స్వచ్ఛంద సంస్థకు శిరోజాలు దానం చేసిన డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జ్

  • 29 జనవరి 2018
డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జ్ Image copyright John Stillwell
చిత్రం శీర్షిక ఈ రాచ దానం ఇతరులు తమకు మద్దతునిచ్చేలా ప్రేరణనిస్తుందని స్వచ్ఛంద సంస్థ ఆశిస్తోంది

బ్రిటిష్ రాచకుటుంబంలోని డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జ్ కేథరీన్ తన శిరోజాలను కేన్సర్ చికిత్స తీసుకుంటూ జుట్టు రాలిపోయే చిన్నారులకు విగ్గులు అందించే ఒక స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇచ్చారు.

ఈ విరాళం గురించి తమకు శుక్రవారం తెలిసిందని, ఇది ఎంతో సంతోషాన్నిచ్చిందని 'ద లిటిల్ ప్రిన్సెస్ ట్రస్ట్' పేర్కొంది.

బ్రిటిష్ యువరాజు ప్రిన్స్ చార్లెస్, డయానాల పెద్ద కుమారుడు ప్రిన్స్ విలియం భార్య డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జ్.

డచెస్ దాతృత్వ చర్య ఇతరులు కూడా తమ సంస్థకు విరాళం ఇచ్చేలా ప్రేరణనిస్తుందని బ్రిటన్‌లోని హిర్‌ఫర్డ్‌లో గల ఈ సంస్థ మేనేజర్ మోనికా గ్లాస్ ఆశాభావం వ్యక్తంచేశారు.

పలు చిన్నారుల స్వచ్ఛంద సంస్థలకు డచెస్ మద్దతునిచ్చారని కెన్సింగ్‌టన్ ప్యాలెస్ చెప్పింది.

Image copyright Getty Images

డచెస్ ఎంత మొత్తం శిరోజాలు విరాళం ఇచ్చారనేది చెప్పటానికి ప్యాలెస్ అధికార ప్రతినిధి నిరాకరించారు.

అయితే.. కనీసం 7 నుంచి 12 అంగుళాల వరకూ గల ‘ఆరోగ్యవంతమైన శిరోజాల’ను తాము విరాళంగా స్వీకరిస్తామని ఈ సంస్థ పేర్కొంటోంది.

డచెస్ వచ్చే ఏప్రిల్‌లో మూడో బిడ్డకు జన్మనివ్వనున్నారు. ఆమె గత వేసవిలో పొట్టి జుట్టుతో కనిపించారు.

ఆమె విరాళానికి సంబంధించిన వాస్తవ వివరాలు వెల్లడించకుండా గోప్యంగా ఉంచారు.

విగ్గులు తయారు చేయటానికి విభిన్న దాతల జుట్టును కలుపుతారు.

"ఈ విధంగా స్వచ్ఛంద సంస్థకు మద్దతు ఇచ్చే ప్రతి ఒక్కరికీ మేం ఎంతో కృతజ్ఞులం. డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జ్ విరాళం ద్వారా ఇచ్చిన సందేశం.. శిరోజాలు కోల్పోయిన చిన్నారులందరికీ సాయం చేసేలా దోహదపడుతుందని మేం ఆశిస్తున్నాం" అని మోనికా గ్లాస్ పేర్కొన్నారు.

Image copyright PA
చిత్రం శీర్షిక డచెస్ ఇటీవల పొట్టి జుట్టుతో కనిపించారు

ఈ స్వచ్ఛంద సంస్థ.. క్యాన్సర్‌‌కు గురైన చిన్నారులు, యువతకు - 24 ఏళ్ల వయసు వరకూ ఉన్న వారికి - వారి చికిత్స సమయంలో, జుట్టు ఊడిపోయే సమయంలో అవసరమైనన్ని విగ్గులు అందిస్తూ సాయం చేస్తుంది.

2005లో చనిపోయిన హన్నా టార్ప్లీ అనే హిర్‌ఫోర్డ్ బాలిక జ్ఞాపకార్థం 2006లో ఈ సంస్థను స్థాపించారు. ఇప్పటి వరకూ 5,500 పైగా విగ్గులను ఈ సంస్థ అందించింది.

"అటువంటి కష్ట సమయంలో నిజమైన జుట్టుతో చేసిన విగ్గును ఉచితంగా అందుకోవటం ఆ చిన్నారి లేదా యువతపైన చాలా సానుకూల ప్రభావం చూపుతుంది" అని మోనికా గ్లాస్ చెప్పారు.

"ఈ విరాళం ఇతరులు కూడా ఛారిటీకి ఇదే తరహాలో మద్దతు ఇచ్చేలా ప్రోత్సాహాన్నిస్తుందని మేం ఆశిస్తున్నాం" అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం