వీకెండ్‌లో విశ్రాంతి కోరుకునే మీకోసం ఓ పది విషయాలు

ఆసక్తిగా చూస్తున్న యువతి

ఫొటో సోర్స్, iStock

విశ్రాంతి విషయం మీద జరిగిన ప్రపంచంలోనే అతి పెద్ద సర్వే ‘ది రెస్ట్ టెస్ట్’లో 18 వేల మంది పాల్గొన్నారు.

ఇందులో పాల్గొన్నవారంతా తమకు అత్యంత విశ్రాంతినిచ్చే మూడు కార్యకలాపాలేంటో చెప్పారు. వాటన్నింటిలోనూ టాప్ 10 అంశాలుగా నిలిచినవి ఇవి. వీటి గురించి సర్వేలో పాల్గొన్న బీబీసీ రేడియో 4 ప్రజెంటర్ క్లాడియా హమ్మాండ్ ఇలా వివరిస్తున్నారు..

ఫొటో సోర్స్, iStock

1) చదవటం

సర్వేలో పాల్గొన్న వారిలో 58 శాతం మంది చదవటమే తమకు ఎక్కువ విశ్రాంతినిస్తుందని చెప్పారు. దీంతో ఈ సర్వేలో ఇదే టాప్‌గా నిలిచింది. జీవితంలో బాగా వృద్ధి చెందుతున్నామని భావిస్తున్న వారు చాలా మంది చదవటాన్ని ఎంచుకుంటారని తేలింది.

2) ప్రకృతితో గడపటం

ప్రకృతితో గడపటం వల్ల తమకు మేలు జరుగుతుందని చాలా మంది ప్రజలు భావిస్తారన్న పరిశోధనను బలపర్చేలా ఈ అంశం రెండో స్థానంలో నిలిచింది. అయితే, మగవారి కంటే మహిళలే దీన్ని ఎక్కువగా ఎంచుకున్నారు.

3) మీతో మీరు గడపటం

పది అత్యుత్తమ కార్యకలాపాల్లో ఎన్నింటిని ఒంటరిగా చేస్తుంటారు అని అడిగితే.. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలసి గడపటం అనేది ఈ జాబితాలో చివర్లో కనిపించింది.

బహిర్ముఖులుగా కనిపించేవాళ్లు సైతం ఇతరులతో కలసి గడపటం కంటే తమతో తాము గడపటమే ఎక్కువ విశ్రాంతినిచ్చే విషయమని చెప్పటం గమనార్హం. మహిళలు, 30 ఏళ్ల లోపువారు ఎక్కువగా దీన్ని ఎంచుకున్నారు.

ఫొటో సోర్స్, iStock

4) సంగీతం వినటం

మహిళలకంటే ఎక్కువగా మగవాళ్లు, పెద్దవాళ్ల కంటే ఎక్కువగా యువత దీన్ని ఎంచుకున్నారు.

5) ఇదీ అంటూ ఏదీ చేయకపోవటం

ఇది భలే తమాషా విషయం. 31 నుంచి 45 ఏళ్ల మధ్యలో ఉన్న వారు తప్ప మిగతా అంతా దీన్ని ఇష్టపడ్డారు. కొందరు మాత్రం ఇలా గడపటం చాలా కష్టమని చెప్పగా, 9 శాతం మందేమో ఈ రూపంలో విశ్రాంతి తీసుకోవటం తమను ఒత్తిడికి, అపరాధ భావనకు గురయ్యేలా చేసిందని చెప్పారు.

6) నడవటం

కొందరికి ఎక్కువ దూరం నడవటం ఇష్టం ఉండదు. కానీ, మరికొందరికి మాత్రం విశ్రాంతికి ఇదే సరైనదనిపిస్తుంది. ఇంకొందరు శారీరక వ్యాయామం ద్వారా మెదడును ప్రశాంతంగా ఉంచుకోవచ్చునని భావిస్తున్నారు. అయితే, 8 శాతం మంది మాత్రం రన్నింగ్ చేయటం విశ్రాంతినిస్తుందంటున్నారు.

7) స్నానం చేయటం

భిన్న వయస్కుల వారు భిన్నమైన అభిప్రాయాలతో ఉన్నప్పటికీ స్నానం చేయటం లేదా షవర్ కింద గడపటం అనేది విశ్రాంతినిస్తుందని చాలామంది భావించారు. ముఖ్యంగా 60 ఏళ్ల పైబడినవారు ఎక్కువ మంది దీన్ని ఎంచుకుంటే 18 నుంచి 30 ఏళ్ల మధ్యవారు మాత్రం దీన్ని తమ తమ జాబితాల్లో చివర్లో పెట్టారు.

ఫొటో సోర్స్, iStock

8) పగటి కలలు కనటం

మెదడు స్వప్నలోకాల్లో విహరించటం ఆరోగ్యానికి ఎంత వరకు మేలు చేస్తుంది? అన్నదానిపై సైకాలజిస్టులు చాలా ఏళ్లుగా సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. నిరాశగా ఉన్నవారు ప్రతికూల ఆలోచనల్ని నెమరువేసుకోవటం సహజమే కానీ, మెదడు ఊహల్లో తేలిపోవటం అనేది ఎక్కువగా జరుగుతుందని, దీనివల్ల మేలు జరగొచ్చని భావిస్తున్నారు.

9) టీవీ చూడటం

మగవాళ్లకంటే ఎక్కువగా మహిళలు, పెద్దల కంటే ఎక్కువగా యువత దీన్ని ఎంచుకుంటున్నారు. అయితే, ఏ వయస్సు వాళ్లలో చూసుకున్నా చదవటం అనేది టీవీ చూడటం కంటే ముందుంది.

10) ధ్యానం చేయటం

తోట పనులు చేయటం, స్నేహితులతో గడపటం, సెక్స్ కంటే కూడా చాలామంది ధ్యానం చేయటానికే ప్రాధాన్యం ఇచ్చారు. బహుశా ఒక దశాబ్దం కింద ఇలా ఉండేది కాదేమో.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)