ట్రంప్-రష్యా: ఎఫ్‌బీఐది అధికార దుర్వినియోగమంటూ రిపబ్లికన్ల మెమో

  • 3 ఫిబ్రవరి 2018
డొనాల్డ్ ట్రంప్ Image copyright AFP

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారం, రష్యా పాత్రపై దర్యాప్తు చేస్తున్న ఎఫ్‌బీఐ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ మెమో జారీ చేసింది.

ట్రంప్ సహాయకుడి మీద గూఢచర్యం చేయటం కసం ఎఫ్‌బీఐ నిరాధారమైన సాక్ష్యాలను ఉపయోగించిందని రిపబ్లికన్లు రచించిన ఈ మెమో ఆరోపిస్తోంది.

ఈ మెమోను విడుదల చేయరాదని ఎఫ్‌బీఐ హెచ్చరించింది. కీలక వాస్తవాలను అందులో చేర్చలేదని తప్పుపట్టింది.

ట్రంప్ ఎన్నికల ప్రచారానికి, రష్యాకు గల సంబంధాలపై కొనసాగుతున్న దర్యాప్తును పట్టాలుతప్పించే లక్ష్యంతోనే ఈ మెమో జారీ చేశారని డెమొక్రాట్లు ధ్వజమెత్తారు.

2016 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ప్రచారంతో రష్యా కుమ్మక్కయిందా అనే అంశంపై జరుగుతున్న దర్యాప్తుపై రిపబ్లికన్లు, డెమొక్రాట్ల మధ్య రగులుతున్న వివాదానికి తాజా మెమో ఆజ్యం పోసింది.

Image copyright Reuters
చిత్రం శీర్షిక ట్రంప్ ఎన్నికల ప్రచార బృందానికి విదేశీ విధానంపై సలహాదారుగా పనిచేసిన కార్టర్ పేజ్ మీద నిఘా పెట్టటానికి ఎఫ్‌బీఐ కోర్టు వారెంట్ పొందింది

మెుమోలో ఏముంది?

ట్రంప్ ఎన్నికల ప్రచార బృందానికి విదేశీ విధానంపై సలహాదారుగా పనిచేసిన కార్టర్ పేజ్ మీద వైర్‌ట్యాపింగ్ నిర్వహించటానికి కోర్టు ఇచ్చిన అనుమతి కేంద్రంగా ఈ మెమో జారీచేశారు. కార్టర్ పేజ్ మీద ఎఫ్‌బీఐ ఎలక్ట్రానిక్ నిఘా ఉంచింది.

ఆయన మీద గూఢచర్యం చేయటం కోసం 2016 అక్టోబర్‌లో కోర్టు వారంట్ పొందటానికి ఎఫ్‌బీఐ, న్యాయ శాఖలు నిరాధారమైన, డెమొక్రటిక్ పార్టీ నిధులతో తయారైన నిరాధారమైన నివేదికను ఉపయోగించుకున్నాయని ఈ మెమో ఆరోపిస్తోంది.

అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ప్రత్యర్థి అయిన హిల్లరీ క్లింటన్ ప్రచార బృందం పాక్షికంగా నిధులు సమకూర్చిన నివేదిక ప్రాతిపదికగా వారెంట్ కోరుతున్నామని ఎఫ్‌బీఐ, న్యాయశాఖలు అధికారులకు చెప్పలేదని ఆ మెమో తప్పుపడుతోంది.

ఆ నివేదిక రూపకర్త అయిన మాజీ బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ క్రిస్టొఫర్ స్టీలే.. డొనాల్డ్ ట్రంప్ ఆ ఎన్నికల్లో గెలవకూడదని తాను బలంగా కోరుకున్నట్లు న్యాయశాఖలోని ఒక సీనియర్ అధికారితో పేర్కొన్నారని కూడా మెమో చెప్తోంది.

‘‘అమెరికా ప్రజలను అత్యాచారాల నుంచి పరిరక్షించటానికి ఏర్పాటైన న్యాయ ప్రక్రియలు కుప్పకూలింద’’నటానికి ఇది నిదర్శనమని ఆ నివేదిక పేర్కొంది.

ఈ మెమో అత్యంత రహస్యమైనది. కానీ దీనిని బహిర్గతం చేయటానికి హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీ సోమవారం నాడు, అధ్యక్షుడు ట్రంప్ శుక్రవారం నాడు ఆమోదం తెలిపారు.

Image copyright AFP
చిత్రం శీర్షిక ప్రజా విశ్వాసాన్ని 'తీవ్రంగా ఉల్లంఘించినట్లు' ఈ మెమో చూపుతోందని మెమో రచయిత, రిపబ్లికన్ పార్టీ సెనెటర్ డెవిన్ న్యూన్స్ వ్యాఖ్యానించారు

రిపబ్లికన్లు ఎలా స్పందించారు?

