చేయటంలో ఈ ప్రాజెక్టు బాగా పనిచేస్తోంది.

అమరావతిలో హైపర్‌లూప్.. ప్రభుత్వంతో ఒప్పందం

హైపర్‌లూప్ రవాణా వ్యవస్థను భారతదేశంలో ముంబై-బెంగళూరు-చెన్నై నగరాల మధ్య 1102 కిలోమీటర్ల రూట్‌ను ప్రతిపాదించారు. ముంబై నుంచి చెన్నైకి 63 నిమిషాల్లో చేరుకోవచ్చని చెబుతున్నారు.

బెంగళూరు-చెన్నైల మధ్య 334 కిలోమీటర్ల దూరాన్ని 23 నిమిషాల్లో చేరుకోవచ్చని అంటున్నారు.

ముంబై -పుణె నగరాల మధ్య కూడా దీన్ని నిర్మించాలన్న ఆలోచనలో ఉన్న హైపర్‌లూప్ సంస్థ పూణే మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథార్టీతో ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది.

అదేవిధంగా.. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో కూడా దీన్ని ఏర్పాటు చేయాలన్న ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం, హైపర్‌లూప్ మధ్య గతేడాది సెప్టెంబర్‌లో అవగాహన ఒప్పందం జరిగింది.

హైపర్‌లూప్ ట్రాన్స్‌పోర్ట్ టెక్నాలజీ (హెచ్‌టీటీ) ప్రతినిధులతో గతేడాది జనవరిలో చంద్రబాబు నాయుడు చర్చలు జరిపారు. స్విట్జర్లాండ్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశాలకు వెళ్లినప్పడు ఈ అంశంపై దృష్టి సారించిన చంద్రబాబు తర్వాత రాష్ట్ర సచివాలయంలో కూడా హైపర్‌లూప్ ప్రతినిధులతో భేటీ అయ్యారు.

అమరావతి-విజయవాడ మధ్య ఈ రవాణాను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నట్లు అవగాహన ఒప్పందం సందర్భంగా ఏపీ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు సీఈఓ క‌ృష్ణ కిశోర్ తెలిపారు.

ఆరు నెలల్లో సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తామని అప్పట్లో హైపర్‌లూప్ ప్రకటించింది. అందుకు అవసరమైన సహకారం ఇస్తామని కృష్ణకిశోర్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)