82 శాతం సంపద ఒక్క శాతం కుబేరుల చేతిలోనే: ఆక్స్‌ఫామ్ నివేదిక

  • 23 జనవరి 2018
వ్యవసాయ పనుల్లో ఓ వ్యక్తి Image copyright AFP

ప్రపంచంలోని అత్యంత ధనికులకు, పేదవారికి ఆర్థిక అంతరాలు గణనీయంగా పెరిగాయని ఆక్స్‌ఫామ్ సంస్థ ప్రకటించింది. 2017లో మొత్తం ప్రపంచ సంపదలో అత్యధిక భాగం కేవలం కొద్ది మంది మహాకుబేరుల జేబుల్లోకి వెళ్లిందని ఆక్స్‌ఫామ్ పేర్కొంది.

2017లో ఉత్పత్తి అయిన ప్రపంచ సంపదలో 82% కేవలం ఒక్క శాతానికి పరిమితమైన సంపన్నుల వైపు మళ్లిందని, మరోవైపు ప్రపంచంలోని పేదల జనాభాలో సగం మంది జీవితాల్లో ఎటువంటి పురోగతి లేదని ఆక్స్‌ఫామ్ వివరించింది.

పన్నుల ఎగవేత, కార్మిక చట్టాల ఉల్లంఘన, ఖర్చుల నియంత్రణ లాంటి అంశాలు పేద, ధనికుల మధ్య ఉన్న వ్యత్యాసం పెరగడానికి కారణాలని ఆక్స్‌ఫామ్ అభిప్రాయపడింది.

గత 5 సంవత్సరాలుగా పేద, ధనిక వర్గాల మధ్య పెరుగుతున్న అంతరం గురించి ఆక్స్‌ఫామ్ సంస్థ పలు నివేదికలను వెలువరించింది.

2017 ఆక్స్‌ఫామ్ నివేదిక ప్రకారం 8 మంది అత్యంత ధనికుల సంపద ప్రపంచంలోని సగం మంది పేదల సంపదతో సమానంగా ఉంది.

కానీ ఈ సంవత్సరం తాజా లెక్కల ప్రకారం ప్రపంచంలోని సగం మంది పేదల సంపదతో సమానంగా 42 మంది ధనికుల సంపద పెరిగిందని ఆక్స్‌ఫామ్ తెలిపింది.

పేద, ధనిక వర్గాల మధ్య అంతరం పెరుగుతున్న నేపథ్యంలోనే ఈ విషయంలో పునఃపరిశీలన అవసరమవుతోందని ఆక్స్‌ఫామ్ పేర్కొంది.

Image copyright Getty Images

ఆర్థిక అసమానతలు సుస్పష్టం

మా నివేదికల్లోని గణాంకాల మధ్య చాలా మార్పులు ఉన్నాయి. ఎప్పటికప్పుడు మారుతున్న గణాంకాల ప్రకారం అందుబాటులో ఉన్న కచ్చితమైన సమాచారం మేరకే నివేదికలను రూపొందిస్తున్నాం. అందుకే ఆ తేడా కనిపిస్తోంది.

''ఈ నివేదికలను ఓసారి పరిశీలిస్తే.. పేద, ధనిక వర్గాల మధ్య ఆర్థిక అసమానతలను మనం గమనించవచ్చు. ఈ ఆర్థిక అసమానతలను ఆమోదించలేం!'' అని ఆక్స్‌ఫామ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ గోల్డ్‌రింగ్ అన్నారు.

దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు ప్రపంచంలోని ప్రముఖ రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు హాజరవుతారు. ఈ నేపథ్యంలో ఆక్స్‌ఫామ్ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది.

దావోస్ సమావేశాల అజెండాలో ఈ ఆర్థిక అసమానతల అంశం ప్రస్తావనకు వచ్చినా.. దీనిపై పెద్దగా చర్చ జరగదని మార్క్ గోల్డ్‌రింగ్ నిరాశ వ్యక్తం చేశారు.


బీబీసీ 'రియాలిటీ చెక్' ప్రతినిధి ఆంథొనీ రూబెన్ విశ్లేషణ

ప్రపంచంలోని ధనికులు, పేదల సంపదలను లెక్కించడం చాలా కష్టంతో కూడుకున్న పని. ధనికులేమో తమ సంపదను బహిరంగ పరచడానికి ఇష్టపడరు. మరోవైపు.. చాలా దేశాల వద్ద సరైన సమాచారం ఉండడం లేదు. దీంతో ఇబ్బంది తలెత్తుతోంది.

గత సంవత్సరంలో ప్రపంచంలోని సగం మంది పేదల సంపదతో సమానంగా 8మంది ధనికులు ఆస్తులు కలిగివున్నారని ఆక్స్‌ఫామ్ తెలిపింది. ఆ తర్వాత ఆ ధనికుల సంఖ్య 61కు పెరిగిందని తెలిపింది.

ఈ సంవత్సరం మొదట్లో ఈ ధనికుల సంఖ్య 42కు పడిపోయిందని చెబుతోంది. ఈ నివేదికల్లో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఈ సవరణల మధ్య వ్యత్యాసం చాలానే ఉంది.