ఈ మెమోలోని అంశాల గురించి అధ్యక్షుడు ట్రంప్‌ను ప్రశ్నించగా.. ‘‘చాలా మంది తమను చూసి తాము సిగ్గుపడాలి’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

తన రిపబ్లికన్ పార్టీని దెబ్బతీయటానికి ఎఫ్‌బీఐ, న్యాయ విభాగం దర్యాప్తులను ఉన్నతాధికారులు రాజకీయం చేస్తున్నారని ట్రంప్ శుక్రవారం ఆరోపించారు.

ప్రజా విశ్వాసాన్ని ’’తీవ్రంగా ఉల్లంఘించినట్లు’’ ఈ మెమో చూపుతోందని, దీనిద్వారా సంస్కరణలు మొదలవుతాయని తాను ఆశిస్తున్నానని.. మెమో రచయిత, రిపబ్లికన్ పార్టీ సెనెటర్ డెవిన్ న్యూన్స్ వ్యాఖ్యానించారు.

తాను ఈ మెమోతో న్యాయ విభాగంపై కేసు వేస్తానని కార్టర్ పేజ్ పేర్కొన్నారు.

అయితే రిపబ్లికన్ సెనెటర్లందరూ ఈ మెమో విడుదలకు మద్దతివ్వలేదు. ఎఫ్‌బీఐ మీద, న్యాయ విభాగం మీద తన పార్టీ సహచరులు దాడి చేయటాన్ని సెనెటర్ జాన్ మెక్‌కెయిన్ తీవ్రంగా విమర్శించారు. చట్టాన్ని ట్రంప్ కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు.

Image copyright Joe Raedle/Getty Images
చిత్రం శీర్షిక ఈ మెమోతో ‘ట్రంప్ తన మిత్రుడు పుతిన్‌కు పుష్పగుచ్ఛం పంపించార'ని డెమొక్రటిక్ సభాపక్ష నేత నాన్సీ పెలోసీ విమర్శించారు

ఇతర ప్రతిస్పందనలు ఎలా ఉన్నాయి?

ఎఫ్‌బీఐని, 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై దర్యాప్తులను ‘‘అప్రతిష్ఠ పాలు చేయటానికి సిగ్గుమాలిన ప్రయత్నం’’ ఈ మెమో అని డెమొక్రాట్ సభ్యులు అభివర్ణించారు.

‘‘నిఘా వర్గాలు, పద్ధతులను పరిరక్షించకపోవటం ద్వారా (ట్రంప్) తన మిత్రుడు పుతిన్‌కు పుష్పగుచ్ఛం పంపించారు’’ అని డెమొక్రటిక్ సభాపక్ష నేత నాన్సీ పెలోసీ విమర్శించారు.

న్యాయ విభాగంలో సీనియర్ అధికారులను కానీ రష్యాతో ట్రంప్ ఎన్నికల ప్రచార బృందం సంబంధాల ఆరోపణలపై దర్యాప్తు చేయటానికి నియమితుడైన ప్రత్యేక న్యాయవాదిని కానీ తొలగించటానికి ఈ మెమోను ‘‘సాకు’’గా వాడుకోరాదని డెమోక్రాట్లు ఒక లేఖలో ట్రంప్‌ను హెచ్చరించారు.

Image copyright Mark Wilson/Getty Images
చిత్రం శీర్షిక ‘మన బాధ్యతను స్వతంత్రంగా, చట్టబద్ధంగా నిర్వర్తించాలన్న సంకల్పానికి కట్టుబడి ఉన్నా’ అంటూ ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టొఫర్ రే తమ సిబ్బందికి ఈమెయిల్ పంపించారు

అలా చేస్తే రాజ్యాంగ సంక్షోభం తలెత్తుతుందని వారు పేర్కొన్నారు.

ఇదిలావుంటే.. ‘‘పక్షపాతపూరిత రాజకీయాలు తమను తమ పని నుంచి దృష్టి మళ్లించటానికి తాము అనుమతించ’’బోమని ఎఫ్‌బీఐ ఏజెంట్లు అంటున్నారు.

‘‘మాటలు చౌకబారువి. మీరు చేసే పని వీటిని తట్టుకుని నిలుస్తుంది. మనం మన బాధ్యతను స్వతంత్రంగా, చట్టబద్ధంగా నిర్వర్తించాలన్న మన ఉమ్మడి సంకల్పానికి నేను కట్టుబడి ఉన్నా. నేను మీతో కలిసివున్నా’’ అని ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టొఫర్ రే తమ సిబ్బందికి రాసిన ఈమెయిల్‌లో పేర్కొన్నారు.

ఈ మెమో ‘‘కపటపూరితం, తప్పుదారి పట్టించేది’’ అని ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ జేమ్స్ కోమీ ట్వీట్ చేశారు. ఆయనను ట్రంప్ గత మే నెలలో ఎఫ్‌బీఐ చీఫ్ పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)