అమెరికాలో కుదిరిన సయోధ్య, ముగియనున్న ప్రతిష్టంభన

  • 23 జనవరి 2018
అమెరికా Image copyright Getty Images

అమెరికాలో గత మూడు రోజులుగా స్తంభించిపోయిన ప్రభుత్వ కార్యకలాపాలు ఇప్పుడు మళ్లీ ప్రారంభం కానున్నాయి.

రిపబ్లికన్స్, డెమోక్రట్స్‌కు మధ్య సయోధ్య కుదరడంతో ప్రస్తుతానికి ఈ సంక్షోభానికి తెరపడినట్టే.

ఫెడరల్ ప్రభుత్వానికి నిధులు మంజూరు చేసే తాత్కాలిక బిల్లుకు అమెరికా పార్లమెంటులోని రెండు సభలు - సెనేట్, ప్రతినిధుల సభ - ఆమోదం తెలిపాయి.

ప్రభుత్వ ఖర్చుల కోసం ఉద్దేశించిన ఈ తాత్కాలిక బిల్లుకు అనుకూలంగా సెనేట్‌లో 81 మంది ఓట్లు వేయగా, 18 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారు.

అయితే, ఈ ఒప్పందం కేవలం రెండున్నర వారాలకు మాత్రమే పరిమితం. అమెరికా అధ్యక్షుడు దీనిపై లాంఛనంగా ఆమోద ముద్ర వేశాక, ఫిబ్రవరి 8 వరకు ప్రభుత్వ కార్యకలాపాలు ఎలాంటి ఆర్థిక అవరోధాలు లేకుండా సాగేందుకు మార్గం సుగమమవుతుంది.

అయితే ఆ తర్వాత ఏం జరుగుతున్న దానిపై ఇప్పటికి ఎలాంటి స్పష్టతా లేదు.

Image copyright Getty Images

వలసదారుల సమస్యపై భిన్న వైఖరి

యువ వలసదారులను దేశం నుంచి వెళ్లగొట్టకుండా నిరోధించే చట్టాన్ని ఆమోదించాలని డెమోక్రట్లు సిఫార్సు చేస్తున్నారు. మూడు రోజులుగా కొనసాగుతూ వస్తున్న ప్రతిష్టంభన మరి కొద్ది గంటల్లో ముగిసిపోతుందని సుమర్ తెలిపారు.

"ఒకవేళ రిపబ్లికన్ సెనేటర్లు యువ వలసదారులను దేశం నుంచి వెళ్లగొట్టకుండా ఆపే కార్యక్రమంతో ముందుకొస్తే, డెమోక్రట్లు ఈ బిల్లుకు మద్దతునిస్తారు" అని డెమోక్రట్ సెనేటర్ చక్ సుమర్ అన్నారు.

"మేం మరింత ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. షట్‌డౌన్‌ను ఎత్తేయడానికి అవసరమైన చర్యలు చేపట్టాల్సి ఉంది" అని రిపబ్లికన్ సెనేటర్ నేత మిచ్ మెక్‌కానెల్ అన్నారు.

Image copyright AFP

డెమోక్రట్ల డిమాండ్ ఏంటి?

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ డొనాల్డ్ ట్రంప్ వలసదారుల పట్ల కఠిన వైఖరి చేపడుతూ వచ్చారు.

బడ్జెట్ ఆమోదానికి బదులుగా ప్రవాసుల సమస్యపై అధ్యక్షుడితో డీల్ చేసుకోవాలని డెమోక్రట్లు కోరుకుంటున్నారు. అయితే రిపబ్లికన్ సెనేటర్లు దీనికి సిద్ధంగా లేరు.

బాల్యం నుంచే అమెరికాలో ఉంటున్న ఏడు లక్షల మంది వలసదారులను అమెరికా నుంచి బహిష్కరించకుండా నిరోధించే నిబంధనలను బడ్జెట్ ప్రతిపాదనల్లో చేర్చాలని డెమోక్రట్లు పట్టుబడుతున్నారు.

Image copyright Getty Images

"ఇది కొద్ది రోజుల లేదా కొద్ది గంటల వివాదమని నేననుకుంటున్నా. అయితే ఇలా గట్టిగా జవాబివ్వాల్సిన అవసరం ఉంది. మమ్మల్ని ఈ స్థితి నుంచి బయటపడెయ్యగల వ్యక్తి అధ్యక్షుడు ట్రంప్ ఒక్కరే. ఆయన మూలంగానే ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించిపోయాయి" అని డెమోక్రటిక్ సెనేటర్ డిక్ డర్బిన్ శనివారం ఓ ఇంటర్వ్యూలో అన్నారు.

సరిహద్దు రక్షణ కోసం నిధుల కేటాయింపు జరగాలని రిపబ్లికన్ సెనేటర్లు కోరుకుంటున్నారు. ఇందులో మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణం, రక్షణ బడ్జెట్‌లో పెంపు ప్రతిపాదనలు భాగంగా ఉన్నాయి.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక అమెరికా పార్లమెంటు భవనం

ఒకవేళ ఇరు పక్షాల మధ్య ఒప్పందం కుదరనట్టయితే, ఈ గొడవ ముగిసే దాకా ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు లభించవు. దాంతో వారు విధులకు హాజరు కాలేరు.

సెనేట్ నిబంధనల ప్రకారం, ఒక బిల్లు ఆమోదం పొందాలంటే 100 మంది సభ్యులున్న సభలో 60 మంది ఓట్లు తప్పనిసరి.

సెనేట్‌లో ప్రస్తుతం 51 మంది రిపబ్లికన్లు ఉన్నారు. బడ్జెట్ ఆమోదం పొందాలంటే వారికి కొందరు డెమోక్రట్ల మద్దతు అనివార్యం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)