ఈ నివేదికలకు ఆధారమైన గణాంకాల్లో కూడా చాలా సంక్లిష్టతలు ఉన్నాయి. ఈ గణాంకాల్లోని పేదలను పూర్తిగా నిరుపేదలని అనలేం! పేదల జాబితాలో కొందరు.. విద్యావసరాల కోసం అప్పులు చేసినవారున్నారు, మరికొందరు భారీ ఆదాయం కలిగి ఉండి తమ ఆస్తులు తాకట్టులో ఉన్నవారూ ఉన్నారు. వీరిలో పేదలను ఏవిధంగా వేరు చేయడం?

ప్రపంచంలోని సగం మంది పేదల సంపదతో సరిసమానంగా ఆస్తులు కలిగివున్న వారు 8మంది కానీ, 61 కానీ.. 42 మంది కానీ.. అది ఏమైనా పేద, ధనికుల మధ్య తీవ్రమైన ఆర్థిక అసమానతలున్నాయన్నది వాస్తవం. ఈ సందేశాన్నే ఆక్స్‌ఫామ్ దావోస్ సమావేశాలకు తీసుకువెళుతోంది.

ఈ నేపథ్యంలో వ్యాపారులు తమ విధానాలను మార్చుకోవాలని ఆక్స్‌ఫామ్ కోరుతోంది. తాము సర్వే చేసిన 10 దేశాల్లోని ముప్పావు శాతం మంది ప్రజలు.. తమ తమ దేశాలు పేద, ధనిక వర్గాల మధ్య పెరుగుతున్న అంతరం గురించి ఆలోచించాలని కోరుతున్నారంటూ ఆక్స్‌పామ్ పేర్కొంది.

అయితే.. ఆక్స్‌ఫామ్ ధనికుల పట్ల వివక్ష చూపుతోందని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ డైరెక్టర్ జనరల్ మార్క్ లిటిల్‌వుడ్ అభిప్రాయపడ్డారు.

''సంపద అన్నది ఎప్పుడూ స్థిరంగా ఉండదు. ధనికులు కూడా పెద్ద మొత్తంలో పన్నులు కడుతున్నారు. ధనికుల సంపదలను కరిగించినంత మాత్రాన.. ఆర్థిక పునఃపంపిణీ జరగదు. పైగా అది ఎవ్వరికీ ఉపయోగకరం కూడా కాదు.''

మార్క్ లిటిల్‌వుడ్ గానే ఇతరులు కూడా ఆక్స్‌ఫామ్ నివేదికలను విమర్శిస్తున్నారు. ఈ నివేదికలు వాస్తవాలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ''ఆడమ్ స్మిత్ ఇన్‌స్టిట్యూట్'' రీసెర్చ్ విభాగాధిపతి శ్యామ్ డ్యుమిత్రి అభిప్రాయపడ్డారు.

''గత కొన్ని దశాబ్దాలుగా.. ప్రపంచంలో ఆర్థిక అసమానతలు గణనీయంగా పడిపోయాయి. భారత్, చైనా, వియత్నాం లాంటి దేశాలు నిబంధనలను సడలించి, ప్రజలకు ఆస్తి హక్కును కల్పిస్తూ.. ఉదారవాద సంస్కరణలను అవలంబిస్తున్నాయి'' అని శ్యామ్ అన్నారు.

Image copyright AFP

ఆక్స్‌ఫామ్ గణాంకాలు ఎక్కడివి?

ఫోర్బ్స్, స్విస్ గ్లోబల్ వెల్త్ డేటా బుక్ సమాచారం ఆధారంగా ఆక్స్‌ఫామ్ తన నివేదికలను రూపొందిస్తుంది.

సాధారణంగా వ్యక్తుల ఆస్తుల విలువలను పరిగణనలోకి తీసుకుని, వారి స్థిరచరాస్తుల నుంచి అప్పులను మినహాయించి ఆక్స్‌ఫామ్, వారి సంపదలను లెక్కిస్తుంది. ఈ సమాచారంలో వారు చెల్లించే వేతనాలు, ఆదాయాల ప్రస్తావన ఉండదు.

ఈ విధానం సరైంది కాదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఓ విద్యార్థి తన చదువు కోసం అప్పు చేసినా, అతడికి లేక ఆమెకు ఆ అప్పులను తీర్చే సమర్థత ఉన్నా, భవిష్యత్తులో అంతకంతకూ ఎక్కువ సంపాదించే స్థోమత ఉన్నా ఈ విధానం ప్రకారం.. వారు పేదల జాబితాలోకే వస్తారు.

అయితే.. ప్రపంచంలోని సగం మంది పేదల సంపదలను మళ్లీ లెక్కించి.. అందులోనుంచి ఇలాంటి విద్యార్థులు మొదలైనవారిని తీసివేసినా.. అప్పటికి కూడా ఆ పేదల సంపదతో సమానంగా 128మంది కోటీశ్వరుల వ్యక్తిగత సంపద ఉందని ఆక్స్‌ఫామ్ చెబుతోంది.


ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు