టెన్నిస్: 20వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచిన ఫెదరర్

  • 28 జనవరి 2018
రోజర్ ఫెదరర్ Image copyright Getty Images

ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను స్విట్జర్లాండ్ ఆటగాడు రోజర్ ఫెదరర్ గెలుచుకున్నాడు.

ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను గెలుపొందటం ఫెదరర్‌కు ఇది ఆరోసారి. గ్రాండ్ స్లామ్ గెలవటం ఇది 20వ సారి.

ఆదివారం హోరాహోరీగా మూడు గంటల రెండు నిమిషాల పాటు సాగిన ఫైనల్ మ్యాచ్‌లో క్రొయేషియా ఆటగాడు మరిన్ సిలిక్‌పై 6-2, 6-7 (5-7), 6-3, 3-6, 6-1 తేడాతో గెలుపొందాడు.

20 లేదా అంతకంటే ఎక్కువ మేజర్ సింగిల్ టైటిళ్లు గెల్చుకున్న క్రీడాకారుల్లో 36 ఏళ్ల ఫెదరర్ నాలుగోవాడు. ఇంతకు ముందు మార్గరెట్ కోర్ట్, సెరెనా విలియమ్స్, స్టెఫీ గ్రాఫ్‌లు ఈ ఘనత సాధించారు.

Image copyright Getty Images

ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ అత్యంత వేడి, ఉక్కపోతల కారణంగా వార్తల్లోకి ఎక్కింది. ఈ నేపథ్యంలో మెల్‌బోర్న్‌లోని రాడ్ లావర్ ఎరీనాలో పైకప్పు కలిగిన టెన్నిస్ కోర్టులో ఈ మ్యాచ్ జరిగింది.

ఈ టోర్నమెంట్ జరుగుతున్నప్పుడు మెల్‌బోర్న్‌లో అత్యధిక ఉష్ణోగ్రత 41 డిగ్రీల సెంటీగ్రేడ్‌గా నమోదయ్యింది.

ఆదివారం దానికంటే కొంత తక్కువగా 37.5 సెంటీగ్రేడ్‌గా నమోదైనప్పటికీ తీవ్రమైన వాతావరణ నిబంధనను ప్రయోగించి పైకప్పును మూసేసి, మ్యాచ్‌ను నిర్వహించారు.

కాగా, ఆరుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలుపొందిన నోవాక్ జకోవిక్, రాయ్ ఎమర్సన్‌ల సరసన చేరిన ఫెదరర్.. రఫాల్ నడాల్‌ను వెనక్కు నెట్టాడు.

రోజర్ ఫెదరర్ గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు

  • వింబుల్డన్ 8
  • ఆస్ట్రేలియన్ ఓపెన్ 6
  • యూఎస్ ఓపెన్ 6
  • ఫ్రెంచ్ ఓపెన్ 1
Image copyright Getty Images

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)