అమెరికా: జిమ్నాస్టిక్స్ టీం డాక్టర్ లైంగిక వేధింపుల కేసులో బోర్డ్ రాజీనామా

  • 27 జనవరి 2018
ఒలింపిక్స్‌ పోటీలో ఓ అథ్లెట్ ప్రదర్శన Image copyright AFP
చిత్రం శీర్షిక లారీ నాసర్‌ తమను లైంగికంగా వేధించాడంటూ దాదాపు 160 మంది మహిళలు ఆరోపించారు.

జిమ్నాస్టిక్స్ అభ్యసిస్తున్న విద్యార్థినులను, క్రీడాకారిణులను లైంగికంగా వేధించిన ఓ డాక్టర్‌కు అమెరికా కోర్టు శిక్ష విధించిన నేపథ్యంలో జిమ్నాస్టిక్స్ బోర్డు (యూఎస్ఏజీ) సభ్యులు రాజీనామా చేశారు.

బోర్డు సభ్యులంతా రాజీనామా చేయాలని యూఎస్ ఒలింపిక్స్ కమిటీ ఇచ్చిన అల్టిమేటమ్‌కు తాము కట్టుబడి ఉంటామని యూఎస్ఏ జిమ్నాస్టిక్స్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.

జనవరి 31లోగా బోర్డులోని సభ్యులంతా రాజీనామా చేయాలని లేదంటే క్రీడల పాలనా విభాగంగా బోర్డు తన హోదాను కోల్పోవల్సి వస్తుందని ఒలింపిక్స్ కమిటీ అంతకు ముందు ఆదేశించింది.

Image copyright Reuters
చిత్రం శీర్షిక నాసర్ దుష్ప్రవర్తనపై ఫిర్యాదులు ఉన్నప్పటికీ తగిన చర్య తీసుకోలేదన్న విమర్శలు సైమన్‌పై ఉన్నాయి.

లారీ నాసర్ అనే మాజీ ఒలింపిక్స్ డాక్టర్ చాలా మంది యువ జిమ్నాస్ట్‌లను లైంగికంగా వేధించినట్టుగా రుజువు కావడంతో కోర్టు ఆయనకు 40 నుంచి 175 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ నేపథ్యంలోనే యూఎస్ఓసీ కఠినమైన దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

యూఎస్ఏజీ బోర్డుకు చెందిన ఐదుగురు డైరెక్టర్లు ఇప్పటికే రాజీనామా సమర్పించారు.

ఈ లైంగిక వేధింపుల కుంభకోణంలో భాగస్వామ్యం ఉన్నందుకు మిషిగన్ స్టేట్ యూనివర్సిటీ (ఎంఎస్‌యూ)కు చెందిన ఇద్దరు అధికారులు కూడా రాజీనామాలు సమర్పించారు.

Image copyright Reuters
చిత్రం శీర్షిక డాక్టర్ లారీ నాసర్‌పై 160 మంది మహిళలు వాంగ్మూలం ఇచ్చారు.

ఏంటీ కేసు?

లారీ నాసర్ (54) 1997-2016 మధ్య మిషిగన్ స్టేట్ యూనివర్సిటీలో పని చేశారు. 1996-2014 మధ్య యూఎస్ఏజీ కోసం జాతీయ కోఆర్డినేటర్‌గా కూడా వ్యవహరించారు.

దాదాపు 160 మంది మహిళలు ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. నాసర్ వేధింపులకు గురైన వాళ్లలో అన్ని వయసుల మహిళలు, ఒలింపియన్లు కూడా ఉన్నారు.

160 మంది బాధితుల వాంగ్మూలాలు తీసుకున్న తర్వాత కోర్టు నాసర్‌కు 40 నుంచి 175 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

నాసర్ క్షమాపణలో నిజాయితీ లోపించిందంటూ, 'శేష జీవితమంతా చీకటిలోనే గడపాలంటూ' కోర్టు ప్రకటించింది.

నాసర్‌కు అంతకు ముందే చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన మరో కేసులో 60 ఏళ్ల శిక్ష పడింది.

2015లో నాసర్ లైంగిక వేధింపుల గురించి తెలిసినప్పటికీ అధికారులను ముందే హెచ్చరించడంలో జాప్యం జరిగినట్టు జిమ్నాస్టిక్స్ బోర్డు అంగీకరించింది.

1997-2014 మధ్య లారీ నాసర్ లైంగిక దుష్ప్రవర్తన విషయంలో యువ మహిళా అథ్లెట్లు చాలా సార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ మిషిగన్ యూనివర్సిటీ అధికారులు నిర్లక్ష్యం వహించారు.

Image copyright Getty Images

ట్రీట్‌మెంట్ కోసమని పిలిచి..

నాసర్ బాధిత మహిళలందరి అనుభవాలూ దాదాపు ఒకే తీరుగా ఉన్నాయి. ఈ డాక్టర్ మహిళలను ట్రీట్‌మెంట్ పేరుతో పిలుస్తాడనీ, అక్కడ వారి అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని వారిని లైంగిక దోపిడీకి గురి చేస్తాడని పలువురు మహిళలు తెలిపారు.

వారిలో కొందరైతే మరీ చిన్న బాలికలు. 'చాలా ఏళ్ల తర్వాత గానీ తమపై జరిగింది లైంగిక అత్యాచారమని వారికి అర్థం కాలేద'ని ఓ బాధితురాలు కోర్టుకు తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)