పాకిస్తాన్: 1150 డీఎన్ఏ పరీక్షల తర్వాత పట్టుబడ్డ జైనబ్ అనుమానిత హంతకుడు

  • 24 జనవరి 2018
పాకిస్తాన్ బాలిక జైనాబ్ అన్సారీ Image copyright Getty Images

పాకిస్తాన్‌లోని కసూర్ నగరంలో ఆరేళ్ల చిన్నారి జైనబ్ అన్సారీపై అత్యాచారం చేసి, హత్య చేసిన దారుణానికి సంబంధించి ప్రధాన అనుమానితుడిని అరెస్ట్ చేసినట్లు పాకిస్తాన్ అధికారులు చెప్పారు.

ఇమ్రాన్ అలీ అనే 24 ఏళ్ల యువకుడిని అరెస్ట్ చేశామని, అతడు వరుస హత్యలు చేస్తున్న సీరియల్ కిల్లర్ అని పంజాబ్ ముఖ్యమంత్రి షాబాజ్ షరీఫ్ పేర్కొన్నారు.

ఆయన లాహోర్‌లో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ అనుమానితుడు నేరాన్ని అంగీకరించాడని, అతడి డీఎన్‌ఏ నమూనాలు.. కసూర్‌లో నేరం జరిగిన ప్రాంతం నుంచి సేకరించిన నమూనాలతో సరిపోయాయని తెలిపారు.

ఈ అంశంపై నిందితుడి నుంచి కానీ, అతడి న్యాయవాదుల నుంచి కానీ ఇంకా స్పందన రాలేదు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionఆరేళ్ల చిన్నారి జైనబ్ హత్యతో అట్టుడికిన పాకిస్తాన్

లాహోర్‌కు దక్షిణంగా ఉన్న కసూర్ నగరంలో ఆరేళ్ల బాలిక జైనబ్ ఈ నెల ఆరంభంలో అదృశ్యమైంది. కొద్ది రోజుల తర్వాత ఆమె మృతదేహం చెత్త కుప్పలో కనిపించింది. గత రెండేళ్లలో ఇటువంటి హత్యలు మరికొన్ని జరిగినట్లు కసూర్ పోలీసులు చెప్తున్నారు.

జైనబ్ హత్యోదంతంపై పాకిస్తాన్ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. పోలీసుల అసమర్థతను నిరసిస్తూ అల్లర్లు జరగగా, పోలీసులతో జరిగిన ఘర్షణల్లో ఇద్దరు ఆందోళనకారులు చనిపోయారు.

గత ఏడాది ఫిబ్రవరిలో మరో బాలిక హత్యోదంతంలో అనుమానితుడు పోలీసుల నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నించగా పోలీసులు అతడిని కాల్చి చంపారు.

Image copyright CCTV images
చిత్రం శీర్షిక జైనాబ్ అని భావిస్తున్న బాలికను చేయిపట్టుకుని తీసుకెళుతున్న వ్యక్తి సీసీటీవీ దృశ్యం

ముదాసిర్ అనే సదరు అనుమానితుడు నిర్దోషా లేక నేరస్తుడా అనే అంశం మీద పాక్ పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. ఫిబ్రవరిలో అతడు చనిపోయిన తర్వాత జైనబ్ సహా నలుగురు బాలికలపై దాడులు జరిగాయి. వారిలో ముగ్గురు చనిపోయారు.

జైనబ్ అదృశ్యమైనట్లు తాము ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదని, బాలిక చివరిసారి కనిపించిన సీసీటీవీ దృశ్యాలను వెలికితీసింది కూడా తమ బంధువులేనని జైనబ్ కుటుంబం చెప్తోంది.

ఒక బాలికను ఒక వ్యక్తి చేయిపట్టుకుని తీసుకెళుతున్న సదరు సీసీటీవీ దృశ్యం సోషల్ మీడియాలో విస్తృతంగా పంపిణీ అయింది.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionఒడిలో పాపతో వార్తలు చదివిన పాక్ యాంకర్

నిందితుడిని పట్టుకునేందుకు 1,150 మంది డీఎన్‌ఏ నమూనాలను పరిశీలించినట్లు సీఎం షాబాజ్ షరీఫ్ తెలిపారు.

బాలిక తండ్రి అన్సారీ కూడా విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. కేసు దర్యాప్తుపై తనకు మొదట అభ్యంతరాలు ఉన్నప్పటికీ ఆ తర్వాత పురోగతి సంతృప్తికరంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

జియో న్యూస్ కథనం ప్రకారం.. అనుమానితుడు కుటుంబానికి బాగా తెలిసిన వ్యక్తే. అయితే అతడు తమ బంధువు అనే మాటను అన్సారీ తిరస్కరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)