అమెజాన్ షాపింగ్ విప్లవం: చెక్ అవుట్ లేని సూపర్ మార్కెట్లు

  • 25 జనవరి 2018
అమెజాన్ గో స్టోర్ Image copyright Reuters
చిత్రం శీర్షిక స్మార్ట్ ఫోన్‌తో స్కాన్ చేసి అమెజాన్ గో స్టోర్‌లోనికి వెళుతున్న కస్టమర్లు

షాపింగ్‌లో విప్లవం సృష్టిస్తూ అమెరికాలో అమెజాన్ చెక్ అవుట్ లేని సూపర్ మార్కెట్‌ను ప్రారంభించింది. సోమవారం సియాటిల్‌లో ప్రారంభమైన ఈ సూపర్ మార్కెట్‌ను తెరవడానికి ముందే ప్రజలు పెద్ద ఎత్తున దాని ముందు నిలబడ్డారు.

ఈ సూపర్ మార్కెట్లో వందల కొద్దీ సీసీటీవీలు, ఎలెక్ట్రానిక్ సెన్సార్లను ఏర్పాటు చేశారు. ప్రతి కస్టమర్ ఏమేం తీసుకుంటున్నాడో వాటి ద్వారా గుర్తిస్తారు.

మొత్తం షాపింగ్ పూర్తి చేసుకుని బయటకు వెళ్లేప్పుడు వాళ్ల క్రెడిట్ కార్డులోంచి బిల్లు చెల్లింపు జరుగుతుంది.

గో స్టోర్ లోనికి ప్రవేశించడానికి, అమెజాన్ గో ఆప్ కలిగిన స్మార్ట్ ఫోన్‌తో స్కానింగ్ చేయాల్సి ఉంటుంది.

ఈ స్టోర్‌లో సాండ్ విచెస్, సలాడ్స్, డ్రింక్స్, బిస్కెట్స్, ఏవైనా షాపింగ్ బ్యాగ్‌లలో వేసుకోవచ్చు.

బిల్లింగ్ వద్ద తిరిగి తెరవాల్సిన అవసరం లేనందువల్ల వాటిని ట్రాలీలు లేదా బాస్కెట్‌లో వేసుకోవాల్సిన అవసరం లేదు. అల్కాహాల్ కొనుగోలుకు అవసరమైన ఐడీ చెక్ కోసం తప్ప, ఇక్కడ అసలు ఎలాంటి మానవ ప్రమేయం ఉండదు.

Image copyright Reuters

గో స్టోర్స్ ఎలా పని చేస్తాయి?

షెల్ఫ్‌లలో ఉండే సెన్సర్ల సాయంతో కస్టమర్లు తీసుకున్న వస్తువులన్నీ వాళ్ల అమెజాన్ గో అకౌంట్‌కు జత అవుతాయి. వాటిని వెనక్కి పెట్టేస్తే మళ్లీ ఆ అకౌంట్‌లోంచి వెనక్కి వెళతాయి. ప్రతి కస్టమర్ బయటకు వెళ్లేప్పుడు వాళ్లు తీసుకున్న వస్తువులన్నిటికీ ఓ ఎలెక్ట్రానిక్ రిసీప్ట్ అందుతుంది.

2016 డిసెంబర్‌లో దీనిని ప్రయోగాత్మకంగా ప్రారంభించినపుడు ఒకే రకమైన శరీరాలు ఉన్నవాళ్లను గుర్తించడంలో, వస్తువులను తీసుకున్న చోట కాకుండా వేరే చోట పెట్టడం వల్ల సమస్యలు ఉత్పన్నమయ్యాయి.

అయితే ఈ టెక్నాలజీని ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉందని అమెజాన్ కో హెడ్ గియాన్నా ప్యుయెరిని తెలిపారు.

Image copyright Getty Images

గ్రాబ్-అండ్-గో

గ్రాబ్-అండ్-గో షాపింగ్‌ను రిటైల్ వ్యాపారం భవిష్యత్తుగా భావిస్తున్నారు.

దానికి ఇదే సరైన సమయమని అమెజాన్ భావిస్తోంది.

దీనిని అమెజాన్ 'జస్ట్ వాక్ అవుట్' అని పిలుస్తోంది. అయితే ఇది ఎలా పని చేస్తుందన్న రహస్యాన్ని మాత్రం అమెజాన్ విప్పి చెప్పడం లేదు. సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల తరహాలో కంప్యూటర్ విజన్, కొన్ని అల్గారిథమ్స్, సెన్సార్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నట్లు అమెజాన్ చెబుతోంది.

గత ఏడాది కాలంలో వందలాది ఇన్‌ఫ్రారెడ్ సీలింగ్ కెమెరాలు, అమెజాన్ ఉద్యోగులతో ప్రయోగాలు నిర్వహించారు. ఒకే రకంగా ఉన్న వస్తువులను, ఉదా: క్యాన్డ్ డ్రింక్స్, ఎలా గుర్తించాలి అన్నదానిపై పలు ప్రయోగాలు చేశారు.

షెల్ఫ్‌లో వస్తువులను తీసుకున్నది, పెట్టేసింది తెలుసుకోవడానికి వాటిలో వెయిట్ సెన్సర్లు పెట్టారు. మరికొన్ని వస్తువులను కెమెరాలు గుర్తించేందుకు వాటికి బార్ కోడ్ తరహాలో డాట్ కోడ్‌ను పెట్టారు.

Image copyright Reuters

దొంగలను ఇట్టే పట్టేస్తాయి

అయితే ఇవన్నీ ఎంత కచ్చితంగా పని చేస్తాయన్న దానిపై మాత్రం అమెజాన్ సమాధానం ఇవ్వడం లేదు.

ఒక జర్నలిస్టు సాఫ్ట్ డ్రింక్‌ను దొంగలించడానికి ప్రయత్నించినపుడు మాత్రం, అమెజాన్ సిస్టమ్ దానిని గుర్తించి, దాన్ని అతని బిల్లుకు జతచేసింది.

త్వరలో ఇలాంటి గో స్టోర్స్‌ను మరిన్ని ప్రారంభిస్తామని అమెజాన్ చెబుతోంది.

కొనుగోళ్లు ఎంత వేగంగా జరిగితే, కస్టమర్లు అంత వేగంగా వస్తారనేది రిటైల్ వ్యాపార రహస్యం.

సూపర్ మార్కెట్లలో పొడవాటి క్యూలను నివారించే ఇలాంటి స్టోర్స్‌కు భవిష్యత్తులో మంచి ఆదరణ లభించే అవకాశం ఉంది.

అమెజాన్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ బ్రియాన్ ఒల్సావ్ స్కీ, రాబోయే రోజుల్లో ఇలాంటి గో స్టోర్స్ మరిన్ని ప్రారంభిస్తామని సూచనప్రాయంగా తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

సంబంధిత అంశాలు