మాతృత్వం-రాజకీయం.. ఈ విమర్శలు ఆగేదెప్పుడు?

  • 23 జనవరి 2018
లారిసా వాటర్స్

అప్పట్లో భుట్టో, ఇప్పుడు జెసిండా ఆర్డెర్న్.. వీళ్లిద్దరూ ప్రధానులుగా ఉండగానే గర్భవతులయ్యారు. ఫలితంగా విమర్శల బారిన పడ్డారు.

37 ఏళ్ల న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్.. తాను గర్భవతినని ఇటీవలే ప్రకటించారు. ఆ వార్త విని చాలామంది సంతోషించినా, కొందరు మాత్రం విమర్శిస్తున్నారు. గతంలో బెనజీర్ భుట్టోకు కూడా ఆ విమర్శలు తప్పలేదు.

దాదాపు 30 ఏళ్ల క్రితం పదవిలో ఉండగానే తల్లయిన తొలి నేతగా నాటి పాకిస్తాన్ ప్రధాని బేనజీర్ భుట్టో నిలిచారు. 1990లో భుట్టో కుమార్తె బఖ్తావర్ పుట్టారు.

కానీ బిడ్డకు జన్మనిచ్చే క్రమంలో భుట్టో అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రధాన మంత్రికి ప్రసూతి సెలవులు తీసుకునే హక్కు లేదని కొందరు నేతలు విమర్శించారు.

'పదవిలో ఉండగా రెండోసారి తల్లి కావడం సబబు కాదు. ప్రజా ప్రతినిధులు కొన్నిసార్లు త్యాగాలు చేయక తప్పదు' అని పాకిస్తాన్‌కు చెందిన ఓ నేత అన్నట్లు ఆ రోజుల్లో స్థానిక పత్రికలు పేర్కొన్నాయి.

'మాతృత్వం, కుటుంబం, అందం, బాధ్యతలు.. ఇలా అన్నీ కావాలని భుట్టో కోరుకుంటున్నారు. ఇవే కోరికలు మామూలు వ్యక్తులకంటే దాన్ని అత్యాశగా అభివర్ణిస్తారు' అని సదరు నేత అన్నట్లు పత్రికలు తెలిపాయి.

చిత్రం శీర్షిక 'నేను ఆ సమయంలో ప్రచారం చేయలేనని జనరల్ జియా అన్నారు. కానీ ఆ భావన తప్పని నిరూపిస్తూ నేను ఎన్నికల్లో ప్రచారం చేసి గెలిచా'

భుట్టో తన తొలి బిడ్డకు జన్మనిచ్చే సందర్భంలో కూడా విమర్శలు ఎదుర్కొన్నారు.

'నేను ఆ సమయంలో ప్రచారం చేయలేనని జనరల్ జియా అన్నారు. కానీ ఆ భావన తప్పని నిరూపిస్తూ నేను ఎన్నికల్లో ప్రచారం చేసి గెలిచా' అంటూ గతంలో బీబీసీ కోసం రాసిన 'ప్రెగ్నెన్సీ అండ్ పాలిటిక్స్' అనే ఆర్టికల్‌లో బుట్టో పేర్కొన్నారు.

ఎన్నికలకు కొన్ని రోజుల ముందు భుట్టో కొడుకు బిలావల్ పుట్టారు. ఆ తరవాత ఆమె ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు.

30 ఏళ్ల తరవాత కూడా మహిళా రాజకీయ నేతల పరిస్థితి మారలేదు. ఇప్పటికీ వాళ్ల మాతృత్వంపైన ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి.

గతంలో ఆస్ట్రేలియా ప్రధానిగా ఎన్నికైన జూలియా గిలార్డ్‌కు భిన్నమైన విమర్శ ఎదురైంది. 'కావాలనే ఆమె మాతృత్వానికి దూరంగా ఉన్నారు. అందుకే ఆమెకు పాలించే హక్కు లేదు' అని గిలార్డ్‌ను ఉద్దేశిస్తూ 2007లో ఆ దేశానికి చెందిన ఓ సెనేటర్ అన్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక తాను తల్లి కాబోతున్న విషయాన్ని న్యూజిలాండ్ ప్రధాని జెసిండా, తన భాగస్వామితో కలిసి ప్రకటించారు

'తనకు పదవి కావాలా? పిల్లలు కావాలా?' అంటూ ప్రస్తుత న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్‌కు గతేడాది నేతల నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి.

