బీబీసీ పరిశోధన: అఫ్ఘానిస్తాన్‌లో 70 శాతం భూభూగంపై తాలిబాన్‌‌‌ పట్టు

  • షోయబ్ షరీఫీ, లూయీస్ ఆదామూ
  • బీబీసీ వరల్డ్ సర్వీస్, కాబూల్
తాలిబాన్

తాలిబాన్ మిలిటెంట్ల ఏరివేత కోసం అమెరికా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా, ఇప్పటికీ అఫ్ఘానిస్తాన్‌లో దాని పట్టు గణనీయంగానే ఉందని బీబీసీ పరిశోధనలో తేలింది.

అఫ్ఘానిస్తాన్‌లోని 70 శాతం భూభాగంపై ప్రస్తుతం తాలిబాన్ మిలిటెంట్ గ్రూప్ క్రియాశీలంగా ఉంది.

2014లో విదేశీ బలగాలు వెనుతిరిగినప్పటితో పోల్చితే ఇప్పుడు దేశంలోని మరిన్ని ఎక్కువ ప్రాంతాల్లో తాలిబాన్ల ప్రాబల్యం ఉంది. బీబీసీ కొన్ని నెలల పాటు దేశవ్యాప్తంగా నిర్వహించిన పరిశోధనలో ఈ వాస్తవాలు బయటపడ్డాయి.

అధిక శాతం ప్రాంతాల్లో పరిస్థితులు తమ నియంత్రణలోనే ఉన్నాయంటూ అఫ్ఘాన్ ప్రభుత్వం నివేదికను విడుదల చేసింది.

కానీ, ఇటీవల దేశ రాజధాని కాబూల్‌తో పాటు, ఇతర ప్రాంతాల్లో తాలిబాన్, ఇస్లామిక్ స్టేట్ గ్రూపు మిలిటెంట్లు తామే జరిపామని ప్రకటించిన దాడుల్లో వందల మంది ప్రాణాలు కోల్పోయారు.

తాలిబాన్లతో చర్చలు జరపడం లేదని అఫ్ఘాన్ అధికారులతో పాటు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా అన్నారు.

మిలిటెంట్ల ఏరివేత పూర్తయ్యే వరకూ తమ మిలిటరీ అఫ్ఘాన్ నుంచి వెనక్కి రాదని ట్రంప్ గత ఏడాది ప్రకటించారు.

బీబీసీ పరిశోధనలో బయటపడ్డ మరో విషయం ఏమిటంటే, గతంలో ఎన్నడూ లేని విధంగా అఫ్ఘానిస్తాన్‌లో ఐఎస్ పట్టు కూడా పెరిగింది. అయితే, తాలిబాన్‌తో పోల్చితే మాత్రం దాని ప్రభావం చాలా తక్కువగానే ఉంది.

తాలిబాన్ పట్టులోఏయే ప్రాంతాలున్నాయి?

బీబీసీ అధ్యయనంలో వెల్లడైన వివరాల ప్రకారం, ప్రస్తుతం 14 జిల్లాలు (దేశంలో 4 శాతం భూభాగం) పూర్తిగా తాలిబాన్ నియంత్రణలో ఉన్నాయి. మిగతా 263 జిల్లాల్లో (66 శాతం) గతంతో పోల్చితే తాలిబాన్ల బలం బాగా పెరిగింది. ఇక్కడ వారు నిత్యం దాడులు చేస్తూ తమ ఉనికిని చాటుకుంటున్నారు.

మొత్తంగా దాదాపు కోటిన్నర మంది ప్రజలు (దేశ జనాభాలో సగం) తాలిబాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నారు.

"బాంబు పేలుళ్లు, ఉగ్రదాడులు, తాలిబాన్ మా నిత్య జీవితంలో భాగమయ్యాయి. ఇంటి నుంచి బయటకు వెళ్తే తిరిగి ప్రాణాలతో వస్తామో లేదో చెప్పలేం" అని షిందాండ్ పట్టణానికి చెందిన సర్దార్ ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో దేశ దక్షిణాది ప్రాంతాలకే పరిమితమైన తాలిబాన్, క్రమంగా తూర్పు, పశ్చిమ, ఉత్తర ప్రాంతాలకూ విస్తరించిందని బీబీసీ అధ్యయనంలో స్పష్టంగా అర్థమవుతోంది.

అఫ్ఘానిస్తాన్‌లో అధికారంలో ఉన్న తాలిబాన్లను 2001లో అమెరికా దళాలు ప్రవేశించి ఓడించాయి. 2001 నుంచి 2014 మధ్య కాలంలో తాలిబాన్లు జరిపిన దాడుల్లో 450 మందికి పైగా బ్రిటిష్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు.

అఫ్ఘాన్ నుంచి 2014లో అమెరికా దళాలు వెనక్కి వెళ్లిపోయాయి. ఆ తర్వాత తాలిబాన్లు మళ్లీ తమ పట్టును క్రమంగా పెంచుకున్నట్టు వెల్లడైంది.

