ఫెజంట్ ఐలాండ్: ఆరు నెలలు ఫ్రాన్స్ చేతిలో.. ఆరు నెలలు స్పెయిన్ నియంత్రణలో

  • 30 జనవరి 2018
బిడసోవా నది మధ్యలో ఉన్న ఫెజంట్ ఐలాండ్ Image copyright Alamy
చిత్రం శీర్షిక బిడసోవా నది మధ్యలో ఉన్న ఫెజంట్ ఐలాండ్

ఐరోపాలో ఆరు నెలలకోసారి దేశం మారే ఒక దీవి కథ ఇది. ప్రస్తుతం తన భూభాగంగా ఉన్న ఈ దీవిని ఫ్రాన్స్, వచ్చే వారం స్పెయిన్‌కు అప్పగిస్తుంది. ఆరు నెలల తర్వాత స్పెయిన్ దీనిని తిరిగి ఫ్రాన్స్‌కు ఇచ్చేస్తుంది.

ఒక్క తూటా పేలకుండా, రక్తపు చుక్క చిందకుండా శాంతియుతంగా రెండు దేశాలు దీవిని మార్చుకుంటాయి.

350 సంవత్సరాలకు పైగా ప్రతి ఆరు నెలలకోసారి దీవిపై అధికార మార్పిడి జరుగుతోంది.

ఈ దీవి పేరు - ఫెజంట్ ఐలాండ్. దీని విస్తీర్ణం దాదాపు 3,200 చదరపు అడుగులు. ఫ్రాన్స్, స్పెయిన్ మధ్య సరిహద్దుగా ఉన్న బిడసోవా నదిలో ఈ దీవి ఉంది. ఫ్రెంచ్‌లో దీనిని ఫైజన్స్ దీవిగా వ్యవహరిస్తారు.

చిత్రం శీర్షిక ఫెజంట్ ఐలాండ్ ఉన్న ప్రాంతాన్ని సూచించే మ్యాప్

ఫ్రాన్స్ ప్రధాన భూభాగానికి దిగువన, స్పెయిన్ ప్రధాన భూభాగానికి ఎగువన ఫెజంట్ ఐలాండ్ ఉంది. ఫ్రాన్స్ సరిహద్దుల్లో హెండయే ప్రాంతం ఉంది. స్పెయిన్ సరిహద్దుల్లో హోండరిబియా, ఇరున్ పట్టణాలు ఉన్నాయి.

ఈ ప్రాంతాల మధ్యలో రెండు దేశాల నడుమ బిడసోవా నది ప్రవహిస్తుంది.

ఫ్రాన్స్-స్పెయిన్ సరిహద్దులకు వెళ్లి, ''ఫెజంట్ ఐలాండ్‌కు దారేది'' అని అడిగితే, ''అక్కడ నీకేం పని? అక్కడ మనుషులెవరూ ఉండరు. అక్కడ చూసేదేమీ ఉండదు. అదేమీ 'మోంట్ సెయింట్ మిషెల్' మాదిరి పర్యాటక కేంద్రం కాదు'' అని స్థానికులు సమాధానమిచ్చారు.

నది మధ్యలో ప్రశాంతంగా ఉంది ఫెజంట్ ఐలాండ్‌. దీవి నిండా చెట్లు ఉన్నాయి. గడ్డి చక్కగా కత్తిరించి ఉంది. 1659లో ఈ దీవిలో జరిగిన ఒక చరిత్రాత్మక ఘటనకు గుర్తుగా స్మారక చిహ్నం ఉంది.

ఫెజంట్ ఐలాండ్‌పై నియంత్రణ కోసం ఫ్రాన్స్, స్పెయిన్ మధ్య సుదీర్ఘకాలం యుద్ధం సాగింది. ఈ యుద్ధానికి ముగింపు పలికేందుకు మూడు నెలలపాటు ఉభయ దేశాలు చర్చలు జరిపాయి. అప్పట్లో రెండు దేశాల వైపు నుంచి దీవి వరకు చెక్క వంతెనలు నిర్మించారు. చర్చలు మొదలైన సమయంలో రెండు వైపులా రెండు దేశాల సైన్యాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయి.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక 1660‌ జూన్‌ 6న ఫెజంట్ ఐలాండ్‌లో సమావేశమైన ఫ్రాన్స్ రాజు లూయి XIV, స్పెయిన్ రాజు ఫిలిప్ IV

శాంతి ఒప్పందం.. రాజ వివాహం

చర్చల అనంతరం ఫ్రాన్స్, స్పెయిన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. దీనిని 'ట్రీటీ ఆఫ్ ద పిరినీస్' అంటారు. ఈ ఒప్పందం ప్రకారం రెండు దేశాలు దీవిని మార్చుకుంటాయి. సరిహద్దులను అందుకు అనుగుణంగా నిర్వచించారు.

శాంతి ఒప్పందం సందర్భంగా రాజ వివాహం జరిగింది. స్పెయిన్ రాజు ఫిలిప్ IV కుమార్తెను ఫ్రాన్స్ రాజు లూయీ XIV పెళ్లి చేసుకున్నారు.

శాంతి ఒప్పందం ప్రకారం ఫెజంట్ ఐలాండ్ ఫిబ్రవరి 1 నుంచి జులై 31 వరకు స్పెయిన్ పాలనలో, ఆగస్టు 1 నుంచి జనవరి 31 వరకు ఫ్రాన్స్ ఏలుబడిలో ఉంటుంది. ప్రతి ఆరునెలలకోసారి ఇలా అధికార మార్పిడి జరుగుతుంటుంది.

