నాడు దీపిక పదుకొణెకు సెక్యూరిటీ ఇచ్చి.. నేడు పద్మావత్‌ వ్యతిరేకంగా ఉద్యమం నడుపుతున్న రాజ్ షెకావత్

  • 25 జనవరి 2018
రాజ్ షెకావత్

ఇతను గుజరాత్ కర్ణిసేన ఛీఫ్ రాజ్ షెకావత్! అంతేకాదు..

''వైబ్రంట్ గుజరాత్" లాంటి ప్రభుత్వ సదస్సులకు, అహ్మదాబాద్‌లో కొన్ని షాపింగ్ మాల్స్‌కు రక్షణ కల్పించే సెక్యూరిటీ ఏజెన్సీ యజమాని కూడా..!

మాజీ బి.ఎస్.ఎఫ్. ఆఫీసర్ రాజ్ షెకావత్.. అహ్మదాబాద్‌లో ఓ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ నిర్వహిస్తున్నారు.

'పద్మావత్' సినిమాకు ముందు రాజ్ షెకావత్.. గుజరాత్ ప్రభుత్వానికి సన్నిహితుడిగా మాత్రమే తెలుసు. అందులోనూ.. వైబ్రంట్ గుజరాత్ లాంటి సదస్సులకు తరచూ సెక్యూరిటీ కల్పించే కంపెనీ యజమాని ఆయన.

కానీ ప్రస్తుతం .. పద్మావత్ సినిమాకు వ్యతిరేకంగా గుజరాత్‌లో ఉద్యమం నడుపుతున్న గుజరాత్ కర్ణిసేన అధ్యక్షుడు ఈ రాజ్ షెకావత్.

పద్మావత్ సినిమాకు వెళితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ప్రేక్షకులకు రాజ్ షెకావత్ చేసిన హెచ్చరిక వీడియో ఇంటర్నెట్లో ఉంది. పద్మావత్ సినిమాను ప్రదర్శించే థియేటర్లకు నిప్పంటిస్తామని కూడా ఆ వీడియోలో షెకావత్ హెచ్చరించారు.

కానీ ఈ హెచ్చరికల నేపథ్యంలో రాజ్ షెకావత్‌పై ఇంతవరకూ ఎటువంటి క్రిమినల్ కేసు నమోదు కాలేదు.

గతంలో దీపిక పదుకొణె అహ్మదాబాద్‌కు వచ్చినపుడు కూడా రాజ్ షెకావత్ సెక్యూరిటీ కంపెనీ ఆమెకు రక్షణగా బౌన్సర్స్‌ను ఏర్పాటు చేసింది. కానీ తర్వాతి కాలంలో.. పద్మావత్ సినిమాలో రాణి ‘పద్మిని’ పాత్రను కించపరుస్తోందని, ఆమె ముక్కు కోస్తామంటూ కర్ణిసేన కార్యకర్తలు ఆమెను హెచ్చరించారు.

ఎవరీ రాజ్ షెకావత్?

చేతి వేళ్లకు బంగారు ఉంగరాలు, ఒంటిపై బంగారు ఆభరణాలతో రాజ్ షెకావత్ కన్పిస్తారు. ఆయన ఫేస్ బుక్ పేజ్‌లో అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ ఏకె సింగ్‌తో కలిసి తీయించుకున్న ఫోటో కనిపిస్తుంది.

ఆయనకు రక్షణగా చుట్టూ 5మంది బాడీగార్డ్స్ ఉంటారు.

పర్యాటక కార్యక్రమాలకు, ఇతర ప్రభుత్వ సదస్సులకు రాజ్ షెకావత్ కంపెనీ భద్రతను కల్పిస్తోంది. మూడేళ్ల క్రితం ప్రారంభించిన ఈ కంపెనీ.. ఇలాంటి ఎన్నో ప్రభుత్వ కాంట్రాక్టులను సంపాదించింది.

అంతేకాకుండా.. అహ్మదాబాద్‌లో ఈయనకు ఓ హోటల్, జిమ్ కూడా ఉన్నాయి.

సెక్యూరిటీ ఏజెన్సీని ప్రారంభించడానికి ముందు కశ్మీర్‌లో బీఎస్ఎఫ్ జవాన్‌గా పనిచేసినట్టు రాజ్ షెకావత్ చెబుతున్నారు.

పద్మావత్ సినిమాకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభమయ్యాక.. న్యూస్ ఛానెళ్ల చర్చా కార్యక్రమాల్లో బిజీబిజీగా తిరుగుతున్నారు. ఆ స్టుడియోల నుంచే.. థియేటర్ల యజమానులను, ప్రేక్షకులను హెచ్చరిస్తున్నారు.

నేను హింసను ప్రోత్సహించను!

ఒకవైపు షాపింగ్ మాల్స్, మల్టిప్లెక్స్‌లకు తన కంపెనీ ద్వారా రక్షణ కల్పిస్తూ.. మరోవైపు పద్మావత్ సినిమాను ప్రదర్శించే థియేటర్లను దగ్ధం చేస్తామంటూ టీవీల్లో రాజ్ షెకావత్ బెదిరిస్తున్నారు.

''ధర్మం.. కర్మ.. రెంటినీ కలపి చూడకూడదు. రెండూ భిన్నమైనవి. ఒకటి నా వృత్తి.. రెండోది నా ఉద్యమం. నా మతాన్ని కాపాడుకోవడానికే నేను కర్ణిసేనలో పనిచేస్తున్నాను'' అని రాజ్ షెకావత్ చెబుతున్నారు.

''సినిమా థియేటర్లను ఎట్టి పరిస్థితుల్లో కాపాడాలని.. మా ఉద్యోగులకు చెప్పాను. ఒకవేళ అల్లర్లు జరిగి పరిస్థితి విషమిస్తే.. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కూడా వారిని హెచ్చరించాను'' అని వివరించారు.

పద్మావత్‌ సినిమాకు వ్యతిరేకంగా జరుగుతున్న హింసాత్మక ఘటనల గురించి ప్రశ్నిస్తే..

''ఈ అల్లర్లు చేస్తున్నవారెవరో నాకు తెలియదు. మేం ఆ సినిమాకు వ్యతిరేకం. కానీ.. ప్రేక్షకుల చేతిలో పువ్వులు ఉంచి ఆ సినిమాను చూడవద్దని శాంతియుతంగా వారిని కోరుతాం!'' అన్నారు.

తమ ఉద్యమానికి రాజకీయాలతో సంబంధం లేదన్నారు. అయితే.. తన వృత్తి విషయంలో మాత్రం కొందరు ప్రభుత్వ పెద్దలతో స్నేహపూర్వక సంబంధాలున్నాయని చెప్పారు.

అయితే.. 'కర్ణిసేన కార్యకర్తలు సృష్టిస్తోన్న అల్లర్లను నియంత్రించడానికి ఓ పోలీస్ ఉన్నతాధికారి తన సహాయం కోరారని' రాజ్ షెకావత్ చెప్పడం కొసమెరుపు.

ఇవి కూడా చదవండి:

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media caption'పద్మావత్' వివాదాలపై దీపిక ఏమన్నారంటే..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

సంబంధిత అంశాలు