యెమెన్: వేర్పాటువాదుల పట్టులో ప్రభుత్వ భవనాలు

  • 29 జనవరి 2018
యెమెన్ సంక్షోభం Image copyright EPA

యెమెన్‌ తాత్కాలిక రాజధాని అదెన్ నగరంలో ప్రభుత్వ భవనాలను వేర్పాటువాదులు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ దళాలకు, ఆందోళనకారులకు మధ్య ఆదివారం తీవ్ర సంఘర్షణ చోటుచేసుకుంది.

ఈ ఘర్షణల్లో కనీసం పదిమంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు.

ఈ పరిణామాలు హుతీ తిరుగుబాటుదారులకు అనుకూలంగా మారే ప్రమాదం ఉందని యెమెన్ ప్రధాని అహ్మద్ బిన్ డాఘర్ ఆందోళన వ్యక్తం చేశారు.

యెమెన్ రాజధాని సనా నగరం 2014 నుంచి హుతీ తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉంది. దాంతో దక్షిణాన ఉన్న అదెన్‌ నగరం దేశ తాత్కాలిక రాజధానిగా కొనసాగుతోంది. అధ్యక్షుడు హాది నేతృత్వంలో ప్రభుత్వ కార్యకలాపాలు ఇక్కడి నుంచే జరుగుతున్నాయి.

అయితే దాడులను ఆపాలని ఆదివారం సాయంత్రం ఇరు వర్గాలు తమ తమ బలగాలకు పిలుపునిచ్చాయి. పొరుగున ఉన్న అరబ్ దేశాలు జోక్యం చేసుకుని ఈ పరిస్థితిని చక్కదిద్దాలని యెమెన్ ప్రభుత్వ బలగాలు విజ్ఞప్తి చేశాయి.

కొన్నేళ్లుగా కొనసాగుతున్న అంతర్యుద్ధం కారణంగా యెమెన్‌లో ఇప్పటికే లక్షలాది మంది ప్రజలు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. తాజా ఘర్షణలు పరిస్థితిని మరింత జటిలంగా మార్చాయి.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionయెమెన్‌లో ఆకలి కేకలు

అదెన్‌లో ఏం జరుగుతోంది?

1990లో దక్షిణ యెమెన్, ఉత్తర యెమెన్‌లను కలిపి యెమెన్‌గా మార్చారు. అయితే దక్షిణ యెమెన్ స్వతంత్ర దేశంగానే ఉండాలన్న వేర్పాటువాదం మాత్రం సమసిపోలేదు.

హూతీ తిరుగుబాటుదారులను ఎదుర్కొనేందుకు ఇన్నాళ్లూ ఇక్కడి వేర్పాటువాదులు ప్రభుత్వానికి అండగా నిలుస్తూ వచ్చారు.

కానీ తాజాగా పరిస్థితులు మారిపోయాయి. ప్రభుత్వం అవినీతిమయంగా మారిందని, పక్షపాత వైఖరి అవలంబిస్తోందంటూ రెండు వారాల క్రితం వేర్పాటువాదులు తీవ్ర ఆరోపణలు చేశారు.

ప్రధాని డాఘర్‌తో పాటు ఆయన మంత్రివర్గాన్ని తొలగించాలని అధ్యక్షుడు హాదికి గడువు విధించారు. అది ఈ ఆదివారం ముగియడంతో తాజా హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

ఈ ఘటనల్లో కనీసం పది మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. నగరంలో పలు చోట్ల కాల్పులు, పేలుళ్లు జరిగాయని ప్రత్యక్షసాక్షులు వెల్లడించారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionExclusive: యెమెన్‌లో తిరుగుబాటు ద‌‌‌ృశ్యాలు (పాత వీడియో)

యూఏఈ పాత్ర ఏంటి?

హుతీ తిరుగుబాటుదారులను ఎదుర్కొనే ఒప్పందంలో భాగంగా, దక్షిణాది వేర్పాటువాదులకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మద్దతు ఇస్తోంది.

శాంతి నెలకొనేందుకు యూఏఈ తక్షణమే చర్యలు చేపట్టాలని యెమెన్ ప్రధాని డాఘర్ కోరారు. లేదంటే తాజా ఘర్షణలు హుతీ తిరుగుబాటుదారులకు అనుకూలంగా మారే అవకాశం ఉందన్నారు.

మరోవైపు, ప్రభుత్వ బలగాలు వెనక్కి తగ్గాలని సౌదీ అరేబియాలో ఉన్న యెమెన్ అధ్యక్షుడు హాది పిలుపునిచ్చారు.

అయితే సౌదీ, యూఏఈ నుంచి వెళ్లిన భద్రతా దళాలు తాజా ఘర్షణలో పాల్గొనలేదని తెలుస్తోంది.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionయెమెన్‌లో యుద్ధం ప్రళయాన్ని సృష్టిస్తోంది. 20 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.

దేశంలోని ఇతర ప్రాంతాల పరిస్థితి ఏంటి?

ఇప్పటికీ యెమెన్ రాజధాని సనాతో పాటు దేశ వాయవ్య ప్రాంతాలు హుతీల ఆధీనంలోనే ఉన్నాయి. 2014లో సనాను స్వాధీనం చేసుకున్నారు. దాంతో హుతీ తిరుగుబాదారులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వానికి మద్దతుగా సౌదీ నేతృత్వంలో కూటమి ఏర్పడింది.

ఏళ్ల తరబడి యెమెన్‌లో చోటు చేసుకుంటున్న భయానక పరిణామాలు "తీవ్రమైన మానవ సంక్షోభానికి" దారితీశాయని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది.

దాదాపు 2 కోట్ల 22 లక్షల మంది సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వారిలో 84 లక్షల మంది తీవ్ర ఆకలితో అలమటిస్తూ పోషకాహార లోపంతో కొట్టుమిట్టాడుతున్నారు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)