ప్రపంచంలో అత్యంత సుదీర్ఘకాలంగా రెండు దేశాలు సార్వభౌమాధికారాన్ని కలిగి ఉన్న భూభాగాల్లో ఈ దీవి ఒకటి.

చిత్రం శీర్షిక ఫెజంట్ ఐలాండ్‌లోని స్మారక చిహ్నం

సాంకేతికంగా చూస్తే ఫ్రాన్స్‌లోని బయోనే, స్పెయిన్‌లోని సాన్ సెబాస్టియన్ పట్టణం నౌకాదళ కమాండర్లు ఫెజంట్ ఐలాండ్‌కు గవర్నర్లుగా లేదా వైస్రాయ్‌లుగా వ్యవహరిస్తారు.

వాస్తవానికి ఫ్రాన్స్‌లోని హెండయే, స్పెయిన్‌లోని ఇరున్ పట్టణాల మేయర్లు ఈ దీవి వ్యవహారాలు చూసుకుంటారు.

హెండయే కౌన్సిల్‌ ఏడాదికి ఒకసారి ఈ దీవికి కొంత మంది సిబ్బందిని పడవలో పంపించి, అక్కడ గడ్డిని కత్తిరించే పని చేయిస్తుంటుంది. పరిమితికి మించి, అడ్డదిడ్డంగా పెరిగిన చెట్ల కొమ్మలను కూడా ఈ సిబ్బందే నరికేస్తారని హెండయే కౌన్సిల్‌లో పార్కుల నిర్వహణ వ్యవహారాలు చూసే బెనాయిట్ ఉగర్టెమెండియా చెప్పారు.

స్పెయిన్ వైపు నుంచి అయితే కొన్ని సమయాల్లో నడిచి కూడా ఈ దీవిని చేరుకోవచ్చు. దీవిలో అక్రమంగా తిష్టవేసే వారిని స్పెయిన్ పోలీసులు తరిమేస్తుంటారు.

దీవి 200 మీటర్లకు పైగా పొడవు, 40 మీటర్ల వెడల్పు ఉంటుంది.

ఆసక్తి చూపని యువత

ఫెజంట్ ఐలాండ్‌లో అరుదుగా నిర్వహించే కొన్ని కార్యక్రమాలకు సాధారణ ప్రజలను కూడా అధికారులు ఆహ్వానిస్తుంటారు.

వీటికి పెద్ద వయసువారే హాజరవుతుంటారని, యువతకు ఈ దీవి చారిత్రక ప్రాధాన్యం గురించి తెలియదని బెనాయిట్ చెప్పారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక స్పెయిన్ అంతర్యుద్ధం కాలంలో ఒక శిశువును తీసుకొని ప్రాణాలకు తెగించి అంతర్జాతీయ వంతెనపై ఫ్రాన్స్‌లోని హెండయే నుంచి స్పెయిన్‌లోని ఇరున్ వైపు వెళ్తున్న జర్నలిస్టు రేమండ్ వాకర్

భూమార్గంలో ఫ్రాన్స్ నుంచి స్పెయిన్‌కు వెళ్లడం ఈ రోజుల్లో చాలా తేలిక. గత శతాబ్దంలో స్పెయిన్‌, ఫ్రాన్సిస్కో ఫ్రాంకో నియంతృత్వంలో ఉన్నప్పుడు ఈ రెండు దేశాల సరిహద్దులో భద్రతా సిబ్బంది పెద్ద సంఖ్యలో ఉండేవారు.

ఫెజంట్ ఐలాండ్‌కు సమాంతరంగా, నది వెంబడి ప్రతీ వంద మీటర్లకు ఒకటి చొప్పున సెంట్రీ పాయింట్లు ఉండేవని హెండయే మేయర్ కోటే ఎసెనారో తెలిపారు. నియంత ప్రత్యర్థులు ఎవరూ స్పెయిన్ వీడి వెళ్లకుండా, స్పెయిన్ లోపలకు రాకుండా నియంత్రించేందుకు అప్పట్లో ఈ ఏర్పాటు చేశారని వెల్లడించారు.

ప్రస్తుత కాలంలో ఇరున్, హెండయే మేయర్లు సంవత్సరంలో ఇంచుమించు పన్నెండుసార్లు సమావేశమవుతారు. నీటి నాణ్యత, చేపల వేటపై హక్కులు, ఇతర అంశాలపై చర్చలు జరుపుతారు.

సగానికి సగం తగ్గిన దీవి విస్తీర్ణం

లోగడ ఫ్రాన్స్ పడవల ఆకృతిపై స్పెయిన్ మత్స్యకారులు అభ్యంతరాలు చెప్పేవారు. ఇప్పుడు ఫ్రాన్స్ పర్యాటకులు 'కనూ' అనే చిన్నపాటి పడవల్లో విహార యాత్రలు చేపడుతున్నారని, వీరి కారణంగా చేపల వేటలో తమకు సమస్యలు ఎదురవుతున్నాయని విచారం వ్యక్తంచేస్తున్నారు.

ఈ దీవికి రెండు దేశాల దృష్టిలో ప్రాధాన్యం తగ్గిపోతోంది.

పిరినీస్ పర్వతాల్లోని మంచు కరిగి బిడసోవా నదిలోకి చేరుతోంది. నదిలో ప్రవాహ మట్టం పెరిగి దీవి కోతకు గురవుతోంది.

కొన్ని శతాబ్దాల కాలంలో దీవి విస్తీర్ణం దాదాపు సగానికి సగం తగ్గిపోయింది. దీవిని రక్షించే ఏర్పాట్ల కోసం నిధులు వెచ్చించేందుకు ఫ్రాన్స్, స్పెయిన్ రెండూ సిద్ధంగా లేవు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ఈ కథనం గురించి మరింత సమాచారం