అమెరికా: లైంగిక వేధింపుల ఆరోపణలతో 'కసీనో మొఘల్' స్టీవ్ విన్ రాజీనామా

  • 28 జనవరి 2018
స్టీవ్ విన్ Image copyright Getty Images
చిత్రం శీర్షిక కసీనో ప్రపంచంలో స్టీవ్ విన్ మకుటం లేని మహారాజు

లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో అమెరికా 'కసీనో మొఘల్' స్టీవ్ విన్ రిపబ్లికన్ నేషనల్ కమిటీ (ఆర్ఎన్‌సీ) ఆర్థిక వ్యవహారాల అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు.

76 ఏళ్ల బిలియనీర్ స్టీవ్ విన్ కొందరు మసాజ్ థెరపిస్టులను వేధించినట్టు, సిబ్బందిలో ఒకరిని బలవంత పెట్టి సెక్స్ చేసినట్టు వాల్‌స్ట్రీట్ జర్నల్ ఓ కథనం ప్రచురించింది.

అయితే తానే తప్పూ చేయలేదని, ఈ కథనాలు 'నిరాధారమైనవ'ని విన్ అన్నారు.

విన్ రాజీనామాను ఆమోదించినట్టు ఆర్ఎన్‌సీ అధ్యక్షురాలు రోనా మెక్‌డేనియల్ అమెరికా మీడియాకు తెలిపారు.

తనపై ఈ 'దుష్ప్రచారానికి' కారకురాలు తన మాజీ భార్య అని, ఆమెతో కోర్టులో పోరాడుతున్నందు వల్లే ఆమె ఈ పని చేశారని విన్ ఆరోపించారు.

"ఈ ఆరోపణలకు మూలం నా మాజీ భార్య ఎలేన్ విన్. ఆమెతో నేను తీవ్రమైన న్యాయపోరాటం చేస్తున్నాను" అని విన్ బృందం ఓ ప్రకటనలో పేర్కొంది.

ఆయనపై ఆరోపణలేంటి?

విన్‌తో పని చేసిన చాలా మందిని ఇంటర్వ్యూ చేసి ఈ కథనం రాసినట్టు వాల్‌స్ట్రీట్ జర్నల్ తెలిపింది. ఆయన తన ఆఫీసులో ఒంటరిగా ఉన్న సమయంలో తరచుగా మసాజ్ థెరపిస్టులను వేధించేవాడని ఆ పత్రిక రాసింది.

ఈ జూద పరిశ్రమ అధిపతి తనను సెక్స్‌కు బలవంతపెట్టారని ఓ మ్యానిక్యూరిస్ట్ (చేతుల్ని అందంగా తయారు చేసే వ్యక్తి) ఆరోపించగా, ఆమెకు 7.5 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 48 కోట్లు) చెల్లించినట్టు కోర్టు దస్తావేజులను ఉటంకిస్తూ ఆ పత్రిక రాసింది.

మహిళా ఉద్యోగులు ఆయనను చూడడానికే ఇబ్బంది పడేవారనీ, ఒంటరిగా అతడి ఎదుట పడడానికి భయపడి తోడుగా ఎవరైనా ఉంచుకునే వారని పత్రిక రాసింది.

ఆయన తమ సెలూన్‌కు వస్తున్నాడంటే కొందరు బాత్రూంలలో లేదా గదుల్లో దాగుండిపోయేవారని పత్రిక తెలిపింది.

రిపబ్లికన్ల 'మౌనం'పై డెమోక్రట్ల ధ్వజం

రిపబ్లికన్ పార్టీకి విన్ దాతగా, ఫండ్ రైజర్‌గా కూడా ఉన్నారు.

గత సంవత్సరం హాలీవుడ్ నిర్మాత హార్వే వైన్‌స్టీన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చినప్పుడు డెమోక్రటిక్ పార్టీ అతడి నుంచి స్వీకరించిన చందాలను వెనక్కి ఇచ్చెయ్యాలని రోనా మెక్‌డేనియల్ సహా పలువురు రిపబ్లికన్ నేతలు డిమాండ్ చేశారు.

"తాము చెప్పుకుంటున్నట్టుగా డెమోక్రట్లు నిజంగానే మహిళల పక్షం వహించే వాళ్లయితే ఈ కుళ్లు డబ్బును వెంటనే వెనక్కి ఇచ్చెయ్యాలి" అని మెక్‌డేనియల్ గడిచిన అక్టోబర్‌లో ఓ లేఖలో కోరారు.

మరిప్పుడు విన్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీకి కూడా అదే నిబంధన వర్తించాలి కదా అని డెమోక్రట్లు ప్రశ్నిస్తున్నారు.

ఆర్ఎన్‌సీ 'మౌనం' వహించడం పట్ల డెమోక్రటిక్ నేషనల్ కమిటీ తీవ్రంగా విమర్శించింది.

Image copyright Getty Images

ఎవరీ స్టీవ్ విన్?

  • ఈస్ట్ కోస్ట్ పేకాట క్లబ్బు నిర్వాహకుడి కుమారుడు. ఫోర్బ్స్ పత్రిక అంచనా ప్రకారం ఈయన ఆస్తి 3.5 బిలియన్ డాలర్లు.
  • భవన నిర్మాణ వ్యాపారంతో లాస్ వేగాస్‌లో పాటు గోల్డెన్ నగ్గెట్, ద మిరాజ్ వంటి ఎన్నో కసీనోలను నడిపించి భారీ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. వీటిని ఆ తర్వాత ఎమ్‌జీఎమ్ గ్రాండ్‌కు అమ్మేశారు.
  • తన మాజీ భార్య ఎలేన్ విన్‌తో ఆయన గత ఏడేళ్లుగా కోర్టులో పోరాడుతున్నారు. వీరిద్దరూ విన్ రిసార్ట్స్ సంస్థాపకులు.
  • పికాసో గీసిన ఓ చిత్రాన్ని 2016లో 139 మిలియన్ డాలర్లకు అమ్మే ప్రయత్నం చేస్తుండగా పొరపాటున మోచేయి తగలడంతో ఆ చిత్రం మధ్య భాగంలో కన్నం పడిన కారణంగా విన్ వార్తల్లో నిలిచారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

ముఖ్యమైన కథనాలు

అఫ్గానిస్థాన్ యుద్ధంలో రోజూ 74 మంది చనిపోతున్నారు... బీబీసీ పరిశోధనలో వెలుగు చూసిన వాస్తవాలు

ఆత్మహత్యలకు కారణమవుతున్న పురుగుమందులను భారత్ నిషేధించిందా?

పాకిస్తాన్‌లో హిందూ విద్యార్థిని అనుమానాస్పద మృతి... పోలీసుల నివేదికను తప్పుపట్టిన బాధితురాలి కుటుంబం

ఇ-సిగరెట్లపై కేంద్రం నిషేధం: వీటివల్ల ఎలాంటి ప్రమాదాలున్నాయి?

పీరియడ్ బ్లడ్ చూపిస్తే తప్పేంటి... శానిటరీ ప్యాడ్స్ యాడ్‌పై ఫిర్యాదులను తిరస్కరించిన ఆస్ట్రేలియా

చంద్రయాన్ 2: ఇస్రో విక్రమ్ ల్యాండర్‌తో మళ్లీ కనెక్ట్ అయ్యేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తోంది...

సౌదీ అరేబియా చమురు కేంద్రాలపై డ్రోన్ దాడుల వల్ల భారత్‌లో ధరలు పెరుగుతాయా?

క్యాన్సర్ చికిత్స పేరుతో యూట్యూబ్ నకిలీ వీడియోలతో సొమ్ము చేసుకుంటోందా?