వీడియో: చైనా ప్రయోగశాలలో తొలి క్లోన్ కోతుల సృష్టి

  • 26 జనవరి 2018
జోంగ్ జోంగ్, హువా హువా Image copyright Qiang Sun
చిత్రం శీర్షిక జోంగ్ జోంగ్, హువా హువా

అప్పట్లో డాలీ అనే గొర్రె పిల్లను క్లోన్ పద్ధతిలో సృష్టించడం గుర్తుందా? ఇప్పుడు అదే పద్ధతిని ఉపయోగించి చైనాలోని ఓ ప్రయోగశాలలో రెండు కోతులను సృష్టించారు.

పొడవాటి తోకతో ఒకేలా ఉన్న రెండు కోతులు జోంగ్ జోంగ్, హువా హువాలకు కొన్ని వారాల కిందటే చైనా ప్రయోగశాలలో ప్రాణం పోశారు.

మనుషులతో పోల్చితే కోతుల జన్యువులు ఒకేలా ఉన్ననేపథ్యంలో వ్యాధులపై పరిశోధనలకు ఈ ప్రయోగం ఎంతగానో ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: క్లోనింగ్‌తో సృష్టించిన కోతులు ఎంత క్యూట్‌గా ఉన్నాయో చూడండి!

''జన్యుపరమైన జబ్బులు, కేన్సర్, జీవక్రియ సంబంధిత వ్యాధులు, రోగనిరోధక లోపాల పరిశోధనకు ఈ ప్రయోగం ఊతమిస్తుంది'' అని చైనా అకాడమీలోని సైన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూరోసైన్స్ విభాగానికి చెందిన కియాంగ్ సన్ అన్నారు.

''మానవ జీవపరిణామ క్రమం గురించి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీని ద్వారా వాటికి సమాధానం తెలుసుకునే అవకాశం లభిస్తుంది'' అని పేర్కొన్నారు.

Image copyright Chinese Academy of Sciences
చిత్రం శీర్షిక సొమాటిక్ సెల్ న్యూక్లియర్ ట్రాన్స్‌ఫర్ టెక్నిక్‌లో తొలిసారి జోంగ్ జోంగ్‌ను సృష్టించారు.

8 వారాల కింద జోంగ్ జోంగ్ జన్మించగా, హువా హువా 6 వారాల కిందటే పుట్టింది.

ప్రస్తుతం రెండు కోతులకు ఆహారం అందిస్తున్నామని, అవి ఆరోగ్యంగానే ఉన్నాయని, వచ్చే కొన్ని నెలల్లో ఇదే తరహాలో మరికొన్ని కోతులను సృష్టించే అవకాశం ఉందని పరిశోధకులు అంటున్నారు.

ఇది మైలురాయేమీ కాదు!

లండన్‌లోని ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ప్రొఫెసర్ రాబిన్ లొవెల్ బాడ్జ్ మాత్రం ఈ క్లోనింగ్ పద్ధతి సరైంది కాదని, ఇదో ప్రమాదకర విధానం అని అన్నారు.

''మానవులను క్లోన్‌ చేసేందుకు ఉపయోగపడే గొప్ప మైలురాయిగా ఈ పద్ధతిని భావించలేం'' అని చెప్పారు.

కెంట్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ డారెన్ గ్రిఫిన్ దీనిపై స్పందిస్తూ.. ''మానవుల్లో వచ్చే వ్యాధుల పరిశోధనకు ఈ విధానం ఉపయోగపడొచ్చు కానీ, ఇలా క్లోనింగ్ చేయడం నైతికం కాదనే వాదనలు వినిపిస్తున్నాయి.

చాలా జాగ్రత్తగా పరిశీలించాకే నైతిక నిబంధలను రూపొందించి దానికి లోబడి ఇలాంటి పరిశోధలను నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించాలి'' అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఎడిన్‌బర్గ్‌లోని రోస్లిన్ యూనివర్సిటీలో 20 ఏళ్ల కిందటే డాలీ అనే గొర్రెపిల్లను క్లోన్ పద్ధతిలో సృష్టించారు. ఓ గొర్రె పొదుగులోంచి జీవకణం తీసుకొని శాస్త్రవేత్తలు డాలీకి ప్రాణంపోశారు.

Image copyright Science Photo Library
చిత్రం శీర్షిక 20 ఏళ్ల కిందటే క్లోనింగ్ పద్ధతిలో డాలీ అనే గొర్రె పిల్లను సృష్టించారు.

అప్పటి నుంచి చాలా మంది శాస్త్రవేత్తలు సొమాటిక్ సెల్ న్యూక్లియర్ ట్రాన్స్‌ఫర్ టెక్నిక్ (ఎస్సీఎన్‌టీ) అనే ఈ విధానం‌లో పశువులు, పందులు, కుక్కలు, పిల్లులు, ఎలుకలను సృష్టిస్తున్నారు.

జోంగ్ జోంగ్, హువా హువాలు ఇదే పద్ధతిలో సృష్టించిన మొట్టమొదటి కోతులు.

1999లో రీసెస్ కోతి గర్భాన్ని వేరు చేసి ఒకేలా ఉండే రెండు కోతులను క్లోన్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ పద్ధతిని టెట్రాగా పిలుస్తారు. ఈ విధానంలో ఓ కోతిని సృష్టించారు. అయితే అతిక్లిష్టమైన డీఎన్ఏ బదిలీ ప్రక్రియ ఈ విధానంలో లేదు.

అనేక వైఫల్యాలు

79 ప్రయత్నాల తర్వాత చైనా పరిశోధకులు జోంగ్ జోంగ్, హువా హువాలను సృష్టించారు. వేరే పద్ధతిలో మరో రెండు కోతులకు ప్రాణం పోసినా అవి బతకలేదు.

''క్లోనింగ్ కోసం అనేక పద్ధతులు అనుసరించాం. మా ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరికి ఈ ఒక్క పద్ధతి విజయవంతమైంది'' అని డాక్టర్ సన్ తెలిపారు.

Image copyright Chinese Academy of Sciences
చిత్రం శీర్షిక షాంఘైలోని ఓ ప్రయోగశాలలో క్లోన్ చేసిన కోతికి హువా హువా అనే పేరు పెట్టారు.

జంతువులపై ప్రయోగాలకు సంబంధించి ఐక్యరాజ్యసమితి జాతీయ ఆరోగ్య సంస్థ విధించిన నిబంధనలకు లోబడే తాము ప్రయోగాలు నిర్వహించామని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఈ క్లోనింగ్ ప్రక్రియలో పాల్గొన్న మరో పరిశోధకులు డాక్టర్ ముమింగ్ పో మాట్లాడుతూ, ''భవిష్యత్తులో మానవేతర క్షీరదాలను క్లోనింగ్ చేసేటప్పుడు శాస్త్రవేత్తలు కఠినమైన నైతిక నిబంధనలకు లోబడే పరిశోధనలు చేస్తారని మాకు తెలుసు'' అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)