#HerChoice: తిట్లు కూడా మహిళలకేనా!

  • 25 జనవరి 2018
మహిళ కార్టూన్

ఆ తిట్లు ఎంత అసహ్యంగా ఉన్నాయంటే, వాటిని ప్రస్తావించకపోవడమే మేలు. అవి ఎలా ఉంటాయో మీకూ తెలుసు, నాకూ తెలుసు.

ఆ తిట్ల అర్థాలు దేశంలోని వివిధ ప్రాంతాలను బట్టి మారుతుండవచ్చు.

కానీ వాటన్నిటిలో ఒకటి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ తిట్లు మహిళల శరీరాలను, వాళ్ల సంబంధాలను ఉద్దేశించి ఉంటాయి. కొన్నిసార్లు వాటిలో హింస ఉంటుంది. లైంగికార్థాలు ఉంటాయి.

ఆ తిట్లు మన భాషలో ఎంత సర్వసాధారణం అయిపోయాయంటే, అవి స్త్రీపురుషులిద్దరి మాటల్లో స్వేచ్ఛగా దొర్లుతుంటాయి.

కానీ ఒక రకంగా, ఆ తిట్లు మహిళలను పురుషులకన్నా కింది స్థాయిలో ఉంచుతాయి. చాలా మంది మహిళలను అవి అసహనానికి గురి చేస్తాయి.

బహుశా అందుకే మహిళల కోరికలు, వాళ్ల స్వేచ్ఛపై #HerChoice సిరీస్‌ను ప్రారంభించినపుడు అది చాలా మందికి నచ్చలేదు.

తమకు నచ్చిన విధంగా బతుకుతున్న కొందరు మహిళల జీవితాలపై బీబీసీ స్పెషల్ సిరీస్ #HerChoiceను ప్రారంభించినపుడు పాఠకుల ప్రతిస్పందనలు ఇవి.

మా పాఠకుల్లో ఒకరైన సీమా రాయ్ వాటిని చదివి, తిట్లలో మహిళలను ప్రస్తావించడంపై కామెంట్ చేశారు.

మహిళలకు ఏ విషయంపై అయినా ఒక అభిప్రాయాన్ని కలిగి ఉండే హక్కుంది. వాళ్లకు సొంతంగా మనసు, మెదడు ఉండవచ్చు కానీ అనేక విషయాలపై వాళ్లు నోరు మెదపకూడదనే పరిస్థితి ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.

ముఖ్యంగా మా మొదటి కథలో తన కోరికల గురించి స్వేచ్ఛగా తన అభిప్రాయాలను వ్యక్తం చేసిన కథనం గురించి ఆమె ప్రస్తావించారు.

శరీర వాంఛల విషయాల్లో మహిళల అభిప్రాయాలకు పెద్దగా విలువ ఇవ్వరని మీకు తెలుసు. విలువ ఇవ్వకపోవడమే కాదు, అది కేవలం పురుషులకే ప్రత్యేకమని భావించడం జరుగుతోంది.

Image copyright Getty Images

అందుకే విరాసినీ బాఘెల్ అనే పాఠకురాలు- ఈ కథ సమాజానికి మరో కోణాన్ని చూపుతుందని పేర్కొన్నారు.

తప్పులు ఎప్పుడూ మహిళల వైపు నుంచే కాదని, అవి మగాళ్ల వైపు నుంచి కూడా జరగవచ్చని, సమాజం కళ్లద్దాలు తీసేసి, తన దృక్పథాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఆమె వివరించారు.

ఈ సిరీస్‌లో ఉన్నవి నిజజీవితగాథలే కానీ మేం ఆ మహిళలకు కుటుంబం నుంచి సమాజం నుంచి ఇబ్బందులు రావచ్చని భావించి వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరిగింది.

కానీ ఈ కథనాలపై వస్తున్న ప్రతిస్పందనలు చాలా ధైర్యంగా ఉంటున్నాయి.

పూనం కుమారి గుప్త అనే పాఠకురాలు, ఈ కథనాలు ప్రజల ఆలోచనా విధానాన్ని మారుస్తాయో లేదో కానీ, కనీసం మహిళలు తమ గుండెల్లోని బాధలను చెప్పుకునే అవకాశం కల్పించాయని అన్నారు.

ఈ కథల్లోని మహిళలు తమ కుటుంబాలు గీసిన సరిహద్దులను చెరిపేశారు, సమాజం ఒత్తిళ్లను తట్టుకున్నారు. కేవలం తమ హృదయం, మెదడు చెప్పిన దానిని అనుసరించారు.

అందువల్లే ఈ కథనాలు వాళ్ల బాధలను వెల్లడిస్తే, మరికొందరికి అవి జీవితాన్ని భిన్నంగా జీవించడానికి అవసరమైన ధైర్యాన్ని ఇస్తున్నాయి.

ఎలాంటి ఆకర్షణ లేకుండా ఇద్దరు మహిళలు కలిసి జీవించాలనుకున్న మా రెండో కథను చదివి మీనాక్షి ఠాకూర్, జీవితాన్ని తమకు నచ్చినట్లు జీవించే ధైర్యం అందరికీ ఉండదని ప్రశంసించారు.

మీరు ఏం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో, మీకేం కావాలో స్పష్టంగా తెలిసినపుడు ఇలాంటి కథలు వస్తాయని అతియా రెహ్మాన్ రాశారు.

అర్థం చేసుకోవడం, ఆమోదించడం, తమ ప్రాధాన్యాలను నిర్ణయించుకోవడం అన్నది మన మహిళల్లో చాలా మందికి ఇంకా అలవాటు కాలేదు.

బహుశా అందుకే ఈ 12 నిజజీవితగాథలు వాళ్లకు ఆసక్తి కలిగిస్తుండవచ్చు. మహిళలు తమను గురించి తాము తెలుసుకోవడానికి, పురుషులకు మహిళల కోరికల గురించి తెలుసుకోవడానికి ఇది ఒక అవకాశం.

ఈ శనివారం, ఆదివారం మేం మరో రెండు తిరుగుబాటు కథలను ప్రచురిస్తాం. అవి మిమ్మల్ని షాక్‌కు గురి చేశాయా లేక స్ఫూర్తినిచ్చాయా అన్నది మాకు తెలపండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)