'ఆమె పిల్లలకు న్యాపీలు మారుస్తుందా లేక ప్రజలకు సేవ చేస్తుందా?' అంటూ గతేడాది బ్రిటన్‌లో ఎన్నికల్లో పోటీ చేసిన ఓ మహిళను ఉద్దేశిస్తూ స్థానిక నేత ఒకరు అన్నారు.

మెర్కెల్, థెరిసా మే, మాయావతి

శక్తిమంతమైన మహిళా నేతలుగా పేరున్న థెరిసా మే, ఏంజెలా మెర్కెల్, మాయావతి లాంటి వాళ్లకూ విమర్శలు తప్పలేదు.

'ఓ మహిళకు ఉండాల్సిన చాలా అనుభవాలు మెర్కెల్‌కు లేవు' అంటూ ఆమెకు పిల్లలు లేరనే విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆమెకు మహిళల సమస్యలు అర్థం కావని ఎద్దేవా చేస్తూ ప్రత్యర్థులు విమర్శించారు.

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మాయావతి కూడా ఇలాంటి విమర్శే ఎదుర్కొన్నారు.

జైల్లో తన కొడుకును కలిసే అవకాశం మనేకా గాంధీకి ఇవ్వకపోవడంతో, 'ఓ తల్లికి మాత్రమే నా బాధ అర్థమవుతుంది' అంటూ మాయావతిని ఉద్దేశిస్తూ మనేకా అన్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక 'ఓ తల్లికి మాత్రమే నా బాధ అర్థమవుతుంది'

తల్లిగా తన బాధ్యతలు నిర్వహిస్తూనే రాజకీయాల్లోనూ రాణించాలనుకునే మహిళలకు చాలా మద్దతు కావాలి.

యూకేలో సామాన్య ప్రజలతో పోలిస్తే గర్భధారణకు దూరంగా ఉండే మహిళా ఎంపీల సంఖ్య రెట్టింపు ఉంటుందని 2012లో డా.రోసీ క్యాంప్‌బెల్, ప్రొ. సారా చైల్డ్స్ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో తేలింది.

ఇంట్లో చంటి పిల్లలు ఉన్నప్పుడు మహిళలకు రాజకీయాల్లో రాణించడం కూడా కష్టమేనని ఆ అధ్యయనం చెబుతోంది.

ప్రజా ప్రతినిధులు పార్లమెంటులో పిల్లలకు పాలుపట్టే అవకాశాన్ని కల్పిస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం నిబంధనల్లో మార్పు చేయడంతో, గతేడాది ఆస్ట్రేలియా సెనెటర్ లారిసా వాటర్స్ తన బిడ్డకు పార్లమెంటులోనే పాలు పట్టారు. అలా ఆ పని చేసిన తొలి వ్యక్తిగా నిలిచారు.

చిత్రం శీర్షిక పార్లమెంటులో బిడ్డకు పాలుపట్టిన తొలి వ్యక్తి.. లారిసా వాటర్స్

విదేశాల్లో పరిస్థితి ఇలా ఉంటే భారత్‌లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది.

ఇక్కడ మమతా బెనర్జీ, జయలలిత, షీలా దీక్షిత్, వసుంధరా రాజే, మాయావతి, ఉమా భారతి లాంటి వాళ్లు ఓ దశలో పదవిలో ఉన్న సమయంలో ఒంటరిగా ఉండేవాళ్లనే అంశంపై చర్చ జరిగేది.

ఇలా ఓ మహిళా నేత తల్లయిందా? కాలేదా? కాబోతున్నారా? లేక అసలు తల్లి కావడమే ఆమెకు ఇష్టం లేదా? అనే అంశం చుట్టూ జరిగే చర్చ ఎప్పుడు ఆగుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది.

ప్రస్తుతానికి చర్చంతా త్వరలో తల్లి కాబోతున్న న్యూజిలాండ్ ప్రధాని జెసిండా చుట్టూనే తిరుగుతోంది. సోషల్ మీడియా ఇంత విస్తృతమైన దశలో తల్లవుతోన్న తొలి ప్రధాని ఆవిడే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)