ఎనిమిదేళ్ల తర్వాత చైనా స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఢమాల్!

  • మేరీ ఆన్ రుస్సాన్
  • బిజినెస్ రిపోర్టర్, బీబీసీ న్యూస్
ఫొటో క్యాప్షన్,

దాదాపు దశాబ్ద కాలంలో చైనా స్మార్ట్‌ఫోన్ మార్కెట్ పడిపోయింది.

చైనా స్మార్ట్‌ఫోన్ మార్కెట్ డీలాపడింది. మార్కెట్ విశ్లేషణ సంస్థ కెనలిస్ విడుదల చేసిన వివరాల ప్రకారం, ఎనిమిదేళ్ల పాటు వరుసగా పెరుగుతూ వచ్చిన అమ్మకాలు 2017లో ఒక్కసారిగా 4 శాతం తగ్గిపోయాయి.

ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఫోన్ మార్కెట్‌గా ఉన్న చైనాలో అమ్మకాలు పడిపోవడం ఎనిమిదేళ్లలో ఇదే మొదటిసారి.

చైనీస్ మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్ హవాయి, ఒప్పో, వివోల ఆధిపత్యం ఇప్పటికీ కొనసాగుతోంది.

దేశవ్యాప్తంగా మొత్తం మార్కెట్ నేలచూపులు చూస్తే, హవాయి మాత్రం రెండంకెల వృద్ధిని సాధించినట్టు కెనలిస్ నివేదిక వెల్లడించింది.

పరిస్థితులు మారిపోయాయి

2010 నుంచి 2015 వరకు ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో పోటీ యాపిల్.. సామ్‌సంగ్ మధ్యే ఎక్కువగా కనిపించేది.

అయితే.. గడిచిన రెండేళ్లలో పరిస్థితులు మారిపోయాయి. చైనా స్మార్ట్‌ఫోన్లు పుంజుకున్నాయి. అందుబాటు ధరలో.. ఆకట్టుకునే ఫీచర్లతో వచ్చిన బ్రాండ్లు వినియోగదారులను బాగానే ఆకర్షించాయి.

గతంలో చైనాలోని ప్రధాన నగరాలైన బీజింగ్.. షాంఘైలలో చాలా మంది వినియోగదారులు ఐఫోన్.. సామ్‌సంగ్ గెలాక్సీ వంటి స్మార్ట్‌ఫోన్లపై మోజు ఎక్కువ. అంత భారీ ధరలను భరించలేని పట్టణాలు.. గ్రామీణ ప్రాంతాల ప్రజలు మాత్రం ఫీచర్ ఫోన్లతోనే సరిపెట్టుకునేవారు.

దాంతో.. గ్రామీణ మార్కెట్‌లోకి వెళ్లేందుకు ఒప్పో, వివో సంస్థలు ఆన్‌లైన్‌లో కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున స్టోర్లను ఏర్పాటు చేశాయి. ఆ రెండు సంస్థల యజమాని బిలియనీర్ డ్వాన్ యాంగ్ పింగ్.

ఫలితంగా 2016లో చైనా స్మార్ట్‌ఫోన్ మార్కెట్ బాగానే పెరిదింది.

కౌంటర్‌పాయింట్ అధ్యయనం ప్రకారం, 2017 ఆగస్టు వరకు యాపిల్ ఐఫోన్లతో సమానంగా హవాయి ఫోన్లు అమ్ముడయ్యాయి. అంతకు ముందు 2016 ఆఖరి వరకు సామ్‌సంగ్‌ను దాటేసి ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో హవాయి అగ్రగామిగా నిలిచింది.

ఫొటో క్యాప్షన్,

చైనాలో బడ్జెట్ ఫోన్ల వాడకం పెరిగిపోయింది.

ఈ పతనానికి కారణమేంటి?

"ఇప్పుడు చాలా మంది వినియోగదారులు ఫీచర్ ఫోన్ల నుంచి తక్కువ ధరలో దొరికే స్మార్ట్‌ఫోన్లకు మారిపోయారు. ఇప్పుడు తమకు మరో ఫోన్ కొనాల్సిన అవసరం లేదని అంటున్నారు. అందుకే కొనుగోళ్లు పడిపోయాయి. మార్కెట్‌లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి" అని కెనలిస్‌లో పనిచేస్తున్న విశ్లేషకుడు మో జియా అభిప్రాయపడ్డారు.

కొన్నాళ్లుగా మార్కెట్‌లోకి వస్తోన్న బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లలో ఆకట్టుకునే ఫీచర్లుంటున్నాయి. గతంతో పోల్చితే ఇప్పుడు మన్నిక కూడా మెరుగైందని కెనలిస్ పేర్కొంది.

2019లో 5జీ ఫోన్లు వచ్చే వరకూ చైనా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ వృద్ధి చెందే సూచనలు కనిపించడంలేదని ఆ సంస్థ అభిప్రాయపడింది.

ఫొటో క్యాప్షన్,

ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్‌తో పోలిన ఫీచర్లున్నా.. హవాయి మేట్ 10 ప్రో ఫోన్ ధర 30% తక్కువగా ఉంది.

విదేశీ మార్కెట్లపైనే ఆశలు

దేశీయ మార్కెట్ ఆశాజనకంగా లేకపోవడంతో చైనీస్ సంస్థలు ఇతర దేశాల్లో విస్తరించడంపై దృష్టి సారిస్తున్నాయి. హవాయి, ఒప్పో, వివో సంస్థలకు 2018 కీలకం కానుంది.

"రష్యా, జపాన్‌లలో ప్రవేశించడంతో పాటు ఆగ్నేయాసియా దేశాల్లో మార్కెట్‌లోకి మరింత బలపడేందుకు ఒప్పో, వివో ప్రయత్నాలు చేస్తున్నాయి. భారత్‌లో షియోమీ ఇప్పటికే దూసుకెళ్తోంది. మరిన్ని స్టోర్లు తెరిచేందుకు ప్రయత్నిస్తోంది. థాయ్‌లాండ్‌కూ విస్తరించేందుకు సన్నాహాలూ చేస్తోంది" అని విశ్లేషకుడు మో జియా తెలిపారు.

హవాయి బడ్జెట్ ఫోన్లపై ఎక్కువగా దృష్టిపెడుతోంది. ఆగ్నేయాసియా, ఆఫ్రికా దేశాల్లో మరింత విస్తరించేందుకు ప్రణాళికలు వేస్తోంది.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)