ఫొటో సోర్స్, AFP

వారంలో రెండు దాడులు

బీబీసీ అధ్యయనం జరిగిన వ్యవధిలో కనీసంగా మూడు నెలలకో దాడి (తాలిబాన్లకు పట్టు తక్కువున్న ప్రాంతాల్లో) నుంచి వారంలో రెండు దాడులు (గట్టి పట్టున్న ప్రాంతాల్లో) జరిగాయి.

పరిశీలన వ్యవధిలో 122 జిల్లాల్లో తాలిబాన్ దాడులు జరగలేదు. ఈ ప్రాంతాలు పూర్తిగా తమ నియంత్రణలో ఉన్నాయని అఫ్ఘాన్ ప్రభుత్వం చెబుతోంది. అలా అని ఇక్కడ శాంతియుత వాతావరణం ఏమీ లేదు.

కాబూల్‌తో పాటు దేశంలోని ఇతర ప్రధాన పట్టణాలు, నగరాల్లో పరిస్థితిలో మార్పులు కనిపించలేదు.

నగరంలో ఎప్పుడు దాడి జరుగుతోందో అన్న భయంతో తాము రాత్రిళ్లు నిద్ర కూడా పోవట్లేదని చాలా మంది చెబుతున్నారు.

తాలిబాన్ల వసూలు చేసే పన్నులు కూడా పెరిగినట్టు బీబీసీ అధ్యయనంలో ఆధారాలు బయటపడ్డాయి. తమ ప్రభావిత జిల్లాల్లో రైతుల నుంచి, స్థానిక వ్యాపారుల నుంచి, రవాణా వాహనాల నుంచి మిలిటెంట్లు బలవంతంగా వసూళ్లు చేస్తారు.

"మేము విద్యుత్ సరఫరా చేస్తుంటే.. ప్రజల నుంచి వాళ్లు బిల్లులు వసూలు చేసుకుంటున్నారు’’ అని స్వయంగా దక్షిణాది జిల్లాకు చెందిన ఓ ఉన్నతాధికారే చెప్పారు.

బీబీసీ నిర్వహించిన ఈ అధ్యయనాన్ని కాబూల్ కేంద్రంగా పనిచేసే విశ్లేషకులు సమీక్షిస్తున్నారు.

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్,

కాబూల్: ఆత్మాహుతి దాడి జరిగిన ప్రాంతంలో..

2014 తర్వాత పెరిగిన హింస

2014లో అంతర్జాతీయ బలగాలు అఫ్ఘాన్ నుంచి వెనక్కి వెళ్లిపోవడంతో పరిస్థితులు హింసాత్మకంగా మారాయి.

ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం, కేవలం 2017లో తొలి మూడు త్రైమాసికాల వ్యవధిలో 8,500 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు, అనేక మంది క్షతగాత్రులయ్యారు.

ఎక్కువగా తీవ్రవాదుల దాడుల్లోనే మరణిస్తున్నారు. అలాగే, అమెరికా నేతృత్వంలోని బలగాలు చేస్తున్న ప్రతిదాడులతోనూ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

ఐఎస్ బలమెంత?

ఇటీవల కాబూల్‌ లాంటి ప్రాంతాల్లో దాడులకు దిగింది తామేనంటూ ఐఎస్ ప్రకటించింది. దేశంలోని దాదాపు 30 జిల్లాల్లో ఐఎస్ ఉందని స్థానికులు, అధికారులు బీబీసీకి తెలిపారు.

ఇక్కడి ప్రాంతాల్లో పట్టు సాధించేందుకు మిలిటరీ బలగాలతో పాటు, తాలిబాన్లతోనూ ఐఎస్ పోరాడుతోంది.

2017లో ఈ సంస్థ దాడులు బాగా పెరిగిపోయాయి. ప్రధాన కేంద్రాలు, షియా ముస్లింల ప్రాంతాలను టార్గెట్ చేస్తూ ఐఎస్ మిలిటెంట్లు దాడులకు పాల్పడ్డారు.

ఫొటో క్యాప్షన్,

హెల్మాండ్ ప్రాంతంలో చిన్నారులు

అధ్యయనం ఎలా జరిగింది?

బీబీసీ అధ్యయనం 2017 ఆగస్టు 23 నుంచి నవంబర్ 21 మధ్య జరిగింది.

క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం చాలా కష్టమైన పనే. అయినా బీబీసీ ప్రతినిధులు దేశంలోని 399 జిల్లాల్లోని 12,00 మందికి పైగా స్థానికులతో మాట్లాడారు. మారుమూల గ్రామాలకూ బస్సుల్లో వెళ్లారు.

కొందరు ముఖాముఖిగా మాట్లాడుతూ వివరాలు చెప్పారు. మరి కొందరు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)